Telangana | హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): సన్న ధాన్యానికి బోనస్‌పై సర్కారు మరో మెలిక పెట్టింది. మద్దతు ధరతో పాటే బోనస్ పైసలు రైతుల ఖాతాలో జమ చేయడంలేదని తెలిసింది. ముందు మద్దతుధర చెల్లించి ఆ తర్వాతే బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. దీంతో రైతులకు మద్దతు ధర, బోనస్ రెండు వేర్వేరుగా అందనున్నాయి. ఈ నిర్ణయంపై రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. వారు ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
మద్దతు ధర పైసలు చెల్లించడంలోనే ఆలస్యం చేస్తున్న ప్రభుత్వం.. ఇక బోనస్ ఎప్పుడు ఇస్తుందోనన్న సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.సన్నాలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభు త్వం ప్రకటించింది. ప్రస్తుతం సాధారణ రకం ధాన్యానికి రూ.2300గా, గ్రేడ్-ఏ రకానికి రూ.2320గా మద్దతు ధర నిర్ణయించింది. సన్న ధాన్యాన్ని సాధారణ రకంగా పరిగణిస్తారు కాబట్టి రైతులకు మద్దతు ధర, బోనస్ కలిపి క్వింటాలుకు రూ.2800 చొప్పున చెల్లించాలి. అయితే ప్రభుత్వం ఈ రెండు వేర్వేరుగా చెల్లించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిసింది. దీనికి పౌరసరఫరాల సంస్థ సాంకేతిక కారణాల ను సాకుగా చూపుతున్నట్టు సమాచారం.
ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రైతులకు డబ్బుల చెల్లింపులు కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంటాయి. ఇక్కడ కొనుగోలు చేసిన ధాన్యానికి, చెల్లింపులకు కేంద్ర ప్రభుత్వానికి లెక్క చూపించాలి. రైతులకు మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. బోనస్‌తో కేంద్రానికి సంబం ధం లేదు. ఈ బోనస్‌ను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మద్దతు ధర, బోనస్ కలిపి ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు చెబుతున్నట్టు తెలిసింది.
ఓపీఎంఎస్ కారణంగా ఒకేసారి మద్దతు ధర, బోనస్ కలిపి చెల్లించడం సాధ్యం కాదంటున్న సివిల్ సైప్లె వాదనను కొందరు అధికారులు తోసిపుచ్చుతున్నా రు. ఇప్పటికే సన్న ధాన్యం, దొడ్డు ధాన్యం కొనుగోలుకు వేర్వేరు కేంద్రాలను ఏర్పా టు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాంటప్పుడు చెల్లింపుల్లో ఇబ్బందేమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వేర్వేరు కేంద్రాలను ఏ విధంగా నిర్వహిస్తారో అదేవిధంగా సన్న ధాన్యం కోసం మరో సాఫ్ట్‌వేర్‌ను ప్రత్యేకంగా తయారు చేయిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. ఓపీఎంఎస్తో మద్దతు ధర రూ.2300 లను, ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో రూ.500ను వేర్వేరుగా చెల్లించాలని చెప్తున్నారు.
బోనస్ భారాన్ని తప్పించుకునేందుకే ప్రభుత్వం సాంకేతిక సాకులు చూపుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటు మద్దతు ధర అటు బోనస్ ఒకేసారి చెల్లించాలంటే ప్రభుత్వంపై భారీగా ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. ఈ సీజన్లో 91 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుందనే అంచనాలున్నాయి. ఈ లెక్కన మద్దతు ధర ప్రకారం రూ. 20,930 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 47 లక్షల టన్నుల సన్న ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నారు.
దీనికి రూ.500 బోనస్ ఇచ్చేందుకు రూ.2350 కోట్లు కావాలి. ఒకేసారి భారీ మొత్తంలో నిధులు సమకూర్చడం ప్రభుత్వానికి కత్తిమీద సామే. దీంతో మద్ద తు ఒక రోజు, బోనస్‌ను మరో రోజున చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది. బోనస్ చెల్లింపు వాయిదాపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర చెల్లించిన తర్వాత ఎన్ని రోజులకు బోనస్ చెల్లిస్తారనే అంశంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.