BTech Seats | హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది ఇంజినీరింగ్‌లో సీట్ల కన్వర్షన్, బ్రాంచీల విలీనం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడంతో 4 వేలకు పైగా సీట్లకు గండిపడింది. ఏఐసీటీఈ విధించిన ప్రవేశాల గడువు బుధవారంతో ముగియనున్నది. సర్కారు నిర్లక్ష్యం ఫలితంగా సీట్లు ఉన్నా భర్తీ చేయలేని పరిస్థితి. సోమవారం హైకోర్టు ప్రైవేట్ కాలేజీలకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా, ప్రభుత్వం మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. బీటెక్‌లో సీట్ల కన్వర్షన్‌కు ఈ ఏడాది పలు కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. కాలేజీలు ఈఈఈ, సివిల్, మెకానికల్ కోర్సుల్లో సీట్లను తగ్గించుకుని, సీఎస్ఈలో పెంచుకునేందుకు సిద్ధపడ్డాయి.
ఇందుకు జేఎన్టీయూ ఎన్వోసీ ఇవ్వగా, ఏఐసీటీఈ ఆమోదం తెలిపింది. అయితే సీట్ల కన్వర్షన్‌కు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుచెప్పింది. రాజకీయంగా తమకు అనుకూలంగా ఉన్న కొన్ని కాలేజీలకు మాత్రం ప్రభుత్వం యథేచ్చగా అనుమతిచ్చింది. మరో వైపు రాజకీయ కారణాలతో పలు యాజమాన్యాలు నడుపుతున్న కాలేజీల్లో సీట్ల కన్వర్షన్‌కు అనుమతి ఇవ్వలేదు. ఈ సీట్లు ఏఐసీటీఈ లెక్కల్లో సీఎస్ఈకి మారినట్టుగా ఉండగా, రాష్ట్రం ప్రభుత్వం ఇందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఈ సీట్లకు గండిపడింది.
అటు కన్వర్షన్‌కు అనుమతి ఇవ్వకపోగా, ఇటు ఉన్న సీట్లను భర్తీచేసుకునే అవకాశమివ్వలేదు. దీంతో ఈ సీట్లున్నా భర్తీచేసుకోలేని పరిస్థితి నెలకొన్నది. దీనిపై కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు మాప్ అప్ కౌన్సెలింగ్‌ను నిర్వహించి భర్తీచేయాలని తీర్పు ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత కాలేజీలు మళ్లీ హైకోర్టుకెళ్లగా సోమవారం కాలేజీలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై మళ్లీ ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకెళ్లింది. ఇలా ప్రభుత్వం పంతానికి పోవడంతో ఈ సీట్లను భర్తీచేయలేని పరిస్థితి నెలకొన్నది.