వానకాలం సీజన్ ముగిసే దశకు వచ్చింది. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, వాగుల్లో వరద ప్రవాహాలు జోరుగా సాగుతున్నాయి. ఇదే సమయంలో పనిచేసే పంప్‌హౌజ్‌లు మాత్రం.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నడిచే పరిస్థితి లేకుండాపోయింది. ఫలితంగా వాటి ఆయకట్టు పరిధిలోని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
హైదరాబాద్, సెప్టెంబర్1 (నమస్తే తెలంగాణ): సాగునీటి ఎత్తిపోతల పథకాలు ఏడాదిలో 90 నుంచి180 రోజుల వరకు మాత్రమే పనిచేస్తాయి. నీటి వనరుల్లో వరద ప్రవాహం కొనసాగిన సమయంలోనే పంప్‌హౌజ్‌లు పనిచేస్తాయి. 2021లో టెండర్ల ద్వారా ఏజెన్సీలకు పంప్‌హౌజ్‌ల నిర్వహణను ఆనాటి ప్రభుత్వం అప్పగించింది. అందులో కల్వకుర్తి, రాజీవ్‌భీమా పరిధిలో 4 చొప్పున, నెట్టెంపాడులో 3, కోయిల్‌సాగర్, అలీసాగర్, గుత్ప, చౌటుపల్లి హన్మంతరెడ్డి, దేవాదుల్లో ఒక్కోటి చొప్పున పంపింగ్ స్టేషన్ల అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం కొత్తగా టెండర్లను పిలిచి బాధ్యతలను అప్పగిస్తేనే ఆయా పంపింగ్ స్టేషన్ల నిర్వహణ కొనసాగనున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించలేదు. ఓఅండ్ఎం బిల్లులను మంజూరు చేయకపోవడంతో టెండర్లను ఎలా పిలువాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతమున్న ఏజెన్సీలతోనైనా నిర్వహిద్దామని భావిస్తే సంబంధిత కాంట్రాక్టర్లు అందుకు ససేమిరా అంటున్నారు. తొలుత పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, లేదంటే ఓఅండ్ఎంను నిర్వహించేది లేదని అధికారులు తేల్చి చెబుతున్నారు. దీంతో ఈ సీజన్లో ఆయా పంప్‌హౌజ్‌ల నుంచి నీటిని ఎత్తిపోసేదెట్లా? అని అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఓఅండ్ఎం కోసం నిధులను విడుదల చేయాలని మొరపెట్టుకుంటున్నారు.
ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో ఆయా పంపింగ్ స్టేషన్ల కాంట్రాక్టర్లు తమ సిబ్బందికి 6 నెలలుగా వేతనాలను చెల్లించడంలేదు. దీంతో పంపింగ్స్టేషన్లలో పనిచేసే కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించడం లేదంటూ గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల కార్మికులు ఇటీవల రోడ్డెక్కారు. నెలల తరబడి వేతనాలను చెల్లించి అప్పుల పాలవుతున్నామని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. పంపింగ్ స్టేషన్ల నిర్వహణ, మరమ్మతులకు సొంతంగా ఖర్చులు పెట్టామని చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, కార్మికులు,కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.
గతంలో ప్రాజెక్టులు, పంప్‌హౌజ్‌ల నిర్వహణ, పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఇరిగేషన్ శాఖలో ఓఅండ్ఎం విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరమ్మతులు, అత్యవసర పనులకు ఈఎన్సీల అనుమతి లేకుండానే ఈఈ, డీఈల స్థాయిలోనే నిధులు కేటాయించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓఅండ్ఎంపై దృష్టి సారించలేదు. ఈ ఏడాది బడ్జెట్లో ఓఅండ్ఎం కోసం రూ.145 కోట్లను కేటాయించింది. మొదటి త్రైమాసికం ముగిసినా ఇప్పటికీ రూపాయి విడుదల చేయలేదు. ఇటీవల దేవాదుల ఎత్తిపోతల పథకంలోని 15 పంపింగ్ స్టేషన్ల నిర్వహణకు రూ.45 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయినా ఒక్క రూపాయి ఆ శాఖకు విడుదల చేయలేదు. దీంతో ఆ పంపింగ్ స్టేషన్ల నిర్వహణపై ఎలా ముందుకెళ్లాలో తెలియక ఇరిగేషన్ శాఖ అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు.