Kodangal | సీఎం రేవంత్ రెడ్డి ఇలాకలో ఉపాధ్యాయులు లేక ఓ పాఠశాల మూతపడింది. కొడంగల్ మండలం అప్పాయిలపల్లి అనుబంధ గ్రామమైన ఆశమ్మకుంట తండాలో గత 15 రోజులుగా ఉపాధ్యాయులు లేకపోవడంతో పాఠశాల మూతపడింది. ఈ పాఠశాలలో గతంలో ఒక ఉపాధ్యాయుడు ఉండగా అతను ట్రాన్స్ఫర్ అయ్యాడు. అతని స్థానంలో ఇంకొక ఉపాధ్యాయుడిని నియమించారు. కానీ అతను పెళ్లి ఉందని నెల రోజులు సెలవు పెట్టి వెళ్లిపోయాడు. దీంతో 15 రోజులుగా ఆ పాఠశాల మూతపడింది.
మరోవైపు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని పలు గిరిజన పాఠశాలలు ఉపాధ్యాయులు లేక వారం రోజులుగా తెరుచుకోవడంలేదు. కేబీ కాలనీ మొగడ్‌ధగడ్, శివలింగపూర్, కనికి, జనగాం ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లారు. గురుడుపేట గిరిజన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మెడికల్ లీవ్‌లో ఉండటంతో 5 గిరిజన పా ఠశాలలు మూతపడ్డాయి. రోజూ విద్యార్థులు పాఠశాలకు వచ్చి.. ఉపాధ్యాయు లు లేక తిరిగి వెళ్తున్నారు. ఎస్సీఆర్పీ మడావి పోచానిని వివరణ కోరగా, ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లడంతో పాఠశాలలు నడవడం లేదని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
రాష్ట్రంలో పాఠశాలలు మూతపడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు అని హరీశ్‌రావు ప్రశ్నించారు. విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి వద్దే ఉన్నప్పటికీ విద్య పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు. తక్షణమే పాఠశాలల్లో విద్యా వాలంటీర్లను నియమించి పాఠశాలను మూతపడకుండా చూడాలని, మూతపడ్డ పాఠశాలలను తెరిపించి విద్యా బోధన జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.