హైదరాబాద్, మే 5(నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలు కేంద్రాలు సమస్యల నిలయంగా మారాయి. దాదాపు అన్ని కేంద్రాల్లోనూ సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. వానొస్తే కప్పేందుకు టార్పాలిన్స్ లేవు, ధాన్యం నింపేందుకు గన్నీ సంచులు లేవు, నింపిన బస్తాలు ఎత్తేందుకు హమాలీలు లేరు. ఎత్తిన సంచులు తీసుకెళ్లేందుకు లారీలు లేవు. చివరికి రైతులకు గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకని దయనీయ పరిస్థితి. ఈ సమస్యలన్నీ ప్రభుత్వానికి, పౌరసరఫరాల సంస్థ అధికారులకు తెలియనివి కావు. ఆయా సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎండకు ఎండి.. వానకు తడుస్తున్న ధాన్యం
ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యానికి తోడు అకాల వర్షాలు రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. మొన్నటివరకు వడగండ్ల వర్షాలతో చాలామంది రైతులు పొలాల్లోనే పంట నష్టపోయారు. ఇప్పుడు అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దవుతున్నది. కొన్నిచోట్ల కొట్టుకుపోతున్నది. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాల బారి నుంచి ధాన్యాన్ని కాపాడుకోవడం రైతులకు కత్తిమీద సాములా మారింది. మరోవైపు, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు టార్పాలిన్స్ అందుబాటులో లేవు. ఈ సీజన్లో ప్రభు త్వం టార్పాలిన్స్ను సరఫరా చేయడంలో విఫలమైందనే విమర్శలున్నాయి. ధాన్యం కొనుగోళ్లు మొదలై నెలన్నర గడుస్తున్నా అధికారులు టార్పాలిన్స్ సమకూర్చలేదు. ఇప్పుడిప్పుడే టెండర్లు పిలిచి సరఫరా మొదలు పెట్టారు. ఈలోగా రైతులకు జరగాల్సిన నష్టం జరిగిపోతున్నది. ధాన్యం ఎండకు ఎండి, వానకు తడుస్తున్నది.
ఎత్తేందుకు హమాలీలు లేరు..తీసుకెళ్లేందుకు లారీలు లేవు
ధాన్యం కొనుగోళ్లలో హమాలీలు, లారీల కొరత రైతులను వేధిస్తున్నది. ధాన్యం నింపేందుకు గన్నీ సంచులు కూడా కరువయ్యాయి. ప్రస్తుతం 17.5 కోట్ల గన్నీ సంచులు అవసరం కాగా, 9.45 కోట్ల గన్నీ సంచులు మాత్రమే అందుబాటులో ఉన్నట్టు ప్రభుత్వమే చెప్తున్నది. సకాలంలో గన్నీ సంచులు అందుబాటులో లేకపోవడంతో ఈ ప్రభావం ధాన్యం కొనుగోళ్లపై పడుతున్నది. కొన్ని కేంద్రాల్లో ఎన్నోకొన్ని గన్నీ సంచులు అందుబాటులో ఉన్నప్పటికీ, అక్కడ ధాన్యం ఎత్తేందుకు హమాలీల కొరత ఏర్పడుతున్నట్టు తెలిసింది. దీనికితోడు లారీల సమస్య కూడా రైతులను ఇబ్బంది పెడుతున్నది. జిల్లాల్లో సరైన సంఖ్యలో లారీలు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం తరలింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలకు రెండు మూడు రోజులకు ఒక లారీ వస్తున్నదని నిర్వాహకులు చెప్తున్నారు. మరోవైపు, మిల్లుల్లో అన్లోడింగ్ ఆలస్యం అవుతుండటంతో లారీలన్నీ మిల్లుల్లోనే రెండు మూడు రోజులు నిలిచిపోతున్నట్టు తెలిసింది.
15 రోజులు కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు
ధాన్యం విక్రయించేందుకు రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తున్నది. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చినప్పటి నుంచి అది మిల్లులో అన్లోడింగ్ అయ్యే వరకు పూర్తి బాధ్యత రైతులదే. తాము ధాన్యం తెచ్చినప్పటి నుంచి మిల్లులో అన్లోడింగ్ అయ్యేవరకు సుమారు 15-20 రోజులు పడుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీంతో రైతులు ఇతర పనులన్నీ వదిలేసి కొనుగోలు కేంద్రాల్లోనే జాగారం చేస్తున్నారు.
పట్టింపులేని అధికారులు
ధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకులు, అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. కొనుగోలు ఏర్పాట్ల విషయంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారనే విమర్శలొస్తున్నాయి. వాస్తవానికి, ధాన్యం కొనుగోళ్ల ప్రారంభానికి ముందే అవసరమైన గన్నీ సంచులు, పరికరాలు సమకూర్చుకోవాలి. లారీల కోసం టెండర్లు పూర్తిచేయాలి. కానీ, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించిన తర్వాత గానీ సౌకర్యాల కల్పనపై దృష్టి సారించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.