హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : చిన్నారుల ఆలనాపాలన చూడడంతోపాటు వారితో అక్షరాలు దిద్దిస్తూ గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ టీచర్లకు ‘సర్’ (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తున్నది. వీరిని బీఎల్వోలుగా నియమించడంపై అభ్యంతరం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే ఓటర్ల నమోదు, తొలగింపుతోపాటు పల్స్‌పోలియో, వ్యాక్సినేషన్ విధులు నిర్వహించిన అంగన్వాడీ టీచర్లపై ‘సర్’ పేరిట అదనపు భారం మోపడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అటు సెంటర్ల నిర్వహణ, ఇటు ఎన్యుమరేషన్ బా ధ్యతలు నిర్వర్తించండం ఇబ్బందికరంగా మా రిందని అంగన్వాడీ టీచర్లు అంటున్నారు.
జూన్ 25న ప్రారంభమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఈ నెల 25 వరకు చేపట్టనున్నారు. అంగన్వాడీ టీచర్లను బీఎల్వోలుగా నియమిస్తూ ఐసీడీఎస్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వీరు అనివార్యం గా సెంటర్ల నిర్వహణను పక్కనబెట్టి ఎన్యుమరేషన్ కోసం ఇంటింటికీ వెళ్తున్నారు. సెంటర్లకు వస్తున్న చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. పౌష్టికాహారం అందక గర్భిణులు, బాలింతలు ఇక్కట్ల పాలవుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 35వేల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయాలు, టీచర్లు కలిపి 70 వేల మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 18 వేల సెంటర్లలో కేవలం ఒక్కరు చొప్పున మాత్రమే ఉన్నారు. ఇందులోనూ ఇటీవల అప్‌గ్రేడ్ చేసిన 3,893 సెంటర్లలో ఆయాలను నియమించలేదు. 15 వేల కేంద్రాలను టీచర్లతోనే నెట్టుకొస్తున్నారు. వీరికి కూడా ఎన్యుమరేషన్ బాధ్యతలు అప్పగించడంతో నిర్వహణ గాలిలో దీపంలా మారింది.
అంగన్వాడీలకు ‘సర్’ ప్రక్రియ కోసం బీఎల్వోలుగా నియమించడంపై అభ్యంతరా లు వచ్చాయి. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగం గా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు కొనసాగించాల్సిన సెంటర్లను ఉద యం 10 నుంచి 3 గంటలకు మార్చింది. పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఎన్యుమరేషన్ బాధ్యతలు నిర్వర్తించాలని నిర్దేశించింది. పనివేళలు మార్చినా ఫలితం లేదని అంగన్వాడీ టీచర్లు పెదవి విరుస్తున్నారు.
ఇప్పటికే పనిభారంతో ఉక్కిరిబిక్కిరవుతున్న అంగన్వాడీ టీచర్లకు ‘సర్’ బాధ్యతలు అప్పగించడంతో సర్కార్‌పై అంగన్వాడీ టీచ ర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బీఎల్వోల బాధ్యతల నుంచి తప్పించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌తోపాటు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సైతం కలిసి విన్నవించారు. తమతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న ప్రభుత్వం పారితోషికం కూడా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.