హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు (Panchayati Elections) ఒకట్రెండు రోజుల్లోనే నగారా మోగనున్నట్టు తెలుస్తున్నది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి సోమవారం హైకోర్టులో విచారణ జరగాల్సి ఉండగా మంగళవారానికి వాయిదా పడింది. మంగళవారం హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సమాచారాన్ని సమర్పించనున్నది. రిజర్వేషన్ల జోలికి (Reservations) వెళ్లకుండా పార్టీ పరమైన రిజర్వేషన్లతో ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నది. సోమవారం ఎన్నికల సంఘానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల సమాచారాన్ని అందించింది. జిల్లాలవారీగా, రెవెన్యూ మండలాలవారీగా వివరాలను ఎన్నికల సంఘానికీ పంపింది. ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్టు చెప్పింది.
ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం కూడా సమావేశమైంది. ఎన్నికల ఏర్పాట్లపై చర్చించింది. మంగళవారం జరిగే విచారణలో హైకోర్టు ఆదేశాలిస్తే ఎన్నికల సంఘం తక్షణమే షెడ్యూల్ విడుదల చేయాలని భావిస్తున్నది. మంగళవారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం హడావుడిగా షెడ్యూల్ విడుదల చేస్తుందా? లేక బుధవారం చేస్తుందా? అన్న చర్చ జరుగుతున్నది. అయితే, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం తన నియోజకవర్గం కొడంగల్లో మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు, మూడు రోజుల్లో పంచాయతీ ఎన్నికలు వస్తాయని కూడా చెప్పారు. దీంతో మంగళవారం హైకోర్టు తీర్పు, మంత్రివర్గ సమావేశం ఉన్నందున బుధవారం ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికల ప్రక్రియను డిసెంబర్ రెండోవారానికి ముగించాలని యోచిస్తున్నారు. అంతా అనుకునట్టు జరిగితే డిసెంబర్ 20లోపే ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని అధికారులు చెప్తున్నారు.