హైదరాబాద్, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ): వారం రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి విధివిధానాలు ఖరారు చేసి అక్టోబర్ 15 నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపడతామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 80 లక్షలమందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు దానికి సంబంధించిన విధివిధానాలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారు.