హైదరాబాద్, జూన్2 (నమస్తేతెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన సోమవారం రాష్ట్రంలో పలుచోట్ల ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలి ఆవరణలో సోమవారం రాష్ర్టావతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శాసనమండలి ఆవరణలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ర్టావిర్భావ ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ నర్సింహాచార్యులుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
హైదరాబాద్‌లోని కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ రాష్ట్ర కార్యాలయాల్లో సోమవారం తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో ప్రాణత్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వివరించారు. కార్యక్రమంలోఎంపీ అనిల్‌కుమార్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, అమీర్ అలీఖాన్, బల్మూరి వెంకట్, వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, వీ హనుమంతరావు, డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు నూతిశ్రీకాంత్, మెట్టు సాయికుమార్, అజ్మత్ కొత్వాల్, తహర్బీన్ అహ్మదాని తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆవిర్భావ వేడుకల్లో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బకని నర్సింహులు జాతీయ జెండాను ఆవిషరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, నాయకులు డాక్టర్ ఏఎస్ రావు, పోలంపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యాలయమైన మగ్ధూంభవన్‌లో సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్యపద్మ అధ్యక్షతన సమావేశం జరిగింది. కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఈటీ నరసింహ తదితరులు పాల్గొన్నారు.