Rythu Bharosa |హైదరాబాద్, ఫిబ్రవరి5 (నమస్తే తెలంగాణ): రైతు భరోసా పంపిణీలో ప్రభుత్వం చెప్తున్న లెక్కలు గందరగోళంగా ఉన్నాయి. ఎకరం భూమిని పరిమితిగా తీసుకున్నప్పుడు రైతుల సంఖ్య తగ్గితే ఆ మేరకు భూమి విస్తీర్ణంలో మార్పు ఉండకూడదు. రైతుల సంఖ్య పెరిగితే భూమి విస్తీర్ణం కూడా పెరగాలి. కానీ ప్రభుత్వం చెప్తున్న లెక్కల్లో రైతుల సంఖ్య తగ్గితే.. భూమి విస్తీర్ణం పెరిగింది. మరి పెరిగిన భూమి ఎవరి పేరున ఉంది.. ఏ విధంగా పెరిగిందనేది అంతుచిక్కని ప్రశ్న. ఇక 2023 వానకాలం లెక్కలతో పోల్చితే ఈ యాసంగి రైతుభరోసా లెక్కల్లో భారీ తేడాలున్నాయి. ప్రభుత్వం బుధవారం ఎకరం వరకు రైతులకు రైతుభరోసా వారి ఖాతాల్లో జమ చేసినట్టు ప్రకటన విడుదల చేసింది. గత నెల 27న జరిగిన పంపిణీతో కలిపి ఎకరం వరకు ఉన్న రైతులు 21,45,330 మందికి రూ.1126.54 కోట్లు విడుదల చేసినట్టు వెల్లడించింది. ఈ లెక్కన ఎకరానికి రూ.6 వేల చొప్పున 18,77,567 ఎకరాలకు రైతుభరోసా పంపిణీ చేసింది.
రైతుల సంఖ్య తగ్గితే.. భూమి ఎలా పెరుగుతుంది ?
గత వానకాలం రైతుభరోసా లెక్కలను ఈ యాసంగి లెక్కలను పోల్చితో లెక్కల్లో తీవ్ర గందరగోళం కనిపిస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో 2023 వానకాలంలో రైతుబంధు పంపిణీకి, కాంగ్రెస్ సర్కారు ఈ యాసంగిలో చేసిన పంపిణీ చేస్తున్న లెక్కలను పరిశీలిస్తే ఈ గందరగోళం బయటపడుతుంది. వానకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరం వరకు గల 22,55,181 మంది రైతులకు చెందిన 12,85,147 ఎకరాలకు రూ. 642.57 కోట్లు రైతుబంధు అందజేసింది. ఇక కాంగ్రెస్ సర్కారు ఈ యాసంగిలో ఎకరం వరకు గల 21,45,330 మంది రైతులకు చెందిన 18,77,567 ఎకరాలకు రూ. 6వేల చొప్పున రూ.1126.54 కోట్లు విడుదల చేసింది. అంటే గత వానకాలంతో పోల్చితే ఈ యాసంగిలో 1,09,851 మంది రైతులు తగ్గారు. కానీ భూమి విస్తీర్ణం మాత్రం గతంతో పోల్చితే 5,92,420 ఎకరాలు పెరిగింది. రైతుల సంఖ్య తగ్గి భూమి విస్తీర్ణం పెరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కాంగ్రెస్ సర్కారు మార్క్ మాయాజాలం అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పనికిరాని భూముల తీసేస్తే.. భూమి ఎలా పెరిగింది
గత ప్రభుత్వం రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలకు, వెంచర్లకు రైతుబంధు ఇచ్చిందంటూ విమర్శించిన కాంగ్రెస్.. దీనిపై ఇటీవల సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 2 లక్షల నుంచి 2.5 లక్షల ఎకరాల వరకు సాగుకు పనికిరాని భూమి ఉన్నట్టు రెవెన్యూ, వ్యవసాయ శాఖ తేల్చాయి. ఈ లెక్కన చూసినా గతంతో పోలిస్తే 2.5 లక్షల ఎకరాలు తగ్గాలి కానీ ఏకంగా 6 లక్షల ఎకరాల వరకు భూమి పెరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో పనికిరాని భూములను తేల్చితే మళ్లీ ఎకరం వరకు భూమి పెరగడం ఏంటనే ప్రశ్న అందర్ని తొలస్తున్నది.
మిగిలిన రైతులకు ఎప్పుడు…?
ఎకరం వరకు ఉన్న రైతులకు బుధవారం రైతుభరోసా పంపిణీ చేసిన ప్రభుత్వం మిగిలినవారికి ఎప్పుడు రైతుభరోసా ఇస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రైతుభరోసాపై కాంగ్రెస్ సర్కారు పూటకో మాట మాట్లాడుతుండటమే ఇందుకు కారణం. ఇప్పటికే గత నెల 26 నుంచి రైతుభరోసా పంపిణీ చేస్తామని ప్రకటించిన సర్కారు.. పది రోజుల తర్వాత ఎకరం భూమి ఉన్న రైతులకు మాత్రమే జమచేసింది. ఇప్పుడు రెండెకరాల రైతులు రైతుభరోసా కోసం మరో పది రోజులు ఆగాల్సిందేనా అన్న ప్రశ్న వినిపిస్తున్నది. మార్చి 31 వరకు పథకాలను పూర్తి చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. దీంతో రైతుభరోసా కోసం అప్పటివరకు వేచి చూడాల్సిందేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కోతలు షురూ…
ఇక కాంగ్రెస్ సర్కారు అన్నంత పని చేసింది. రైతుభరోసాలో కోతలు మొదలుపెట్టింది. 1,09,851 మంది రైతులకు రైతుభరోసా కోత పెట్టింది. ఈ లెక్కన వీరికి సగటున ఎకరం భూమి ఉన్నా లక్ష ఎకరాలకు కోత పెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తద్వారా సుమారు రూ. 60 కోట్ల వరకు రైతులకు నష్టం కలిగినట్టేనని నిపుణులు పేర్కొంటున్నారు.