మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నాగర్‌కర్నూల్ : దైవ దర్శనం కోసం వెళితే కాంగ్రెస్ గూండాలు ఓ కుటుంబంపై దాడి చేసి, రెండు నెలల చిన్నారి చావుకు కారణమైన వారిని వదిలేసి ఉల్టా బాధితులపైనే కేసులు నమోదు చేసిన ఘటన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సంచలనం సృష్టించింది. పసిబిడ్డ చావుకు కారణమైన వారిపై కేసు న మోదు చేయకుండా పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలకడంతో బీఆర్ఎస్ భగ్గుమంది. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేం ద్రంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆ ధ్వర్యంలో భారీ ఎత్తున బీసీ సంఘాలతో కలిసి పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. కాంగ్రెస్ గూండాలపై మర్డర్ కేసు నమోదు చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, బీసీ సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించారు.
నిందితులు పరారీలో ఉన్నారని చెప్పడంతో మాజీ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నా వెంట గ్రామానికి రండి.. వాళ్లను పట్టిస్తా’ అంటూ కుమ్మెరకు బయలుదేరారు. మాజీ ఎమ్మెల్యే చేరుకోక ముందే భారీ ఎత్తున పోలీసులు చేరుకున్నారు. కాంగ్రె స్ గూండాలు ఇండ్లకు తాళం వేసి పరారు కావడంతో బాధితులను పరామర్శించారు. చిన్నారి సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. తక్షణ సాయంగా రూ.లక్ష అందించి బాధితులకు ఇంటిని నిర్మించి ఇస్తామని మాజీ ఎమ్మెల్యే మర్రి హామీ ఇచ్చారు. మహబూబ్‌నగర్‌లో పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. బాధితులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం వస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి వెల్లడించారు.
కుమ్మెరలో రెండేండ్ల దళిత చిన్నారి అనుమానాస్పద మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు.
కుమ్మెర ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది ఇమ్మానేని రామారావు ఆదివారం ఎన్‌హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు.