ఎదులాపురం, ఆగస్టు 11 : సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభ ఉద్యమాన్ని పకదారి పట్టించే ప్రయత్నాలను బీజేపీ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు మానుకోవాలని మాజీ మంత్రి జోగు రామన్న హెచ్చరించారు. కమిషన్లపై చూపుతున్న శ్రద్ధ ఆదిలాబాద్ యువత భవిష్యత్‌పై చూపడం లేదని విమర్శించారు. ఆదిలాబాద్‌లో సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం కోసం సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరంలో మూడో రోజు యాపల్‌గూడ గ్రామస్తులు పాల్గొని సంఘీభావం తెలిపారు. శిబిరాన్ని సందర్శించిన జోగు రామన్న గ్రామస్తులను అభినందించారు. రైతు కుటుంబాలు సీసీఐ పునఃప్రారంభం కోసం దీక్షలో పాల్గొనడం అభినందనీయమన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బుధవారం నిర్వహించనున్న విద్యార్థి, యువజన పోరు గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కాసిం హాజరుకానున్నారని, సుమారు 10 వేల మంది విద్యార్థులు, యువత పాల్గొనేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీసీఐ పునఃప్రారంభం కోసం విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. రైతులు, రైతు కూలీలు, మేధావులు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా పోరు గర్జనలో పాల్గొని ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. సీసీఐ సాధన సమితి కేంద్ర మంత్రిని కలిసిన సందర్భంగా పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లోనైనా పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే స్థానిక బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే ఆ హామీని పకనపెట్టి సీసీఐ పరిశ్రమపై వ్యంగ్యంగా మాట్లాడడం ద్వారా ఆదిలాబాద్ యువత ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
జిన్ జెడ్ ఉద్యమం తరహాలో యువతను ఏకం చేసి సీసీఐ పునఃప్రారంభం కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. ఎయిర్ పోర్టు ఏర్పాటుకు సంబంధించిన జీవో పేరిట సీసీఐ పరిశ్రమ అంశాన్ని పకదారి పట్టించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభమైతే సుమారు 80 శాతం వరకు స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉందని, అయినప్పటికీ పరిశ్రమ పునఃప్రారంభానికి స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ముందుకు రాకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయిస్తే పరిశ్రమ పునఃప్రారంభానికి మార్గం సుగమమవుతుందని తెలిసినా యువత భవిష్యత్‌పై దృష్టి పెట్టకపోవడం బాధాకరమన్నారు. కమిషన్లు వచ్చే ప్రాజెక్టులపై చూపుతున్న శ్రద్ధను ఆదిలాబాద్ యువత భవిష్యత్‌పై ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం కోసం విద్యార్థులు, యువతతో కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మల్లేష్, నారాయణ, ఆలాల్ అజయ్, సలీం, కొండ రమేష్, బొర్రన్న, అన్నమొల్ల కిరణ్, బుట్టి శివ, దాసరి రమేష్, గండ్రత్ రమేష్, చిన్నాన్న, బిళ్ల రాజ్, బుమయ్య, కాంతారావు, గంగారాం, ఎసే సాఫీ, అగ్గిమాళ్ల రాజేశ్వర్, నర్సింగ్, సింగలపు రామన్న, భూమన్న, రాంరెడ్డి, రాజలింగు, ప్రభాకర్ పాల్గొన్నారు.