పర్వతగిరి, మే 18: కాంగ్రెస్ సర్కారు అన్నదాతల సమస్యలను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. ఆదివారం ఆయన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింత నెకొండ, కొంకపాక గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాము తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనకుండా జాప్యం చేస్తున్నారని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేయగా.. ఎర్రబెల్లి వెంటనే కలెక్టర్ సత్యశారదకు ఫోన్‌చేసి సమస్యలను వివరించారు.
సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్టు ఎర్రబెల్లి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సర్కారు నిర్లక్ష్యం రైతుల ప్రాణాల మీదకు తెచ్చిందని అన్నారు. సాగు నీరందించడంలో విఫలమైన సీఎం రేవంత్‌రెడ్డి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో, ధాన్యం కొనుగోలులో విఫలమయ్యారని మండిపడ్డారు. సన్న ధాన్యానికి బోనస్ ఇవ్వడం లేదని ఆరోపించారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోతే ఆదుకోకుండా సర్కారు మొద్దు నిద్రలో ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతున్నదని ఆవేదనచెందారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నా పాలకుల్లో చలనం లేదని మండిపడ్డారు. సరారు, మిల్లర్లు కలిసి డబుల్ గేమ్ ఆడుతూ రైతులను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. తడిసిన ధాన్యాన్ని 48 గంటల్లో కొనుగోలు చేసి వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమచేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ధాన్యం విక్రయించి పది రోజులైనా డబ్బులు రావడం లేదని అన్నారు. పెండింగ్‌లో ఉన్న రూ.500 కోట్ల బోనస్ కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.