హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్(వైటీపీఎస్)లో కీలకమైన రెండు ప్లాంట్ల నిర్వహణను ప్రైవేట్‌కు అప్పగించేందుకు సర్కార్ అడుగులు వేస్తుండడంపై ఉద్యోగులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సొంతంగా నిర్వహిస్తే రూ. కోట్లు మిగిలే అవకాశం ఉన్నా.. ఎక్కువ మొత్తానికి ప్రైవేట్‌కు ఎందు కు.. ఎవరికోసం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. నల్లగొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి పవర్ ప్లాంట్‌లో మొత్తం 800 మెగావాట్ల సామర్థ్యంగల 5 యూనిట్లు ఉన్నాయి. మొ త్తం నాలుగు వేల మెగావాట్ల ఈ ప్లాంట్‌లో 5వ యూనిట్ కమర్షియల్ ఆపరేషన్స్ ఇంకా ప్రారంభం కాలేదు. అయితే ఈ ఐదు యూనిట్లకు సంబంధించిన కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల నిర్వహణను ప్రైవేట్‌కు అప్పగించేందుకు జెన్కో టెండర్లు ఆహ్వానించింది. టెండర్ మొత్తం రూ. 225 కోట్లుగా పేర్కొన్నది.
1,913 మంది సిబ్బందిని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో నిర్వహించాల్సి ఉంటుంది. అదే జెన్కో సొంతంగా నిర్వహిస్తే రూ. 55 కోట్ల వరకు మిగులుతాయని ఇంజినీర్లు చెప్తున్నారు. అయినా ప్రైవేటీకరణకు మొగ్గుచూపడంపై ఉద్యోగులు, ఇంజినీర్లు ఫైర్ అవుతున్నారు. సహజంగా ఏ కాంట్రాక్ట్ అయినా తొలుత ఏడాది కాలానికి ఇస్తారు. తర్వాత పనితీరును మదింపు చేసి రెన్యువల్ చేస్తారు. కానీ వైటీపీఎస్ టెండర్లను మూడేండ్లకు పిలువడం గమనార్హం. ప్లాంట్‌లోని అత్యంత కీలకమైన ఈ రెండు యూనిట్లను ప్రైవేటీకరించడం ద్వారా మొత్తం ప్లాంట్‌ను గంపగుత్తగా అప్పగించబోతున్నారని విద్యుత్తు ఉద్యోగ, ఇంజినీర్ల సంఘాలు అనుమానిస్తున్నాయి.
పవర్ ప్లాంట్‌ను దక్కించుకొనేందుకు మూడు సంస్థలు ముందుకు వచ్చాయి. స్టెగ్ ఎనర్జీ, రాఫెక్స్, పవర్‌మెక్ కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. టెండర్ల దాఖలు గడువు ముగియగా.. తాజాగా జెన్కో అధికారులు ఈ నెల 14 వరకు టెండర్ల దాఖలుకు అవకాశం ఇచ్చారు. అయితే ఈ ప్లాంట్‌ను ఓ కంపెనీకి అప్పగించేందుకు ఏడాది కాలంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. సదరు కంపెనీకి అప్పగించేందుకు పైస్థాయిలో పర్సంటేజీలు కూడా ఖరారు అయ్యాయని విద్యుత్తు సౌధలో ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రక్రియలో భాగంగానే టెండర్లను పిలిచారని చెప్తున్నారు.
వైటీపీఎస్ ప్రైవేటీకరణను తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఉద్యోగులు, ఇంజినీర్లు, ఆర్టిజన్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాలతో కూడిన ఈ జేఏసీ సర్కార్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నది. ఇటీవలే హైదరాబాద్‌లో సమావేశమైన జేఏసీ నేతలు ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 7వ తేదీ వరకు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయనున్నారు. ప్రతిరోజూ జెన్కోలో గేట్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 7న చలో వైటీపీఎస్‌కు పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణను నిరసిస్తూ వైటీపీఎస్‌లో ఆందోళనకు పూనుకోవాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. అయినా ప్రభుత్వం దిగిరాకపోతే అదేరోజున తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.