BJP | హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): అక్రమ కట్టడాల పేరుతో పేద, మధ్య తరగతి కుటుంబాల ఇండ్లను కూల్చివేస్తున్న హైడ్రాకు సూపర్ పవర్స్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సును గవర్నర్ ఆమోదించడం వెనుక ఇద్దరు కేంద్ర మంత్రుల సహకారం ఉన్నట్టు అత్యంత విశ్వనీయంగా తెలిసింది. పైకి మూసీ బాధితుల పక్షాన ఉన్నట్టు నటిస్తూనే లోపల హైడ్రా చట్టాన్ని బలోపేతం చేయడానికి వారిద్దరు సహకరించినట్టు సమాచారం. ఒకవైపు పేదల ఇండ్ల మీదికి బుల్డోజర్లు దింపితే ప్రభుత్వాన్ని స్తంభింపపేస్తామని పత్రికా ముఖంగా ప్రకటనలు చేస్తూనే.. మరోవైపు గవర్నర్ మీద ఒక రకమైన ఒత్తిడి తీసుకొచ్చి ఆర్డినెన్స్ మీద సంతకం చేయించినట్టు తెలిసింది.
బీజేపీ ద్వంద్వ వైఖరి
హైదరాబాద్‌లోని మూసీ పరీవాహక ప్రాంతాల సందరీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి వర్గాల ఇండ్లు కూల్చే విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నది. ఆ పార్టీ నేతలు పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు ప్రయోగిస్తే సహించం అని పత్రికా ముఖంగా ప్రకటనలు చేయడం తప్ప ఇంతవరకు ప్రత్యక్ష ఆందోళనల్లోకి రాలేదు. బాధిత కుటుంబాలను పరామర్శించలేదు. రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను రోడ్డుపాలు చేస్తూ అమానవీయంగా వ్యవహరిస్తున్నట్టు మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా రాస్తున్నది. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర పట్టాణాభివృద్ధి శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించవచ్చు. లేదంటే రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రుల హోదాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయవచ్చు. కానీ వారు ఇప్పటివరకు ఇటువంటి రాజ్యాంగ బద్ధమైన పనులేమీ చేయలేదు. కేవలం పత్రికా ప్రకటనలకు మాత్రమే పరిమితమై జబ్బలు చరుస్తూ వస్తున్నారు.
గవర్నర్‌పై ఒత్తిడి
హైడ్రాకు మరిన్ని విస్తృత అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్‌కు ఈ నెల ఒకటిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు. పది రోజుల్లోనే వివాదాస్పద అర్డినెన్స్ను గవర్నర్ ఆమోదించటం ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్ర క్యాబినెట్ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపిన వెంటనే కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ స్పందించి ఉంటే ఫలితం మరో రకంగా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రా విధివిధానాలు, ప్రత్యేక అధికారాలు కల్పించటంపై తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని కోరి ఉంటే గవర్నర్ ఇంత తొందరగా ఆమోదం తెలిపేవారు కాదని రాజ్‌భవన్ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి ఈ ఆర్డినెన్స్‌పై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆయన దాదాపు 18 రకాల సందేహాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది.