కౌడిపల్లి, మే 12 : బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటే, కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి రైతులను అరిగోస పెడుతున్నారని మాజీమంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు. ధాన్యం సేకరణలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మంగళవారం మెదక్ జిల్లా కౌడిపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ధాన్యం సేకరణలో పూర్తిగా విఫలమైందని అన్నారు. రైతులను కన్నీరు పెట్టిస్తున్న రేవంత్ సర్కార్ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయక రైతులను అష్టకష్టాలు పెడుతున్నదని మండిపడ్డారు.
ఏకంగా కాంగ్రెస్ కార్యకర్తలే రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారంటే ప్రభుత్వ తీరు ఎలా ఉన్నదో అర్థమవుతున్నదని అన్నారు. వరి కోతలు ప్రారంభమై నెల గడుస్తున్నా ఇప్పటివరకు చాలాచోట్ల కాంటా ప్రారంభం కాలేదని, లారీలు రాక రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని దుయ్యబట్టారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని ఏగ్రామానికి వెళ్లినా రైతులు తమ వడ్లు కొంటలేరని, త్వరగా కొనేలా చూడాలంటూ తమతో ప్రాథేయపడుతున్నారని తెలిపారు. సెంటర్లకు వడ్లు తెచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. రైస్‌మిల్లర్లు తరుగు పేరుతో ఒక్కో బస్తాకు 5కిలోలు అదనంగా తీసుకుంటూ రైతులను దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులు ఎవరూ అధైర్య పడొద్దని ఆమె భరోసా ఇచ్చారు.