ఉట్నూర్, ఆగస్టు 11 : అటవీ హక్కు ప్రయోజనాలు ప్రతి అర్హులైన గిరిజనులకు అందించాల్సిన బాధ్యత తమపై ఉందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని కుమ్రం భీం ప్రాంగణంలోని పీఎంఆర్సీ సమావేశ మందిరంలో దొంగచింత, బీర్సాయిపేట్ గ్రామ పంచాయతీల పరిధిలోని షెడ్యూల్డ్ తెగలు, ఇతర సంప్రదాయ అటవీ నివాసుల చట్టం 2006 అమలుపై పైలెట్ సామాజిక తనిఖీ ప్రజావేదిక సీఏజీ, క్రిస్ప్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అటవీ హక్కు పత్రాలు పొందిన రైతులకు రుణాలు, రైతు భరోసా, వ్యవసాయ రాయితీలు, ఇతర సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? అనే అంశాలను పరిశీలిస్తున్నామన్నారు.
పట్టాదారులు మరణిస్తే వారి వారసుల పేర్లపై అటవీ హక్కు పత్రాలు బదిలీ చేయడం ప్రారంభించామన్నా రు. ఇంకా అందని వారు ఐటీడీఏ, తహసీల్దార్లకు దరఖాస్తు సమర్పించాలన్నారు. పట్టా ఉ న్నా, లేకపోయిన అటవీ భూములలో సాగు చేస్తున్న అర్హులైన రైతులకు ఫర్టిలైజర్ యూప్ ద్వారా ఎరువులు, విత్తనాలు అందేలా చర్య లు తీసుకుంటున్నామన్నారు. అనంతరం పీవో మాట్లాడుతూ.. అటవీ హక్కు అమలు ద్వారా నిర్దేశించిన లక్ష్యాలు క్షేత్రస్థాయిలో నెరవేరుతున్నాయో స్వతంత్రంగా అంచనా వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ గంగాధర్, ఆర్డీవో మోహన్‌సింగ్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి రవీందర్‌సింగ్, ఎల్డీఎం ఉత్పల్ కుమార్, ఏపీవోలు వసంత్‌రావు, భాస్కర్ పాల్గొన్నారు.