దుబ్బాక, మార్చి 2: దుబ్బాకను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ తొలి కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు సమస్యలపై ఏకరువు పెట్టారు. సోమవారం దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీతారవీందర్ అధ్యక్షతన తొలి కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వార్డుల్లో తాగునీరు, పారిశుధ్యం సమస్యలు తీవ్రంగా ఉన్నాయని కౌన్సిలర్లు సమావేశం దృష్టికితీసుకువెళ్లారు. అంతర్గత సీసీ రోడ్లు , డ్రైనేజీలు లేక అధ్వానంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
లచ్చపేట శివారులో నిర్మించిన డంపింగ్‌యార్డులో కాకుండా పరిసరాల్లో చెత్తవేయడం వల్ల 10, 11 వార్డుల ప్రజలు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని ఆరోపించారు. ధర్మాజీపేటలో గుంతలరోడ్ల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని 7,8,9 వార్డుల కౌన్సిలర్లు వాపోయారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలపై కమిషనర్‌కు ఫోన్ చేసినా లిఫ్ట్చేయడం లేదని మండిపడ్డారు. ఈసందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా కృషిచేద్దామన్నారు.
మున్సిపల్‌కు మంజూరైన నిధులతో ఒక్కో సమస్యను పరిష్కరించుకుందామన్నారు. మున్సిపల్లోని 20 వార్డుల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను వార్డు కౌన్సిలర్లతో చర్చించి, ఒక బుక్లెట్ రూపొందించాలని మున్సిపల్ కమిషనర్ రమేశ్‌కుమార్‌కు సూచించారు. మున్సిపల్ నిధులతో పాటు ఇతర అభివృద్ధి నిధులతో దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ ఆస సులోచన, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.