సిరిసిల్ల రూరల్, జూలై 13: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇసుక ధరలను అమాంతం పెంచేశారు. ఒక ట్రాక్టర్ ట్రిప్పునకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు చేరడంతో ఇందిరమ్మ ఇండ్లతోపాటు ఇతర గృహ నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. ‘ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కొరత లేదు.. ఉచితంగా అందిస్తాం’ అని ప్రభుత్వం చెప్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం అమలు కావడంలేదు. ఆదివారం సిరిసిల్ల పట్టణంలోని 10వ వార్డు పరిధిలో విలీన గ్రామమైన చిన్నబోనాల లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ఇండ్ల నిర్మాణం కోసం ఇసుక ఉచితమని చెప్పి, ఒక ట్రాక్టర్ ట్రిప్పునకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు అడుగుతున్నారని వాపోయారు. ఇసుక ధరను పెంచేయడంతో వార్డులో 26 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు నిలిచిపోయినట్టు వారు పేర్కొన్నారు. అధికా రులు ధరలు తగ్గించాలన్నారు.