Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యమవుతున్నాయి. పంచాయతీలు పటిష్టంగా ఉంటేనే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందన్న గాంధీజీ మాటలు నీటి మూటలవుతున్నాయి. దేశానికి పట్టుగొమ్మలుగా ఉండాల్సిన పల్లెలు ప్రగతిలో పడకేశాయి. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు వాటిలో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేకపోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 15నెలలు అవుతున్నా స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర ప్రభుత్వంతోపాటు, 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి.
ఫలితంగా గ్రామాల్లో కనీస వసతులు కల్పించేందుకు పంచాయతీ కార్యదర్శులు తమ సొంత డబ్బును వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో పల్లెలు ప్రగతిపథంలో పరుగులు తీస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలోనే అభివృద్ధి ఆగిపోయింది. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలన్న ధ్యేయంతో కేంద్ర ప్రభుత్వం ఏటా ఏప్రిల్ 24న దేశవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. అందులో భాగంగా గురువారం తెలంగాణలోనూ ఈ దినోత్సవాన్ని నిర్వహించబోతున్నప్పటికీ రేవంత్రెడ్డి సర్కారు వైఫల్యాల వల్ల అభివృద్ధి పడకేయడంతో రాష్ట్రంలోని ఏ గ్రామంలోనూ ఉత్సాహం కనిపించలేదు.
పంచాయతీ కార్మికులు క్యాటగిరీలవారీగా కారోబార్, బిల్ కలెక్టర్, వాటర్మెన్ ఉండాలి. కానీ, జీవో 51 తీసుకొచ్చి కలగూరగంపలా మార్చారు. అందరూ అన్ని పనులు చేయాల్సిందేనని చెప్పారు. ఎవరిని ఎప్పుడు తొలగిస్తరో తెలియదు. మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. బ్యాంకు ఖాతాల ద్వారా ఆన్లైన్లో వేతనాలు చెల్లిస్తామని చెప్పిన ఉన్నతాధికారులు.. ఇప్పుడు కొత్తగా మే నుంచి ఖాతాల్లో వేతనాలు వేస్తామంటున్నారు. జీపీ ఖాతాల్లో బడ్జెట్ లేదు. గ్రామ పంచాయతీలకు ఎలాంటి నిధులు రావడం లేదు.