Lift Irrigation Projects (మ్యాకం రవికుమార్) హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో ఎత్తిపోతల పథకాల నిర్వహణపై అయోమయం నెలకొన్నది. ఎత్తిపోతల పథకాలకు ఈ ఏడాది ఏ మేరకు, ఏయే సమయాల్లో విద్యుత్తు అవసరం ఉంటుంది? తదితర అంశాలపై ఇప్పటికీ ప్రభుత్వం దృష్టి సారించనేలేదు. మరోవైపు ట్రాన్స్‌కో, ఇరిగేషన్ శాఖల మధ్య విద్యుత్తు సరఫరాపై సమన్వయం కొరవడింది. బిల్లులు చెల్లిస్తేనే కరెంట్ సరఫరా చేస్తామంటూ ట్రాన్స్‌కో కొర్రీలు పెడుతున్నది. 24గంటల బదులు ఇప్పటికే 12గంటల పాటే సరఫరా చేస్తున్నది. ట్రాన్స్‌కో తీరుతో పంపులు దెబ్బతింటాయని, 24 గంటలపాటు ఇవ్వాల్సిందేనని ఇరిగేషన్ శాఖ కోరుతున్నది. లేదంటే సాగునీటి సంక్షోభం ఏర్పడుతుందని ఆ శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆయా అంశాలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. మున్ముందు ఎల్‌నినో ప్రభావం ఉంటుందనే నేపథ్యంలో ఎత్తిపోతల నిర్వహణ ఎట్లా? అనే దానిపై ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బిల్లులిస్తేనే కరెంటిస్తం
కాంగ్రెస్ ప్రభుత్వం దీర్ఘకాలంగా పంపింగ్ స్టేషన్లకు సంబంధించిన బిల్లులను విడుదల చేయడమే లేదు. పెండింగ్ బకాయిలిస్తే తప్ప విద్యుత్తు సరఫరా ఇవ్వబోమని ట్రాన్స్‌కో విభాగం ఇరిగేషన్ శాఖకు గత సీజన్లోనే తెగేసి చెప్పింది. అందులో అత్యవసరంగానైనా కనీసం రూ.500 కోట్లు చెల్లించాలని ట్రాన్స్‌కో సుదీర్ఘకాలంగా ఇరిగేషన్ శాఖకు, ప్రభుత్వానికి మొరపెట్టుకొంటున్నది. అయినా ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వస్తున్నది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి, బిల్లుల చెల్లింపుపై హామీ ఇవ్వడంతో 24 గంటలకు బదులు 12 గంటలపాటే, అదీ పగటిపూట మాత్రమే ఇచ్చేందుకు షరతుపై ఒప్పుకొన్నది. గత సీజన్ నుంచి ఆ మేరకు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు పగటిపూటే విద్యుత్తును సరఫరా చేయసాగింది. వెరసి ప్రాజెక్టుల్లో ఆశించిన స్థాయిలోనే నీటినిల్వలున్నా లిఫ్ట్ పథకాలు నిర్దేశిత లక్ష్యంమేరకు నీటిని ఎత్తిపోయలేని దుస్థితి నెలకొన్నది. దీంతో పలు చోట్ల కీలక దశలో సాగునీరందక పంటలు ఎండిపోయే దుర్భర పరిస్థితి దాపురించాయి.
వాస్తవంగా రాష్ట్రంలో సాగు, తాగునీటి అవసరాలు తీర్చడంలో ప్రధానంగా ఏఎమ్మార్పీ, కాళేశ్వరం ప్రాజెక్టులతోపాటు, కల్వకుర్తి, రాజీవ్‌భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, అలీసాగర్, గుత్పా, చౌటుపల్లి హన్మంతరెడ్డి, దేవాదుల తదితర పంపింగ్ స్టేషన్లు అత్యంత కీలకం. ప్రధాన ఆయకట్టు ఆయా పంప్‌హౌస్‌ల దిగువనే ఉన్నది. ఇవిగాక అనేక లిఫ్ట్ స్కీమ్‌లు సైతం ఉన్నాయి. ఆయా లిఫ్ట్‌ల విద్యుత్తు సరఫరాకు సంబంధించిన బిల్లులే దాదాపు రూ.27,027 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే పూర్తయిన లిఫ్ట్ స్కీమ్‌ల పనులకు గాను రూ.863.51కోట్లు, నిర్మాణంలో ఉన్న పలు ప్రాజెక్టుల పంప్‌హౌజ్‌ల నిర్మాణం, విద్యుత్తు సరఫరా కోసం రూ.3,900.81 కోట్లు.. మొత్తంగా రూ.4764.32 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. పంపింగ్ స్టేషన్ల ఆపరేషన్స్, నిర్వహణకు సంబంధించి రూ.1,745 కోట్లు బకాయిలున్నాయి. ఇవన్నీ కలిపి 33,536.32 కోట్ల నిధులను ట్రాన్స్‌కోకు ఇరిగేషన్ శాఖ చెల్లించాల్సి ఉన్నది.
ఆన్‌అండ్‌ఆఫ్ విధానంతో ప్రమాదంలో పంపులు
ట్రాన్స్‌కో తీరుపై ఇరిగేషన్ శాఖ అధికారులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. ఆన్‌అండ్‌ఆఫ్ విధానంలో కరెంటు సరఫరా చేస్తుండటంతో వేల కోట్ల విలువైన పంపులు దెబ్బతినే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆన్‌అండ్‌ఆఫ్ విధానంలో 28 పంపింగ్స్టేషన్లు పనిచేస్తున్నాయి. వర్షాకాలంలో అంటే జూలై నుంచి అక్టోబర్ వరకు, వానకాలం ముగిసిన వెంటనే అంటే మార్చి వరకు ఈ షెడ్యూల్ సాధ్యపడదని అధికారులు చెప్తున్నారు. నీటిని ఎత్తిపోయాల్సిన అవసరం అప్పుడే ఉంటుందని చెప్తున్నారు. అదీగాక పంపింగ్ చేయాల్సిన నీటి పరిమాణం, పంపుల సామర్థ్యం, సంఖ్య కారణంగా, చివరి ఆయకట్టు వరకు అవసరమైన నీటిని అందించాలంటే పంపింగ్ స్టేషన్ కింద ఉన్న చెరువులు, రిజర్వాయర్లను నింపాల్సి ఉంటుందని, అందుకు 24 గంటలు పంపింగ్ అవసరమని తేల్చి చెప్తున్నారు. దాదాపు 35 పంపింగ్స్టేషన్లకు ఈ విధమైన ఆన్‌అండ్‌ఆఫ్ సిస్టమ్ పనిచేయబోదని వెల్లడిస్తున్నారు. ఎందుకంటే ఆయా పంపులు అధిక డిశ్చార్జ్, 10 మెగావాట్ల కంటే ఎకువ రేటింగ్ కలిగి ఉన్నాయని, ఇన్ 10కి.మీ, పొడవైన లైనింగ్ లేని టేక్ కాలువలు ఉంటాయని, ప్రెషర్ మెయిన్లు, పొడవైన నీటి సరఫరా వ్యవస్థ ఉంటుందని వివరిస్తున్నారు.
ఖాళీ ప్రెషర్ మెయిన్‌తో పంపును ప్రారంభిస్తే ప్రతిసారి అధిక ప్రకంపనలు ఉంటాయని, ఆన్‌అండ్‌ఆఫ్ విధానం వల్ల తలెత్తిన ప్రకంపనల వల్ల మేడారం, రామడుగు పంపింగ్ స్టేషన్లలోని పలు పంపుల ఇంపెల్లర్లు దెబ్బతిన్నాయని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ట్రాన్స్‌కో చెబుతున్న అన్అండ్ఆఫ్ విధానం కుదరదని, పంపులను 24 గంటలూ నడుపకపోతే చివరి ఆయకట్టుకు నీరు చేరబోదని, జలాశయాలను నింపలేమని తేల్చిచెప్తున్నారు. పదేపదే స్టార్ట్-స్టాఫ్ ఆపరేషన్లు చేయడం వల్ల అది మోటర్ పనితీరుపై దుష్ప్రభావం చూపు తుందని వివరిస్తున్నారు. రా్రష్ట్రంలోని అన్ని ప్రధాన ఎత్తిపోతలకు సంబంధించి సుమారు 6,000 మెగావాట్ల విద్యుత్తు అవసరం ఉంటుంది. ఏటా విద్యుత్తు అవసరాల మేర అంచనాలు ఏప్రిల్, మే నెలల్లోనే రూపొందించి ఇరిగేషన్ శాఖ అటు ప్రభుత్వానికి, అటు ట్రాన్స్‌కోలోని ఎస్ఎల్డీసీకి, లిఫ్ట్ స్కీమ్‌ల డైరెక్టర్‌కు అందజేస్తుంది. ట్రాన్స్‌కో తీరుతో ఈసారి ఇప్పటివరకు ఆ అంచనాపై ఎలాంటి దృష్టి సారించలేదు. సకాలంలో అంచనాలు రూపొందించకపోతే రాబోయే సీజన్లో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఇరిగేషన్ అధికారులు వెల్లడిస్తున్నారు.
అసలే పట్టించుకోని ప్రభుత్వం
ట్రాన్స్‌కో తీరుపై ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దల దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తూనే ఉన్నారు. ఆన్‌అండ్‌ఆఫ్ కాకుండా నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేసేలా చొరవ చూపాలని మొత్తుకుంటున్నారు. ప్రభు త్వం సైతం గత ఏప్రిల్‌లో ఇరిగేషన్, ట్రాన్స్‌కో అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. అయినా ట్రాన్స్‌కో అధికారులు వెనక్కి తగ్గలేదని తెలుస్తున్నది. బిల్లుల కోసం పట్టుబడుతున్నట్టు సమాచారం. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు సైతం చేతులెత్తారని తెలుస్తున్నది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. లోటు వర్షపాతమే ఉంటుందని నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. ఎత్తిపోతల పథకాలు ఏడాదిలో 90 నుంచి గరిష్ఠంగా180 రోజుల వరకు మాత్రమే పనిచేస్తాయి. అప్పుడే ఆ రిజర్వాయర్లను నింపే అవకాశం ఉంటుంది. కానీ సర్కార్ చేతులెత్త్తేయడంతో ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందోనని ఇరిగేషన్ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.