ఆదిలాబాద్, అక్టోబరు 17 (నమస్తే తెలంగాణ) : గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు గిరిజనుల ఉపాధికి చేయూత అందించేందుకు కృషి చేస్తున్నామని మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండలం మూలాల గుట్టలో వెదురు మొక్కల పెంపకం పైలట్ ప్రాజెక్టును మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంతోష్‌కుమార్ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమానికి తనవంతు సహకారాన్ని అందించేందుకు గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఏడేండ్లుగా 20 కోట్ల మొక్కలు నాటి సంరక్షిస్తున్నట్టు వివరించారు.
ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనులు చేతి వృత్తులు, హస్తకళల ప్రావీణ్యంతో వివిధ రకాల వెదురు వస్తువులను తయారు చేసి ఉపాధి పొందేవారని, వెదురు చెట్లు లేకపోవడంతో వారికి ఉపాధి కరువైందని చెప్పారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో వెదురు పెంపకాన్ని చేపట్టి గిరిజనులు ఉపాధి పొందేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మూలాలగుట్టకు చెందిన గిరిజన పెద్ద రావూజీ పటేల్ తన ఐదు ఎకరాల్లో వెదురు చెట్లను పెంచేందుకు ఆసక్తి చూపిస్తున్న విషయం తమ దృష్టికి రాగా మొక్కల పెంపకం ప్రారంభించామని వివరించారు. నాటిన మొక్కలను మూడేండ్లు కాపాడే బాధ్యత తమదేనని పేర్కొన్నారు. జిల్లాలో హస్తకళల గిరిజన కళాకారులకు ప్రోత్సాహం అందించి వారి ఉపాధికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.