Runa Mafi | హైదరాబాద్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ): రూ.2 లక్షలకుపైగా ఉన్న రైతు రుణాల మాఫీకి త్వరలోనే కటాఫ్ తేదీని ప్రకటిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రూ.2 లక్షలకుపైగా రుణం ఉన్న అర్హులైన రైతులు ముందుగా ఆపై రుణాన్ని చెల్లించిన తరువాత మాఫీ చేస్తామని ప్రభుత్వం ముందే ప్రకటించిందని గుర్తుచేశారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీకి రేషన్‌కార్డు ప్రామాణికం కాదని, తెల్ల రేషన్‌కార్డు ఆధారంగా రుణమాఫీ చేస్తున్నామనేది పూర్తిగా అవాస్తవమని స్పష్టంచేశారు.
ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఎక్కడైనా అధికారులు తెల్ల రేషన్‌కార్డు ఆధారంగా రుణమాఫీ చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటివరకు రూ.18 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని, ఇంకా రూ.12 వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉన్నదని వెల్లడించారు. రూ.2 లక్షలకు పైబడిన రుణమాఫీకి నెలో, రెండు నెలలో కటాఫ్ తేదీ పెట్టి, రైతులు ఎక్కువ ఉన్న రుణాన్ని చెల్లించగానే వారి ఖాతాలో రూ.2 లక్షలు జమ చేస్తామని వివరించారు.
ఈ నిబంధన ఎందుకు పెట్టారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, రైతులకు రుణమాఫీ తర్వాత మళ్లీ లోన్ రావాలంటే పూర్తిగా రుణం మాఫీ కావాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. అందుకే రూ.2 లక్షలకుపైగా ఉన్న రుణం రైతులు చెల్లిస్తే వారికి మొత్తం మాఫీ అయి, తర్వాత మళ్లీ రుణం వస్తుందని తెలిపారు. సాంకేతిక కారణాలతో రూ.2 లక్షల వరకు రుణం ఉన్న కొందరు రైతులకు రుణమాఫీ కాలేదని, వారికి కూడా పూర్తిస్థాయిలో మాఫీ చేస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు.
రేవంత్‌రెడ్డిని సీఎం కుర్చీ నుంచి దించేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, ఇందుకోసం తనను, భట్టి విక్రమార్కను, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని సాకుగా చూపుతున్నారని పొంగులేటి పేర్కొన్నారు. కానీ, తమకు అన్ని విషయాలపై స్పష్టత ఉన్నదని, తమ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే అని స్పష్టంచేశారు. రాష్ట్ర క్యాబినెట్‌కు సుతీ సన్నాయి లేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన సమాధానమిచ్చారు. ‘మా క్యాబినెట్‌కు ఏముందో మాకు తెలుసు.. మా క్యాబినెట్ ఎంత స్వేచ్ఛా వాతావరణంలో పనిచేస్తున్నదో మాకు తెలుసు. ఏ పవర్స్ ఉన్నాయో మాకు తెలుసు’ అని పేర్కొన్నారు. తల తాకట్టు పెట్టయినా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారు.
తెల్ల రేషన్‌కార్డులకు సంబంధించి మంత్రులతో సబ్‌కమిటీ వేశామని, త్వరలోనే కార్డులు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ప్రజల అభిప్రాయం మేరకు తెల్ల రేషన్‌కార్డులను, ఆరోగ్యశ్రీ కార్డులను వేర్వేరుగా ఇస్తామని తెలిపారు. ఇక కొత్త రెవెన్యూ చట్టాన్ని దేశానికి ఆదర్శంగా తీసుకొస్తున్నట్టు తెలిపారు. ప్రజలు, మేధావుల నుంచి సూచనలు, సలహాలు తీసుకునేందుకు ఈ నెల 23, 24, 25 తేదీల్లో రెవెన్యూ యాక్ట్‌పై కలెక్టరేట్లలో సదస్సులు నిర్వహిస్తున్నట్టు వివరించారు.
పేదలందరికీ నాలుగేండ్లలో ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. తొలి విడతలో రూ. 22 వేల కోట్లతో నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.50 లక్షలు ఇండ్లు నిర్మిస్తామని తెలిపారు. సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండించారు. నిజంగానే దాడి జరిగి ఉంటే, నివేదిక రాగానే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.