హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): గత ఏడాదితో పోల్చితే ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా, సజావుగా సాగుతున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. నిరుడు ఇదే సమయంతో పోల్చితే 10 లక్షల టన్నుల ధాన్యం అధికంగా కొనుగోలు చేసినట్టు చెప్పారు. సరాసరి రోజుకు లక్షన్నర టన్నుల చొప్పున మంగళవారం వరకు 38.50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. మంగళవారం ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సహకారం ఆశించినంత లేకున్నా యాసంగి ధాన్యాన్ని మద్దతు ధరతో సేకరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7 వేల కొనుగోలు కేంద్రాల ద్వారా 6.5 లక్షల మంది రైతుల నుంచి రూ.7,907 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు వివరించారు. ఇప్పటికే 400కి పైగా కొనుగోలు కేంద్రాల్లో సేకరణ పూర్తి కావడంతో, ఆ కేంద్రాలను మూసివేసినట్టు పేర్కొన్నారు.
సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు
కొనుగోలు కేంద్రాల్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ఎక్కడికక్కడ అధికారులు తక్షణమే స్పందిస్తూ పరిష్కరిస్తున్నట్టు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఎఫ్సీఐ నిర్దేశించిన కనీస నాణ్యతా ప్రమాణాల ప్రకారం ధాన్యాన్ని తీసుకురావాలని, తద్వారా ప్రభుత్వానికి సహరించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. విపతర పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించనున్నట్టు తెలిపారు.