హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కారు పలువురిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించడాన్ని సవాలు చేస్తూ ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. వివిధ ప్రభుత్వ విభాగాలకు 14 మందిని సలహాదారులుగా నియమించి, వారికి క్యాబినెట్ హోదా కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఆర్టికల్ 164(1ఏ) ప్రకారం క్యాబినెట్లో 15 శాతం మంది మాత్రమే మంత్రులు ఉండాలని గుర్తుచేశారు.
ఇంతకుమించి క్యాబినెట్ హోదా ఇవ్వడానికి అవకాశంలేదని తెలిపారు. సలహాదారులకు క్యాబినెట్ మంత్రులకు కల్పించినట్టుగా సౌకర్యాలు, అలవెన్స్‌లు, సెక్యూరిటీ ఇతరత్రా ప్రత్యేక వసతులు కల్పించేందుకు అవకాశం లేదని అన్నారు. ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చట్టపరంగా చెల్లనేరదని స్పష్టంచేశారు. ఇది కచ్చితంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని పేర్కొన్నారు. వీరి నియామకాన్ని రద్దుచేసేలా ఆదేశివ్వాలని కోరారు.
1) కే కేశవరావు- పబ్లిక్ ఎఫైర్స్, 2) పోచారం శ్రీనివాస్‌రెడ్డి- అగ్రికల్చర్, 3) పీ సుదర్శన్‌రెడ్డి- అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, 4) ప్రేమ్‌సాగర్‌రావు- తెలంగాణ సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్, 5) జీ చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, 6) వేం నరేందర్- పబ్లిక్ ఎఫైర్స్, 7) మహ్మద్ షబ్బీర్‌అలీ- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సంక్షేమం, 8) హర్కార వేణుగోపాల్- ప్రొటోకాల్, ప్రజా సంబంధాలు, 9) ఆదిత్యనాథ్ దాస్- ఇరిగేషన్, నీటి వనరులు, 10) ఏపీ జితేందర్‌రెడ్డి- క్రీడా వ్యవహారాలు, 11) మల్లు రవి- తెలంగాణ భవన్ ప్రతినిధి (ఢిల్లీ), 12) శ్రీనివాస్‌రాజు- మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులు, 13) ప్రసన్నకుమార్ సూర్యదేవర- తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటేరియట్, 14) పెంటారెడ్డి- లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్.