హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటివరకు 8.54 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ధాన్యం, మక్కజొన్న, సోయా కొనుగోళ్లపై మంత్రులు ఉత్తమ్, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్తో కలిసి కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన ధాన్యంలో సన్నాలు 3.95 లక్షల టన్నులు కాగా, దొడ్డు ధాన్యం 4.59 లక్షల టన్నులు ఉన్నట్టు తెలిపారు.
ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.2,041.44 కోట్లు కాగా, రూ.832.9 కోట్లు ఇప్పటికే రైతులకు చెల్లించామని, రూ.1208.54 కోట్లు చెల్లించాల్సి ఉన్నదని తెలిపారు. సన్నాల బోనస్ మొత్తం రూ.197.73 కోట్లకుగాను రూ.35.72 కోట్లు చెల్లించామని వెల్లడించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. పత్తి కొనుగోళ్ల విషయంలో కొత్త నిబంధనల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదురొంటున్నారన్నారు.