హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ ప్రతిపాదనలపై న్యాయ సలహా ఇవ్వాలని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ కేంద్ర హోంశాఖను కోరారు. ఈ ఆర్డినెన్స్‌పై గవర్నర్ రాజ్‌భవన్ అధికారులతో, తాజాగా అడ్వకేట్ జనరల్‌తోనూ చర్చించారు. ప్రధానంగా సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్ అంశంపైనే సందిగ్ధత నెలకొన్నట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆర్డినెన్స్ ప్రతిపాదనలపై న్యాయ సలహా ఇవ్వాలని నేరుగా కేంద్ర హోంశాఖను గవర్నర్ కోరారు. ఆర్డినెన్స్ ప్రతిపాదనలను కేంద్రానికి పంపారు. ఇదిలా ఉంటే ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతికి పంపగా, అవి అక్కడే పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను నెలాఖరులోగా ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు విధించిన గడువు శుక్రవారంతో ముగియనున్నది.