నిజామాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయకపోతే జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు. రైతులే స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ రవాణాను స్తంభింపజేస్తారని స్పష్టంచేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వడ్ల కొనుగోలులో జరుగుతున్న అంతులేని జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం ఆయన రైతులతో కలిసి మోర్తాడ్ మండల కేంద్రంలో రెండున్నర గంటలపాటు జాతీయ రహదారి 63పై బైఠాయించారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా భీష్మించుకుని కూర్చున్నారు. ధాన్యం కొనుగోలుపై కలెక్టర్ స్పందించకపోవడం, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫోన్ ఎత్తకపోవడంపై మండిపడ్డారు. కొనుగోళ్లపై కలెక్టర్ స్వయంగా వచ్చి హామీ ఇచ్చేంతవరకు కదిలేది లేదని తేల్చిచెప్పడంతో అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డి అక్కడికి వచ్చి వేములతో చర్చించారు.
అదనపు కలెక్టర్.. కలెక్టర్ ఇలా త్రిపాఠికి ఫోన్ చేసి వేములతో మాట్లాడించారు. ఈ సందర్భంగా కొనుగోళ్ల తీరుపై మాజీ మంత్రి కలెక్టర్‌తో తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. రెండు రోజులుగా తాను ఫోన్ చేస్తే ఎత్తకపోవడంపై నిలదీశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఉండటం వల్ల ఫోన్ ఎత్తలేదని కలెక్టర్ సమాధానమిచ్చారు. తన నియోజకవర్గంలో ఎక్కడి వడ్ల సంచులు అక్కడే ఉన్నాయని, కనీసం స్పందించకపోతే ఎలా అంటూ అడిగారు. పది రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేయని పక్షంలో ఎన్‌హెచ్ 44, ఎన్‌హెచ్ 63 దిగ్బంధిస్తామని స్పష్టంచేశారు. రైతులే రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ రవాణాను స్తంభింపజేస్తారని సూచించారు. ఎన్‌హెచ్ 44పై పోచంపాడ్, బుస్సాపూర్, నల్లూర్, ముప్కాల్, బాల్కొండ, చిట్టాపూర్ వరకు, ఎన్‌హెచ్ 63పై లక్కోర, వేల్పూర్, పడగల్, అంక్సాపూర్, దొన్కల్, గండ్లాపేట్, మోర్తాడ్, కమ్మర్‌పల్లిలో దిగ్బంధం చేస్తామని స్పష్టంచేశారు.
సీఎం రేవంత్ తోలు తీయాలి..
అనంతరం వేముల రైతులనుద్దేశించి మాట్లాడుతూ.. కొనుగోలు విషయంలో సర్కార్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రాల్లో గన్నీ సంచులుంటే లారీలు రావడం లేదని, లారీలు ఉంటే గన్నీ సంచులు ఉండటం లేదని ఆరోపించారు. కొనుగోళ్లకు ముందే గన్నీ సంచులు అందుబాటులో పెట్టుకోవాలనే తెలివి, బుద్ధి ఈ ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. ధాన్యం సేకరణ ప్రక్రియ నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. వడ్లు కొనకూడదని సర్కార్ నిర్ణయించుకున్నదని, అందుకు పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నదని చెప్పారు. వడ్లకు తాలు తీస్తే తోలు తీస్తానంటూ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి చెప్పిన విషయాన్ని వేముల గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి పాలనలో 45కిలోలు చొప్పున తూకం వేస్తూ రైతును దోపిడీ చేస్తున్నారని, మరిప్పుడు ఎవరి తోలు తీయాలని ప్రశ్నించారు.
నిజామాబాద్ జిల్లాలో ఏ ఊరిలోనైనా వందకు వంద శాతం రూ.2లక్షలు రైతు రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు వేముల ప్రశాంత్‌రెడ్డి సవాల్ విసిరారు. రుణమాఫీ జరుగలేదని తేలితే ఏం చేస్తారో పీసీసీ చీఫ్ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల ఇబ్బందులపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఫోన్ చేస్తే స్పందించడం లేదని మాజీ మంత్రి వేముల ఆరోపించారు. ఫోన్ చేస్తే కనీసం ఎత్తడం లేదని మండిపడ్డారు. మంత్రి స్పందించరు. ముఖ్యమంత్రికి ఢిల్లీ వెళ్లేందుకు ఎక్కే విమానం… దిగే విమానం తప్ప టైమ్ లేదని విమర్శించారు. దొడ్డు రకానికి గ్రేడ్-2 ధర ఇస్తున్నారని అందులోనూ రూ.20 మెక్కుతున్నారని మండిపడ్డారు. దొడ్డు రకానికి గ్రేడ్-1 మద్దతు ధర కల్పించాలని, అన్ని రకాల పంటలకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.