ఏడాది పాలనలో పేర్ల మార్పే తప్ప బతుకులు మార్చే పని కాంగ్రెస్ సర్కార్ చేయలేదు. ఏండ్ల తరబడి పాడుకుంటున్న జయజయహే తెలంగాణ గేయాన్ని మార్చింది. కాకతీయతోరణం, రామప్ప పదాలను తొలగించింది. రాష్ట్ర చిహ్నంలోని కాకతీయతోరణం, చార్మినార్లను తొలగించింది. పేర్లను, విగ్రహాలను మారుస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్నే దెబ్బతీస్తున్నది.
– కేటీఆర్
KTR | హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో 100 శాతం రుణమాఫీ అయినట్టు రైతులు చెప్తే తాను రాజకీయాలు వదిలేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో గాని, సొంత నియోజకవర్గం కొడంగల్‌లో గాని మీడియా వెళ్లి రైతులను కలిసి వివరాలు సేకరించాలని, వందశాతం పూర్తయితే తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని స్పష్టంచేశారు. ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చి రైతులను, ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. అలవికాని హామీలు ఇచ్చి.. అరకొర రుణమాఫీ చేసి వందశాతం పూర్తయినట్టు గొప్పలు చెప్పుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రేవంత్‌రెడ్డి ఏడాది పాలనకు సున్నా మార్కులు కూడా రావని, చరిత్రలో అసమర్థ సీఎంగా ఆయన మిగిలిపోతారని ఎద్దేవాచేశా రు. ప్రభుత్వాన్ని నడపే సత్తా లేకనే బీఆర్ఎస్ చేసిన పనులను తమ ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గూగుల్ క్యాంపస్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌కు తీసుకొస్తే, రేవంత్‌రెడ్డి మాత్రం గూగుల్‌ను తామే తీసుకొచ్చామని చెప్పుకొంటున్నారని మండిపడ్డారు.
మూసీ ప్రక్షాళనకు అప్పటి ప్రభుత్వం నిర్మించిన ఎస్టీపీలను ప్రారంభించి తామే కట్టినట్టు చెప్పుకొంటున్నారని ఆక్షేపించారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ తరహాలో రేవంత్‌రెడ్డి మాటలకు బదులిస్తామని స్పష్టంచేశారు. ఢిల్లీలో అదానీ-మోదీ దోస్తీపై రాహుల్ గాం ధీ నిరసన తెలుపుతుంటే, తెలంగాణలో రేవంత్‌రెడ్డి అదానీతో వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ మాటను రేవంత్‌రెడ్డి లెక్కచేయడం లేదని చెప్పారు. మంగళవారం ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్‌పై కేటీఆర్ నిప్పులు చెరిగారు.
‘జీవోలతో తల్లి రూపాన్ని మారుస్తారా? భరతమాత, తెలుగుతల్లి, కన్నడతల్లిని ఆవిష్కరించినప్పుడు ఏ జీవో జారీ చేశారు? ఏ తల్లికీ లేని జీవో తెలంగాణ తల్లికి ఎలా వర్తిస్తుంది?’ అని కేటీఆర్ నిలదీశారు. 20 ఏండ్లుగా ప్రతి పల్లెలో తెలంగాణ తల్లిని ప్రజలు నిలుపుకొన్నారని, ప్రజల గుండెల్లో ముద్రించుకున్న తెలంగాణ తల్లి రూపాన్ని జీవోలతో చెరిపేస్తారా? అని ప్రశ్నించారు. అమరవీరుల స్మారకమైన అమరజ్యోతి ప్రాంగణంలో తెలంగాణ తల్లిని కేసీఆర్ అధికారికంగా ఆవిష్కరించారని కేటీఆర్ స్పష్టంచేశారు. సంగారెడ్డి కలెక్టరేట్ ప్రాగణంలో హరీశ్‌రావు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారని గుర్తుచేశారు. తెలంగాణ తల్లి రూపు రేఖలను మార్చి రాష్ట్ర అస్తిత్వాన్ని మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ తల్లిని, రాజీవ్ విగ్రహాన్ని రాచమర్యాదలతో గాంధీభవన్‌కు తరలిస్తామని చెప్పారు.
తెలంగాణ తల్లి రూపు రేఖలు మార్చి రాష్ట్ర సాంస్కృతిక అస్తిత్వాన్నే చెరిపేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. తెలంగాణ తల్లులు బీదగా ఉండాలని కోరుకుంటున్నది. బహుజన తల్లులకు బంగారం ఉండొద్దని నిరంకుశంగా వ్యవహరిస్తున్నది. పేదరికం అనివార్యం కానీ ఆదర్శం కాదు.. కిరీటం మిగతా తల్లులకు ఉండాలిగాని తెలంగాణ తల్లికి ఉండొద్దా? కాంగ్రెస్ తల్లి కాళ్ల కింద బిగిసిన పిడికిళ్లను పెట్టి ఉద్యమకారులను అవమానించిండ్రు.
– కేటీఆర్
ఏడాది పాలనలో పేర్లు మార్చే పనులు తప్ప పేదల బతుకులను మార్చే పనిని కాంగ్రెస్ సర్కార్ ఏమాత్రం చేయలేదని కేటీఆర్ విమర్శించారు. జయజయహే తెలంగాణ గేయంలో కాకతీయ కళాతోరణం, రామప్ప అనే పదాలను తొలగించారని, రాష్ట్ర చిహ్నంలోని కాకతీయ కళాతోరణం, చార్మినార్లను తొలగించారని, పేర్లు, విగ్రహాలను మారుస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే పేర్లు మారుస్తూపోతే తాము అధికారంలోకి రాగానే వాటన్నింటినీ తొలగిస్తామని స్పష్టంచేశారు. వాటి స్థానంలో తెలంగాణ ఉద్యమకారులు, మేధావుల పేర్లను పెడతామని చెప్పారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పేర్లు, విగ్రహాల మార్పులకు పాల్పడలేదని, ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి మేధావుల విగ్రహాలను ఆవిష్కరించామని గుర్తుచేశారు.
చిన్న స్థాయి కార్యకర్తలకు పదవులిచ్చి ఎమ్మెల్యేలు, మంత్రులను చేస్తే కొందరు పార్టీ ఫిరాయించారని కేటీఆర్ చెప్పారు. ‘కుండ పగిలితే పగిలింది కానీ కుక్కబుద్ధి తెలిసింది అన్న చందంగా వారి వ్యవహార శైలి ఉన్నది’ అని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్లో ఆటుపోట్లు ఎదుర్కొంటూ కష్టపడి పనిచేసేవారికి అండగా ఉంటామని స్పష్టంచేశారు.
కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నవారికే పదవులు దక్కుతాయని తేల్చిచెప్పారు. ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని, భవిష్యత్తులో ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోబోమని స్పష్టంచేశారు. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా దివాలా కోరు రాజకీయం చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ వల్లే రాష్ట్రంలో పంటలు పండుతున్నాయని భ్రమ పడుతున్నారని, తెలంగాణకు నీటిని, కరెంటును తెచ్చి వ్యవసాయ స్థిరీకరణ చేసిందే కేసీఆర్ అని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. దాని ఫలితంగానే ఇప్పు డు రికార్డు స్థాయిలో పంటలు పండుతున్నాయని వివరించారు.
పార్లమెంట్లో అదానీ-మోదీ ఉన్న టీషర్ట్ ధరిస్తే తప్పు కానప్పుడు, తెలంగాణ అసెంబ్లీలో అదానీ-రేవంత్ వ్యవహారాన్ని బయటపెట్టేందుకు తమకు అనుమతి ఎందుకు లేదని రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. అదానీ వ్యతిరేక నిరసనల్లో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదని మండిపడ్డారు. పార్లమెంట్లో ఒకలా, తెలంగాణలో మరోలా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు.
కర్నాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ మృతికి కేటీఆర్ సంతాపం తెలిపారు. బెంగళూరును దేశంలోనే టెక్‌హబ్‌గా మార్చి సాంకేతిక ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ఘనడు ఎస్ఎం కృష్ణ అని కొనియాడారు. ఆయన మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. ఎస్ఎం కృష్ణ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ తీరుకు నిరసనగా నేటి నుంచి జరిగే శాసనసభ్యుల ఓరియంటేషన్ కార్యక్రమాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటన విడుదల చేశారు. శాసనసభ ప్రారంభానికి ముందే స్పీకర్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించారని, తొలిరోజే బీఆర్ఎస్ శాసనసభ్యులు సభలోకి రాకుండా పోలీసులను మోహరించి అరెస్టు చేయించారని పేర్కొన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజా సమస్యలను ఎత్తిచూపేందుకు నిరసన తెలిపితే అరెస్టు చేశారని వివరించారు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై తగిన చర్యలు తీసుకోవాలని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి, ఫిరాయింపులను నిరోధించేందుకు తగిన నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. గత శాసనసభ సమావేశాల్లో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మా ట్లాడే అవకాశం ఇవ్వలేదని, ఎమ్మెల్యేల గొంతు నొక్కేలా వ్యవహరించారని తెలిపారు.
ఈసారి ఎన్నికైన శాసనసభ్యుల్లో బీఆర్ఎస్లో అతి తక్కువ మం ది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారని, స్పీకర్ ఏకపక్ష తీరుకు నిరసనగా బుధవారం నుంచి జరిగే శాసనసభ్యుల ఓరియంటేషన్ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటికైనా స్పీకర్ పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని విజ్ఙప్తి చేశారు.
తెలంగాణ తల్లి రూపు రేఖలు మార్చి రాష్ట్ర సాంస్కృతిక అస్తిత్వాన్నే చెరిపేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. తెలంగాణ తల్లులు బీదగా ఉండాలని కోరుకుంటున్నది. బహుజన తల్లులకు బంగారం ఉండొద్దని నిరంకుశంగా వ్యవహరిస్తున్నది. పేదరికం అనివార్యం కానీ ఆదర్శం కాదు.. కిరీటం మిగతా తల్లులకు ఉండాలిగాని తెలంగాణ తల్లికి ఉండొద్దా? కాంగ్రెస్ తల్లి కాళ్ల కింద బిగిసిన పిడికిళ్లను పెట్టి ఉద్యమకారులను అవమానించిండ్రు.
– కేటీఆర్
రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా ప్రజల వేదన.. అరణ్య రోదనే కనిపిస్తున్నదని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. పథకాలకు పాతరేసి సకల వర్గాల ప్రజలను వేధిస్తున్నారని వాపోయారు. అధికార అహంకారంతో ఏకంగా అమ్మనే మార్చారంటూ మండిడ్డారు. రేవంత్ పాలనపై ఎక్స్ వేదికగా సెటైరికల్ ట్వీట్ చేశారు.
ప్రజల వేదన..అరణ్య రోదన!
రైతుల చెరబడితిరి!
పేదల ఇండ్లు కూలగొడ్తిరి!
రైతుబంధు ఎత్తేస్తిరి!
రైతుబీమాకు పాతరేస్తిరి!
కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ మాయం చేస్తిరి!
అమ్మ ఒడిని ఆగం చేస్తిరి!
నిరుద్యోగుల ఉసురు పోసుకుంటిరి!
ఏక్ పోలీస్ అన్న పోలీసులను అణగదొకితిరి!
హామీల అమలు అడిగిన ఆడబిడ్డలు
ఆశాలను అవమానపరిస్తిరి!
టీఎస్‌ను టీజీగా చేసి చార్మినార్,
కాకతీయ కళాతోరణాలను తొలగిస్తిరి!
తెలంగాణ బిడ్డలు లాఠీలకు, తూటాలకు
ఎదురొడ్డి.. ఆత్మబలిదానాలతో
ఉద్యమిస్తున్నప్పుడు..
సమైక్యవాదుల పంచనచేరి వంచన చేస్తిరి!
అధికార అహంకారంతో
ఇప్పుడు ఏకంగా అమ్మనే మారిస్తిరి!
మీరు చరిత్రను చెరిపేస్తాం అన్న భ్రమలో..
తెలంగాణ ప్రజలను ఏమారుస్తాం
అనుకుంటే పొరపాటే!
తెలంగాణ అన్నీ గమనిస్తున్నది
కాలంబు రాగానే కాటేసి తీరుతది!
జై తెలంగాణ!!