హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు.. రాష్ట్రంలో బీభత్సం (Heavy Rain) సృష్టిస్తున్నాయి. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యంలో నిండా మునిగిపోయింది. ఫలితంగా ప్రజానీకం తీవ్ర అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొన్నది. రాష్ట్రం అతలాకుతులమవుతుంటే కాంగ్రెస్ సర్కారు (Congress Govt) మాత్రం మొద్దునిద్ర నుంచి మేల్కోవడంలేదు. కనీస సహాయ, పునరావాస చర్యలు చేపట్టలేదు.
దిక్కులేని పునరావాస శిబిరాలు
మొంథా తుపాను దిశ మార్చుకుని తెలంగాణ వైపే పయనించినట్టు వాతావరణశాఖ హెచ్చరించింది. మరో 24 గంటల్లో రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయినా సర్కారు మొద్దునిద్ర నుంచి తేరుకోవడంలేదని ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వం జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించలేదు. జిల్లాల ఇన్చార్జి మంత్రులు జూబ్లీహిల్స్‌కే పరిమితమయ్యారు. సీఎం, సీఎస్ స్థాయిలో నిరంతర వరుస సమీక్షలు, కరువయ్యాయి. పంట నష్టం అంచనాలు వేసేవాళ్లు, వరదబాధితులను పరామర్శించేవాళ్లు కనిపించడంలేదు. వర్షం బీభత్సం సృష్టించిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి తూతూమంత్రంగా అధికారులను ఆరా తీసి మమ అనిపించేశారు
ఓట్ల పాకులాటలో మంత్రివర్గం
మొంథా తుఫాను ప్రభావంతో రా్రష్ట్రం విలవిల్లాడుతున్నది. వాస్తవానికి మంగళవారమే వాతావరణశాఖ పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. కానీ హెచ్చరికలను సర్కారు ఖాతరు చేయలేదు. ఇన్చార్జి మంత్రులున్నా.. వారికి సీఎం జూబ్లీహిల్స్ ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. ఒక్కో డివిజన్‌కు ఇద్దరు చొప్పున మంత్రులను మోహరించారు. ‘మీకు అప్పగించిన డివిజన్లో తక్కువ ఓట్లు వస్తే.. మీదే బాధ్యత’ అంటూ వారిని ఆత్మరక్షణలో పడేశారు. దీంతో మంత్రులంతా జూబ్లీహిల్స్ ఎన్నికలకే పరిమితమయ్యారు. రా్రష్ట్రంలో ప్రజలు వరదల్లో మునుగుతుంటే.. కాంగ్రెస్ సర్కారు మాత్రం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట్ల వేటలో ముగిసింది. ప్రజలను పాలనను పూర్తిగా గాలికొదిలేసిందని ప్రజలు, వరద బాధితుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బడికెళ్లాక సెలవు ప్రకటిస్తారా?
వర్షాలతో విద్యాసంస్థలకు సెలవుల విషయంలో ప్రభుత్వం అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. టీచర్లు, విద్యార్థులంతా బడులకు చేరుకున్న తర్వాత సెలవు అని ప్రకటించారు. దీంతో బడుల్లో ఉండాలో.. లేక ఇంటికి వెళ్లాలో తెలియక విద్యార్థులు, టీచర్లు అవస్థలుపడ్డారు. విద్యార్థులు తమ ఇండ్లకు చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో వర్షంలో తడుస్తూనే రోడ్లపై నిరీక్షించాల్సి వచ్చింది. బడుల ప్రారంభానికి ముందే సెలవులు ప్రకటిస్తే ఇలా జరిగేది కాదని తల్లిదండ్రులు మండిపడ్డారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు పాఠశాల టీచర్లు తిరిగి ఇంటికి వెళుతుండగా చెక్‌డ్యామ్ వద్ద వరద ఉధృతికి వారు ప్రయాణిస్తున్న కారు పొలాల్లోకి కొట్టుకుపోయింది. స్థానికులు స్పందించడంతో కారులోని ఐదుగురు టీచరర్లకు పెను ప్రమాదం తప్పింది. వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో బడులకు సెలవులు ప్రకటించగా, సమ్మెటివ్ పరీక్షలు (ఎస్ఏ) -1 పరీక్షలను అధికారుల వాయిదావేశారు. మహబూబ్‌నగర్, సూర్యాపేట, వికారాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాలో బడులకు సెలవులు ప్రకటించారు. తుపాను విరుచుకుపడిన నేపథ్యంలో వరంగల్, ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కలెక్టర్లు.. బాధితులను సహాయ, పునరావాస కేంద్రాలకు తరలించినట్టు తెలిసింది.
అక్కడ హడావుడి… ఇక్కడ మొక్కుబడి
ఏపీలో మొంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా చర్యలు తీసుకుంటున్నది. ఆ రాష్ర్టానికి ఘోర విపత్తు వచ్చిందని, దాని ప్రభావాన్ని కట్టడి చేసేందుకు కృషి చేస్తున్నట్టు చెప్తున్నది. కానీ అంతకంటే ఎక్కువ ప్రభావం కలిగిన తెలంగాణలో మాత్రం ఇక్కడి ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. ఎలాంటి వర్ష బీభత్సం లేదన్నట్టుగా మొక్కుబడిగా చర్యలు తీసుకుంటున్నది. ఏపీలోని ఒంగోలు, గోదావరి జిల్లాల కన్నా… తెలంగాణలోని హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లోనే అతి భారీ వర్షాలు కురిశాయని వాతావరణశాఖ నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వార్‌రూమ్ ఏర్పాటు చేసి, యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన సమయంలో… రొటీన్ రివ్యూలతో తూతూ మంత్రం సమీక్షలతో సరిపెట్టడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వినిపిస్తున్నాయి.