Ravalkole Lands | కంచె చేను మేస్తే.. అనేది సామెత! కానీ ఇక్కడ ప్రభుత్వ పెద్దలు ఏకంగా కంచనే మేశారు. అది ఎకరమో రెండెకరాలో కాదు.. ఏకంగా 275.06 ఎకరాలు. దాని విలువ ఒకటీ.. అరా కాదు.. ఏకంగా రూ.5 వేల కోట్లు. ప్రజలకు చెందాల్సిన ఆ ఆస్తిని అమాంతం మింగేశారు. పరిశ్రమల కోసమంటూ సన్న, చిన్నకారు రైతుల నుంచి భూములు లాక్కుంటూ, నిత్యం నిరుపేద రైతుల ఉసురుతీస్తున్న ప్రభుత్వ పెద్దలు.. ప్రభుత్వ ల్యాండ్ బ్యాంక్‌లో చేరాల్సిన వందల ఎకరాలను మాత్రం ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఫలహారంగా పంచుకుంటున్నారు. దశాబ్దాలుగా సాగుతున్న భూ వివాదంలోకి ప్రవేశించిన ‘ముఖ్యనేత’ బంధువులు, ఇద్దరు మంత్రులు ‘మీకింత.. మాకింత’ పథకం కింద రికార్డు స్థాయిలో కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే వీటిని స్వాహా చేయడం గమనార్హం.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రావల్కోల్ గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 4-18, 20, 22, 25ల్లో 275.12 ఎకరాలకు సంబంధించి దశాబ్దాలుగా వివాదం కొనసాగుతున్నది. గతంలో రెవెన్యూ అధికారులు ఆ భూములు ప్రభుత్వానికే చెందినవంటూ పోరాడారు. కేసీఆర్ హయాంలోనూ ఆ భూములు ప్రభుత్వానివేనని కాపాడగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొందరు మంత్రులు, ముఖ్యనేత బంధువులు కలిసి వాటిని కాజేసేందుకు ప్లాన్ వేశారు. ఉద్యోగ విరమణకు మూడురోజుల ముందే ఒక ఆర్డీవో ద్వారా ప్రొసీడింగ్స్ ఇప్పించి, భూములు కాజేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 275.23 ఎకరాల్లో ప్రభుత్వ పెద్దలు తలా 50 ఎకరాల చొప్పున పంచుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇక్కడ ఎకరా విలువ రూ.20 కోట్ల వరకు పలుకుతుండగా ఒక్కో సర్కార్ పెద్దకు రూ.1000 కోట్ల విలువైన భూములు వాటాగా వచ్చాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ భూమి ఎక్కడున్నా రాబందుల్లా వాలిపోయి గుటుక్కున మింగడం కాంగ్రెస్ పెద్దలకు అలవాటుగా మారిపోయింది. కేసీఆర్ తన హయాంలో న్యాయవివాదాల్లో ఉన్న రూ.లక్షల కోట్ల విలువైన వేలాది ఎకరాల భూముల్ని కాపాడి ప్రభుత్వ భూ బ్యాంక్‌లో జమ చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ప్రైవేట్ వ్యక్తులతో చేతులు కలిపి సర్కారు భూ బ్యాంక్‌కు కన్నం వేస్తున్నారు. దశాబ్దాలుగా ఉన్న వివాదాలను అడ్డుపెట్టుకొని.. నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి, పక్కా ప్లాన్ ప్రకారం, ప్రైవేట్ వ్యక్తుల సహకారంతో ప్రజల ఆస్తులను కొట్టేయడం వారి నరనరాన జీర్ణించుకుపోతున్నది. ఇందుకు తాజా ఉదాహరణ.. రావల్కోల్ భూములు.-
-గుండాల కృష్ణ
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 12 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రావల్కోల్ గ్రామ పరిధిలోని సర్వేనంబరు 4-18, 20, 22, 25ల్లో 275.12 ఎకరాల భూ విస్తీర్ణానికి సంబంధించిన వివాదం దశాబ్దాలుగా కొనసాగుతున్నది. గతంలోని రెవెన్యూ అధికారులు నిబంధనల మేరకు వ్యవహరించి ఈ భూములు ప్రభుత్వానికి చెందినవంటూ పోరాడారు. ఈ భూములకు గతంలో ఓఆర్సీలు ఇవ్వగా, 2003లో అప్పటి జాయింట్ కలెక్టర్ వాటిని రద్దు చేశారు. అవి శాశ్వత పచ్చిక భూములుగా నమోదైనందున ప్రభుత్వానికే చెందుతాయని స్పష్టమైన ఉత్తర్వులు జారీచేశారు. న్యాయస్థానాల్లోనూ గట్టి వాదనలు వినిపించి ఆ భూములను సర్కార్ ఖాతాలోనే ఉంచేందుకు కృషి చేశారు. అందుకే తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనూ ప్రైవేటు వ్యక్తులు ఎన్ని మార్గాల్లో ప్రయత్నించినా ఆ భూముల్ని దక్కించుకోలేకపోయారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొందరు మంత్రులు, ముఖ్యనేత బంధువులు కలిసి ఈ భూములను కాజేసేందుకు ప్లాన్ వేశారు. పదవీ విరమణకు మూడురోజుల ముందే ఒక ఆర్డీవో ద్వారా ప్రొసీడింగ్స్ ఇప్పించి, ఆ భూములను కాజేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
1954-55 ఖాస్రా పహాణీల ప్రకారం సర్వేనంబరు 4-18, 20, 22, 25ల్లోని 275.23 ఎకరాలకు పట్టాదారుగా ‘హైదర్ అలీ సిద్దిఖీ’ పేరు ఉన్నది. ఈ భూముల క్లాసిఫికేషన్ (భూమి వర్గీకరణ)లో పన్మక్తా (ఇనామ్) భూమిగా నమోదై ఉన్నది. భూమి స్వభావం (నేచర్ ఆఫ్ ల్యాండ్)లో కంచ (గ్రేజింగ్ ల్యాండ్స్-శాశ్వత పచ్చికబయళ్లు) భూములుగా వస్తున్నాయి. 1955-56 నుంచి ఈ భూములు రియాసత్ అలీ (తండ్రి షేక్ మహ్మద్), జాహిద్ అలీ (తండ్రి మురాద్ అలీ) పేరుపై నమోదై ఉన్నాయి. అయితే 1971-72 పహాణీల్లో పట్టాదారులుగా వీళ్లే ఉన్నా… భూములు వెంకట్రాంరెడ్డి ఆధీనంలో ఉన్నట్టుగా నమోదై ఉన్నది. 1973-74లోనూ అదేవిధంగా వచ్చింది. ఆ తర్వాత 2002-03 వరకు పట్టాదారుగా రియాసత్ అలీ, జాహిద్ అలీ పేర్లు వస్తున్నాయి. స్వాధీనంలో మాత్రం అనేకమంది పేర్లు నమోదవుతూ వచ్చాయి. 2003-04 నుంచి సర్కారీ, ఖారీజ్ ఖాతాగా వస్తున్నది. అయితే ఈ 275.12 ఎకరాలు తమ పూర్వీకుల నుంచి తమకు వచ్చిన ఆస్తులంటూ వాళ్ల వారసులుగా మహ్మద్ గౌస్, ఇతరులు క్లెయిమ్ చేస్తున్నారు. తాము కూడా వారసులమేనంటూ మహ్మద్ ఎజాజ్, ఇతరులు వాదిస్తున్నారు. తాము ఎప్పటినుంచో సాగులో ఉన్నామని కొందరు ప్రైవేట్ వ్యక్తులు వాదిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సివిల్ కోర్టులోనూ పలు వివాదాలు నమోదై ఉన్నాయి.
ఈ భూములను తాము 1973 నుంచి సాగు చేసుకుంటున్నామని, ఇనామ్ భూములు అయినందున తమకు ఓఆర్సీ (ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్-స్వాధీన హక్కు ధ్రువపత్రం), పట్టా పాసు పుస్తకాలు మంజూరు చేయాలని కొందరు ప్రైవేట్ వ్యక్తులు 1997లో రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. సంబంధిత ఆర్డీవో వారికి ఓఆర్సీలు జారీచేశారు. తర్వాత ఆ వివాదం జాయింట్ కలెక్టర్ (జేసీ) వద్దకు వచ్చింది. అనేకసార్లు విచారణ తర్వాత 2003 నవంబరు 29న అప్పటి జేసీ రవిచంద్ర సమగ్రంగా ఉత్తర్వులను జారీచేశారు. తాను ఈ భూములకు సంబంధించిన ఖాస్రా పహాణీలను క్షుణ్ణంగా పరిశీలించానని, ఈ భూములు కం (గ్రేజింగ్ ల్యాండ్స్-శాశ్వత పచ్చిక బయళ్లు)గా నమోదై ఉన్నట్టు గుర్తించానని తెలిపారు. కాబట్టి 1973లో ఇవి సాగుకు యోగ్యమైన భూములే కావని, ఈ నేపథ్యంలో అందులో సాగు చేసుకుంటున్నామంటూ కొందరు వ్యక్తులు వస్తే వారికి ఓఆర్సీ ఇవ్వడం ఎలా సమంజసమని ఆ ఉత్తర్వుల్లో అభిప్రాయపడ్డారు. గతంలో ఇచ్చిన ఓఆర్సీలను రద్దు చేశారు. ఈ భూములన్నీ రికార్డులపరంగా ఇనామ్ భూములు కావడంతో 1955-ఇనామ్ రద్దు చట్టం ప్రకారం.. పచ్చిక బయళ్లుగా ఉన్న ఈ భూములన్నీ ప్రభుత్వానికి చెందినవిగా తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఇలా దశాబ్దాలుగా వివాదాల్లో నలుగుతున్న విలువైన భూమిపై ప్రభుత్వ పెద్దల కన్ను పడింది. ఇనామ్‌దారులు ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించడంతో తెరవెనక భారీ సంప్రదింపులు జరిగాయని, ఆ తర్వాత ఫైల్‌ను కదిలించారని తెలిసింది. కరీంనగర్‌కు చెందిన ఒక ఇన్చార్జి మంత్రి, నంబర్-2 మంత్రితోపాటు ‘ముఖ్యనేత’ బంధువులు ఈ సెటిల్‌మెంట్‌లోకి ప్రవేశించినట్టు విశ్వసనీయ సమాచారం. తొలుత ‘ముఖ్యనేత’ అల్లుడి బంధువైన ఒక బిల్డర్ రంగంలోకి దిగి ఇనామ్దారులతో మాట్లాడారని, తర్వాత వారి సహకారంతో కక్షిదారులను కూడా కలిశారని తెలిసింది. వాళ్లకు కూడా ఎంతో కొంత ఇచ్చి సంతృప్తిపరుస్తామని చెప్పినట్టు సమాచారం. అనంతరం సదరు బిల్డర్ ఎందుకో వెనక్కితగ్గడంతో మరో బిల్డర్ కోసం అన్వేషణ సాగుతున్నట్టు తెలిసింది.
ఇన్నాళ్లూ అధికారులు ఖాస్రా పహాణీ కోణంలో, గతంలో జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు, హైకోర్టు పలు దఫాలుగా ‘చట్టానికి లోబడి నిర్ణయాలు తీసుకోవాలి’ అని ఇచ్చిన సూచనల మేరకు సమగ్ర పరిశీలనతోనే విచారణ జరిపారు. కానీ ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోగానే చట్టాలు, నిబంధనలన్నీ అటకెక్కి, జెట్ స్పీడ్‌లో ఉత్తర్వులు వచ్చాయి. ఇందుకు వాళ్లు ఎంచుకున్న మార్గం.. పదవీ విరమణకు చేరువలో ఉన్న ఒక అధికారికి కీసర ఆర్డీవోగా పోస్టింగ్ ఇవ్వడం. కేవలం తాము లక్ష్యంగా పెట్టుకున్న పనులు (అందులో ఇది ఒకటి) పూర్తి చేసేందుకు మాత్రమే ప్రభుత్వ పెద్దలు ఆర్డీవో రాజేశ్‌కుమార్‌ను కీసరకు తీసుకొచ్చారని రెవిన్యూ శాఖలో బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. 275.23 ఎకరాల్లో ప్రభుత్వ పెద్దలకు తలా 50 ఎకరాల చొప్పున వాటాలున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇక్కడ ఎకరా విలువ రూ.20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అంటే ఒకో సర్కారు పెద్దకు రూ.1000 కోట్ల విలువైన భూములు వాటాగా వచ్చాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
కీసర ఆర్డీవోగా రాజేశ్‌కుమార్ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పెద్దల ఆదేశానుసారం ఇనామ్దారులకు ఓఆర్సీలు ఇవ్వడమే పనిగా పెట్టుకున్నట్టు ఆరోపణలున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో మూడు దఫాలుగా విచారణ నిర్వహించి ముగించారు. కీసర తాసీల్దార్ మే 25వ తేదీన నివేదిక ఇస్తే.. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే 27వ తేదీన తుది ఉత్తర్వులు జారీచేశారు. ఈ క్రమంలో కక్షిదారుల అభ్యంతరాలను ఏమాత్రం పరిగణనలోనికి తీసుకోలేదని స్పష్టమవుతున్నది.
ఇలా నిబంధనలను, అభ్యంతరాలను తుంగలో తొక్కి, అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడి 275 ఎకరాల భూ దందాను పూర్తి చేసేందుకు ప్రభుత్వ పెద్దలు పక్కా ప్లాన్ వేసినట్టు చెప్తున్నారు. ఆర్డీవో రాజేశ్‌కుమార్‌కు సంబంధిత మంత్రి పక్కా ప్రణాళిక ప్రకారం ఈ ఏడాది జనవరిలో అక్కడ పోస్టింగ్ ఇచ్చారని, ఆయన ఉద్యోగ విరమణకు మూడు రోజుల ముందు ఉత్తర్వులు జారీ చేసి తన పనిని పూర్తి చేశారని అధికారికవర్గాలే ఆరోపిస్తున్నాయి. బలమైన ఆధారాలైన 1954-55 ఖాస్రా పహాణీలను పట్టించుకోకుండా, 2003లో జేసీ రవిచంద్ర ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పడేసి, గతంలో ఓఆర్సీల రద్దుకు గల కారణాలను దాచిపెట్టి, వారసుల పేర్లపై వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎంపిక చేసినవారికే ఓఆర్సీలు ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు.. భూ వివాదంలోని ఇతర కక్షిదారులను పలు దఫాలుగా పిలిచి విచారించిన ఆర్డీవో, ప్రొసీడింగ్స్ హార్డ్ కాపీలను వారికి ఇవ్వకుండా, కేవలం నంబర్-2 మంత్రి పేషీ నుంచి వచ్చిన వ్యక్తి చేతిలో పెట్టి ‘సంతృప్తి‘గా పదవీ విరమణ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేసి ఇప్పటికి 17 రోజులవుతున్నా ఇప్పటివరకు కక్షిదారులకు ఆ ఉత్తర్వులు అధికారికంగా అందలేదు. ప్రొసీడింగ్స్‌ను గోప్యంగా ఉంచడమే కాకుండా.. న్యాయస్థానాల నుంచి స్టేటస్కో రాకుండా ఉండేందుకు ఇనామ్దారులతో హైకోర్టులో కేవియెట్ దాఖలు చేయించినట్టు సమాచారం.
ఆర్డీవో రాజేశ్‌కుమార్ ఈ ఏడాది జనవరి 8వ తేదీన కీసర ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి ఈ భూముల విషయంలో అడుగడుగునా ఉల్లంఘనలు జరిగాయని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ఆయన వచ్చిన వెంటనే 1993 ఫైల్‌ను తెరిచారు. నాలుగు రోజుల్లోనే విచారణ మొదలుపెట్టారు. జనవరి 12, 24 తేదీల్లో రెండు దఫాలుగా విచారణ జరిపారు. ఫిబ్రవరి నెలలో మరో మూడు పర్యాయాలు (12, 19, 28 తేదీల్లో) విచారణ చేపట్టారు. 28వ తేదీన ‘రిజర్వ్ ఫర్ ఆర్డర్’లో పెట్టేశారు. అంటే దాదాపు నెలన్నర రోజుల్లోనే విచారణ పూర్తిచేసి ‘రిజర్వ్ ఫర్ ఆర్డర్’లో పెట్టడమే ‘దాల్మే కుచ్ కాలా హై’ అనేందుకు నిదర్శనం అని రెవెన్యూ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రెవిన్యూ శాఖలో గతంలోని ఏ కేసును తీసుకున్నా ఒకే నెలలో ఇన్నిసార్లు విచారణ చేపట్టిన దాఖలాలు లేవని రిటైర్డ్ అధికారులు చెప్తున్నారు.
ఓఆర్సీలు రద్దయిన వారు హైకోర్టును ఆశ్రయించారు. తాము ఆ భూములను సాగు చేసుకుంటున్నామని, దానికి అనుగుణంగా ఇచ్చిన ఓఆర్సీలను జేసీ రద్దు చేశారని కోర్టుకు విన్నవించారు. ఈ వివాదానికి సంబంధించి దాఖలైన అనేక పిటిషన్లను కలిపి విచారించిన ధర్మాసనం.. 2008లో ఉత్తర్వులు జారీ చేసింది.
ఒకవైపు అవి పడావు భూములు అని చెప్తున్నారని, మరోవైపు అవి శాశ్వత పచ్చిక బయళ్లు గా ఖాస్రా పహాణీలో నమోదై ఉన్నందున ఓఆర్సీలను రద్దు చేసినట్టుగా జేసీ చెప్తున్నారని హైకోర్టు పేర్కొన్నది. అవి ఇనామ్ భూములైనా సరే.. కంచ/గ్రేజింగ్ ల్యాండ్స్ అయితే ఓఆర్సీలు ఇవ్వడానికి వీలులేదని, ఇవి కానట్లయితే (పడావు) మాత్రం ఓఆర్సీలు జారీ చేయవచ్చని స్పష్టంచేసింది. పిటిషనర్లను తిరిగి పిలిచి, విచారించి ఆరు నెలల్లో తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
మరోవైపు.. ఇనామ్దారులైన రియాసత్ అలీ, జాహిద్ అలీ వారసులకు సంబంధించి కూడా వివాదాలున్నాయి. తామే వారసులమంటూ కొందరు, కాదు తామేనంటూ మరికొందరు అటు కోర్టుల్లో, ఇటు జాయింట్ కలెక్టర్ ముందు న్యాయపోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి 9.3.2011న ఉత్తర్వులు జారీచేశారు. అందులో స్పష్టంగా ఇవి ప్రైవేట్ ఇనామ్ భూములని, కాకపోతే గ్రేసింగ్ పర్పస్ (పచ్చికబయళ్ల) కోసం వినియోగించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్డీవో తిరిగి విచారణ (డీనోమో) చేపట్టాలని ఆదేశించారు. ఈ ఫైల్ సుదీర్ఘంగా పెండింగులోనే ఉన్నది.
2022లో మహ్మద్ గౌస్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా.. 2022 జూలై 28న ధర్మాసనం ఒక ఉత్తర్వు ఇచ్చింది. గతంలో ఉన్న ఫైల్స్‌ను ‘కచ్చితంగా చట్టానికి లోబడి (స్ట్రిక్ట్లీ అకార్డెన్స్ విత్ లా)’ నాలుగు నెలల్లో పరిష్కరించి తుది ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ఆర్డీవోను ఆదేశించింది.
అప్పటి నుంచి ఇప్పటివరకు పలు దఫాలుగా ఆర్డీవో విచారణ నిర్వహిస్తూనే ఉన్నారు. 24.8.2024, 25.10.2025, 12.1.2026, 12,2.2026, 19.2.2026, 24.2.2026, 28.2.2026 తేదీల్లో ఈ ప్రక్రియలో భాగస్వాములైన కక్షిదారులను పిలిచి విచారణ జరిపారు.
ఇనామ్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా ఆర్డీవో వ్యవహరిస్తారు. 27.05.2026న అసలు ఇనామ్‌దారు వారసులు అంటూ ఐదుగురిలో ఇద్దరికి 55.06 ఎకరాలు, మిగిలిన ముగ్గురికి 55 ఎకరాల చొప్పున మొత్తం 275.12 ఎకరాలకు ఓఆర్సీ ఇస్తూ ఆర్డీవో రాజేశ్‌కుమార్ ఉత్తర్వులు (ప్రొసీడింగ్ నెం.జె/4810-15/1993) జారీ చేశారు. రాజేశ్‌కుమార్ చివరిసారిగా 2026 ఫిబ్రవరి 28వ తేదీన విచారణ నిర్వహించారు. అదేరోజు ఉత్తర్వులను రిజర్వులో ఉంచుతున్నట్టు (ఆర్ఎఫ్వో) తన ఉత్తర్వుల్లోనే పేర్కొన్నారు. అంటే.. అప్పటికే విచారణ పూర్తి చేసి తన నిర్ణయాన్ని రిజర్వులో ఉంచారని ఆయనే చెప్పారు. కానీ మళ్లీ దానికి విరుద్ధంగా తదుపరి కూడా విచారణ కొనసాగించి.. మూడు నెలల తర్వాత తుది ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని బట్టే తెర వెనక సర్కార్ పెద్దల ప్రమేయం ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మేడ్చల్ తాసీల్దార్ 25.5.2026న విచారణ జరిపి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఉత్తర్వులు జారీచేసినట్టు ఆర్డీవో రాజేశ్‌కుమార్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 28వ తేదీన రిజర్వు ఫర్ ఆర్డర్ (ఆర్ఎఫ్వో) అని తానే స్వయంగా పేర్కొని… ఆ తర్వాత మూడు నెలలకు తాసీల్దార్ నుంచి నివేదిక ఎలా తెప్పించుకుంటారు? అంటే ఫిబ్రవరి 28న తాసీసిల్దార్ నివేదిక లేకుండానే నిర్ణయం తీసుకున్నారా? తీసుకుంటే అది ట్రిబ్యునల్ చట్టాన్ని ఉల్లంఘించడమే కదా? ఒకవేళ తాసీల్దార్ నివేదిక ఆధారంగానే ఫిబ్రవరిలో తుది నిర్ణయం తీసుకున్నారని అనుకుంటే, గతంలో ఎఫ్ఆర్వోలో తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకున్నట్టా? మార్చుకుంటే దాని వెనుక ఎవరి ఒత్తిడి ఉంది? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ట్రిబ్యునల్ చైర్మన్‌గా ఉండే ఆర్డీవోకు స్వయం ప్రతిపత్తి (ఇండిపెండెంట్ అథారిటీ) ఉంటుంది. ఆర్డీవో తన ఉత్తర్వుల్లోని మొదటి రెఫరెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన మెమో నంబర్ 24475/ఎల్ఎ.4/2026, తేది:26.05.2026గా పేర్కొన్నారు. కానీ ఉత్తర్వుల్లో ఎక్కడా ఆ మెమో గురించిన ప్రస్తావన లేదు. దీనిని బట్టి.. స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాల్సిన ఆర్డీవోకు ప్రభుత్వం తన మెమోలో ఏం సూచించింది? రెఫరెన్స్‌లో పేర్కొన్నారంటేనే ఆర్డీవో తీసుకున్న నిర్ణయాల వెనుక మెమోను కూడా పరిగణనలోనికి తీసుకున్నట్టు లెక్క కదా? దాని ప్రభావమెంత? అసలు ఎందుకు మెమోను జారీ చేశారు? అనేది తేలాల్సి ఉన్నది.
2003లో ఆర్డీవో రవిచంద్ర ఓఆర్సీలను రద్దు చేస్తూ (సెట్ఎసైడ్) జారీచేసిన ఉత్తర్వులు ఈ భూముల వివాదంలో అత్యంత కీలకమైనవి. ఈ భూములు శాశ్వత పచ్చిక బయళ్లు అయినందున 275.12 ఎకరాలు ప్రభుత్వానికి చెందుతాయని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కానీ తాజాగా ఆర్డీవో రాజేశ్‌కుమార్ ప్రొసీడింగ్స్‌లో ఎక్కడా ఈ ఉత్తర్వుల ప్రస్తావనే లేదు. రెఫరెన్స్‌లో 2011లో సుదర్శన్‌రెడ్డి (తిరిగి విచారణ) చేయాలని ఇచ్చిన ఉత్తర్వులు, రెండు దఫాలుగా వచ్చిన హైకోర్టు ఉత్తర్వులను పేర్కొన్నారే గానీ, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న రవిచంద్ర ఇచ్చిన ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా పక్కకు పెట్టినట్టు స్పష్టమవుతున్నది. అంటే ఓఆర్సీలు ఇవ్వాలనే ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి అనుగుణంగానే గతంలో ఓఆర్సీల రద్దుకు చూపిన ప్రధాన కారణాన్ని విస్మరించారని చెప్తున్నారు. దీంతో ప్రభుత్వానికి దక్కాల్సిన భూమి ప్రైవేట్ చేతుల్లోకి పోయిందంటున్నారు.
ఆర్డీవో తన ఉత్తర్వుల్లో భూమి వర్గీకరణ కింద పన్మక్తా (ఇనామ్) అని ప్రస్తావించారేగానీ, ఖాస్రా పహాణీలో కీలకమైన భూమి స్వభావం (నేచర్ ఆఫ్ ల్యాండ్)ను ఎక్కడా పేర్కొనలేదు. అసలు గ్రేజింగ్ ల్యాండ్స్ అనే పదాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. అంటే ఈ వివాదంలో అత్యంత కీలకమైన అంశాన్ని ఉద్దేశపూర్వకంగానే పక్కకు పెట్టనట్టు స్పష్టమవుతున్నది.ఉల్లంఘన-6
ఆర్డీవో తన ఉత్తర్వుల్లో వారసులు మాత్రమే ఓఆర్సీకి అర్హులని పేర్కొన్నారు. గతంలో కొనుగోలుదారులకు ఓఆర్సీలు ఇవ్వలేదు కాబట్టి, ఆ తర్వాత కొనుగోలు చేసిన వారి వాదన నిలవదని, ఒకవేళ సేల్‌డీడ్స్ ఉన్నా ఓఆర్సీలు ఇవ్వనందున అవి రద్దు (నల్ అండ్ వాయిడ్) అవుతాయని ఆర్డీవో తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇక్కడే రాజేశ్‌కుమార్ వాస్తవాలను వక్రీకరించారని నిపుణులు చెప్తున్నారు. గతంలో ఓఆర్సీలు ఇవ్వడం, 2003లో జేసీ రవిచంద్ర వాటిని రద్దు చేసిన అంశాన్ని ప్రస్తావించకుండా మొత్తం విషయాన్నే మార్చేశారని అంటున్నారు. ఒకవేళ గతంలో ఓఆర్సీల రద్దు అంశాన్ని ప్రస్తావిస్తే.. ఆ భూములు శాశ్వత పచ్చికబయళ్లు అనే విషయం బయటికొస్తుంది. తద్వారా 275.12 ఎకరాలు ప్రభుత్వానికి చెందినవి అవుతాయి. అందుకే ఆ అంశాన్ని పక్కకుపెట్టి వారసులు మాత్రమే ఓఆర్సీకి అర్హులంటూ ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చారని అంటున్నారు.
ఆర్డీవో తన ఉత్తర్వుల్లో 1973 పహాణీలో వెంకట్రాంరెడ్డి పేరు ఉన్నదని పేర్కొన్నారు. కానీ ఇనామ్‌దారులు అభ్యంతరం చెప్పడంతో పక్కకు పెట్టినట్టు తెలిపారు. అంటే.. అభ్యంతరం పెట్టినంత మాత్రాన వెంకట్రాంరెడ్డి స్వాధీనం పోతుందా? మరి 1973లో ఎవరు సాగులో ఉన్నారనే దానిపై విచారణ ఎందుకు జరుగలేదు? 1.11.1973 నాడు భూమి ఎవరి స్వాధీనంలో ఉందనేది నిర్ధారణ కాలేదు.
తాసీల్దార్ 25.5.2026న ఒకేరోజు క్షేత్రస్థాయి విచారణతో 275 ఎకరాల భూమి స్వాధీనాన్ని తేల్చిపడేశారు. పాత రికార్డులు, క్షేత్రస్థాయి పరిశీలనతో ప్రాథమిక నివేదిక ఎప్పుడు ఇచ్చారు? దానిని కక్షిదారులకు ఇవ్వకుండా ఆర్డీవో ఏకపక్షంగా తుది ఉత్తర్వులు ఎలా ఇస్తారు? పైగా క్షేత్రస్థాయిలో ఈ సర్వేనంబర్లలో ఇప్పటికే కాలనీలు వెలిశాయి. కానీ తాసీల్దార్ తన నివేదికలో 275 ఎకరాలు ఇనామ్‌దారు వారసుల స్వాధీనంలో ఉన్నాయని పేర్కొన్నారు. తద్వారా లక్షలాది మంది సామాన్యుల నివాసాలను ప్రశ్నార్థకంగా మార్చారు.
చుక్క నాగమ్మ, మంచ మల్లయ్య అనే వ్యక్తులు తాము 70 ఏండ్లుగా అందులో సాగులో ఉన్నామని ఆధారాలు ఇచ్చినట్టు ఉత్తర్వుల్లోనే ఉన్నది. కానీ ఆర్డీవో ఒక్క ముక్కలో వాటిని కొట్టిపారేశారు. సమగ్ర విచారణ చేయలేదనేందుకు ఇదే నిదర్శనమని చెప్తున్నారు.
ఏపీ (టీఏ) ఇనామ్ రద్దు చట్టం-1955 సెక్షన్-4 ప్రకారం ఇనామ్దారుకు ఓఆర్సీ ఇవ్వొద్దని ఉన్నదని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే 1973లో వాళ్లు నిజంగా సాగులో ఉంటే.. ఆటోమెటిక్‌గా వాళ్లు పట్టాదారులుగా మారుతారని అంటున్నారు. అలాంటప్పుడు వాళ్లకు ఓఆర్సీలు ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. సెక్షన్-7, సెక్షన్-8 కింద కౌలుదారులకు (భూ యాజమాన్య హక్కులేని), కబ్జాదారులకు కదా ఓఆర్సీలు ఇచ్చేది అనే వాదన ఉన్నది. ఇందుకు సంబంధించి రంగారెడ్డి జేసీ వర్సెస్ డీ నర్సింగరావు, కోక్రాజ్ వర్సెస్ కిషన్‌లాల్ వంటి కేసుల్లో సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఉన్నట్టు గుర్తుచేస్తున్నారు.
ఆర్డీవో తన విచారణలో భాగంగా కక్షిదారులను పిలిచినపుడు అందులో కొందరు స్పష్టంగా వారసుల పేర్లకు సంబంధించి అభ్యంతరాలు లేవనెత్తారు. రియాసత్ అలీ, జాహిద్ అలీ వారసులు వాళ్లే అనేందుకు ఆధారాలు ఏమున్నాయి? సివిల్ కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకురావాలి కదా? అని ప్రశ్నించారు. కానీ ఆర్డీవో ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. సీలింగ్ డిక్లరేషన్‌లో ఇచ్చిన పేర్ల ఆధారంగానే వాళ్లను వారసులుగా గుర్తిస్తున్నట్టు ఆర్డీవో తన ప్రొసీడింగ్‌లో పేర్కొన్నారు. కానీ సీలింగ్ డిక్లరేషన్ (ఫారం-1)లో రియాసత్ అలీ వారసులుగా గౌస్, షకీరాబేగం, సాజీదాబేగం, షాహెదాబేగం.. జాహిద్ అలీ వారసులుగా మోహిసిన్ అలీ, కనీజ్ ఫాతిమా పేర్లు ఉన్నాయి. కానీ ఆర్డీవో ఉత్తర్వుల్లో గౌస్ మినహా మిగిలిన వాళ్ల పేర్లు లేవు. అదనంగా అస్మా ఫాతిమా, అబ్దుల్ అమ్జద్, మహ్మద్ అమ్జద్, సయ్యద్ జావీద్ పేర్లపై 275.12 ఎకరాలకు ఓఆర్సీ ఇచ్చినట్టు ఉంది. వీళ్లంతా ఫారం-1లోని వారసులైనప్పటికీ, కనీసం వీళ్లయినా సివిల్ కోర్టు నుంచి తగిన ఉత్తర్వులు తెచ్చుకున్నారా? అనేది అనుమానంగానే ఉందని పలువురు కక్షిదారులు అంటున్నా రు. వారసులకు సంబంధించిన అభ్యంతరాలను సైతం ఆర్డీవో గడ్డిపోచలా తీసివేయడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఖాస్రా పహాణీ ఏం చెప్తున్నదంటే..ఖాస్రా పహాణీలో భూమి స్వభావం, ఉపయోగానికి సంబంధించి నమోదులో వివిధ విభాగాలను
పరిగణనలోనికి తీసుకున్నారు.
రావల్‌కోల్‌లో ఆర్డీవో ఓఆర్సీ ప్రొసీడింగ్స్ ఇచ్చిన భూములు ఖాస్రా పహాణీలో ‘ఊ‘గా నమోదై ఉన్నాయి. అంటే శాశ్వత పచ్చిక భూములు. వీటికి ఓఆర్సీలు ఇవ్వడం నిషేధం.

2008లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లోనూ కంచె భూములకు 1955 ఇనాం రద్దు చట్టంలోని 4(1)(ఎ) కింద ఓఆర్సీలు నిషిద్దమని, జేసీ (రెస్పాండెంట్ నెం.1) ఈ కారణంగానే ఓఆర్సీల రద్దు నిర్ణయానికొచ్చినట్లు ఉన్న పేరాగ్రాఫ్.

ఖాస్రా పహాణీ తయారీ సమయంలో రెవెన్యూ శాఖ ఇచ్చిన మార్గదర్శకాలు. అందులో ‘ఊ’గా ఉంటే అవి పచ్చిక భూములు అని ఇచ్చిన మార్గదర్శకాలు

ఈ భూములు కంచె భూములు అని 2003లో జేసీ ఇచ్చిన ఉత్తర్వుల్లోని పేరాగ్రాఫ్.