కలెక్టరేట్, నవంబర్ 17: ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) నిర్మాణదారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇండ్లు నిర్మించుకునే లబ్దిదారులకు దశల వారీగా చెల్లించే మొత్తంలో ప్రభుత్వం కోత పెట్టింది. స్లాబ్ వేసిన అనంతరం చెల్లించాల్సిన రూ.2లక్షల మొత్తంలో నుంచి రూ.60వేలు కోత పెడుతున్నట్లు ప్రకటించింది. రూ.1.40లక్షలు మాత్రమే లబ్దిదారుల ఖాతాల్లో జమచేస్తామంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మిగతా మొత్తాన్ని ఉపాధి హామీ, మరుగుదొడ్ల నిర్మాణం కింద చూపేందుకు నిర్ణయం తీసుకోవటం పట్ల లబ్దిదారుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అప్పో సప్పో చేసి తెచ్చిన సొమ్ముతో స్లాబ్ వేస్తే ప్రభుత్వం ఇచ్చిన అనంతరం తిరిగి అప్పు చెల్లించవచ్చనే ధీమాతో ఉన్న లబ్దిదారులు మంత్రి ప్రకటనతో అవాక్కవుతున్నారు.
ముందు చెప్పేదొకటి.. ఆనంతరం ఆచరణ మరోలా ఉంటుండటంతో ఇంటి నిర్మాణానికి అందించే రూ.5లక్షలు పూర్తిస్థాయిలో ఖాతాలో జమచేస్తారా? లేదా? అనే అయోమయం నిర్మాణదారుల్లో నెలకొన్నది. కేంద్రం నుంచి విడుదలయ్యే నిధులు కాకుండా తామే సొంతంగా రూ.5లక్షలు అందిస్తున్నట్లుగా చెప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వ్యవహరిస్తున్న తీరుపై ఆక్షేపణల వెల్లువ సాగుతోంది. ఇంటి నిర్మాణానికి, ఉపాధి హామీ పనికి లింకు పెట్టడంపై అనేక మంది లబ్దిదారులు మండిపడుతున్నారు. జాబ్కార్డుల్లేని వారందరికీ ఎలా బిల్లులు చెల్లిస్తారని ప్రశ్నిస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో ఇండ్ల నిర్మాణం చేపట్టిన వారిలో సగానికి పైగా మందికి జాబ్ కార్డులు లేవు. ఉన్న వారికి కూడా రూ.60వేలు జమ అయ్యే పరిస్థితులు లేవని గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. ఉపాధి కార్డులున్న వారికి 90 రోజుల పనిదినాలు లెక్కించి నగదు అందజేస్తామని చెప్పినా.. రోజుకు రూ. 307 చొప్పున మూడు నెలలకు రూ.27,690 జమచేయనున్నారు. అలాగే, వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి స్వచ్ఛభారత్ మిషన్ పథకంలో భాగంగా రూ.12వేలు విడుదల కానుండగా, ఈమొత్తం కలిపితే రూ.39,630 మాత్రమే లబ్దిదారుల ఖాతాల్లోకి వెళ్ళనున్నాయి. మరో రూ. 20,970 లబ్దిదారుకు చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తం ఎలా జమచేస్తారనే దానిపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వకపోవటంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది.
అష్టకష్టాలు పడి ఇందిరమ్మ ఇల్లు దక్కించుకుని నిర్మాణం మొదలుపెడితే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తమను మరింత అప్పుల్లోకి నెట్టే సూచనలే అధికంగా కనిపిస్తున్నాయనే ఆవేదన వారి నుంచి వ్యక్తమవుతున్నది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 11,123 మందికి ఇండ్లు మంజూరు కాగా, వీటిలో 1,176 మంది సకాలంలో ముగ్గుపోయకపోవటంతో వాటిని అధికారులు రద్దు చేశారు. 9,947 ఇండ్ల గ్రౌండింగ్ పూర్తికాగా, వీటిలో 4,679 ఇండ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. 1,886 ఇండ్లు బేస్మెంట్ లెవల్లో, 1,327 రూఫ్ లెవల్లో, 1,466 ఇండ్లు స్లాబు పూర్తయి ఉన్నాయి. వీటిలో 1,238 మందికి మాత్రమే ఇప్పటివరకు మూడో విడతగా చెల్లించాల్సిన రూ.2లక్షల మొత్తం ఖాతాల్లో జమ అయినట్లు తెలుస్తోంది. మిగతా వారికి రూ.1.40 లక్షలు మాత్రమే చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఎంపికై నిర్మాణ పనులు ప్రారంభించిన వారికి దశల వారీగా రూ.5లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అధికారులు సూచించే మ్యాపు మేరకు పునాదులు తీసి, బేస్మెంట్ నిర్మించుకున్న ఆనంతరం రూ లక్ష, దర్వాజలు, కిటికీలతో బీము లెవల్ గోడలు రాగానే మరో రూ.లక్ష, స్లాబు వేసిన అనంతరం రూ.2లక్షలు, ప్లాస్టరింగ్, లావెట్రిన్లు పూర్తి కాగానే చివరి విడతగా రూ.లక్ష లబ్దిదారుల ఖాతాలో జయచేయాల్సి ఉంటుంది. అయితే, స్లాబు అనంతరం చెల్లించాల్సిన రూ.2లక్షల నుంచి రూ.60వేలు కోత పెట్టడమే కాకుండా ఆమొత్తాన్ని చెల్లించేవిధానంపై కూడా పూర్తి క్లారిటీ లేదు. దీంతో, ముందుగా ప్రకటించిన మేరకు రూ.5 లక్షల చెల్లింపుపై అనుమానాలు వ్యక్తమవుతుండగా, ముందు ముందు ఇంకేమి కోతలు పెడుతుందోననే భయం లబ్దిదారుల నుంచి వ్యక్తమవుతున్నది.
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇంటి నిర్మాణం చేపట్టిన లబ్దిదారులకు ప్రకటించిన రూ.5 లక్షల మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని హౌసింగ్ పీడీ శ్రీనివాస్ అన్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు రాగానే స్లాబు వేసిన అనంతరం చెల్లించాల్సిన మొత్తంలో రూ.60వేలు ఉపాధి హామీ, స్వచ్చ భారత్ మిషన్ పథకాల కింద వారి ఖాతాల్లో జమచేస్తామని చెప్పారు.
ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్లు స్లాబు వేసిన తర్వాత రూ.2లక్షలు చెల్లించాలని చిగురుమామిడి మండలానికి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారులు డిమాండ్ చేస్తున్నారు. అప్పు తెచ్చి ఇంటి పనులు కొనసాగిస్తున్నామన్నారు. బిల్లు వచ్చిన అనంతరం తిరిగి చెల్లించవచ్చనే ధీమాతో తాము అప్పు తెస్తే, ఉపాధి హామీ పనులు, వ్యక్తిగత మరుగుదొడ్ల కింద చూపటం సరైన విధానం కాదని మండిపడుతున్నారు. ఆ రూ.60వేలు తమ ఖాతాల్లో జమచేస్తే ప్లాస్టరింగ్తో పాటు మిగిలిపోయిన పనులు కూడా చేసుకునే అవకాశముంటుందని చెప్పారు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలని కోరుతున్నారు.