Telangana | వరంగల్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యారంగం కునారిల్లుతున్నది. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను సర్కారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వరంగల్, ఖిలావరంగల్ మండలాల్లో 26 ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు లేవు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న పాఠశాలలకు ప్రభుత్వం సక్రమంగా కిరాయి చెల్లించడం లేదు. వరంగల్ మండలంలో 4, ఖిలావరంగల్ మండలంలో 6 పాఠశాలల భవనాలకు రూ.21 లక్షలకుపైగా అద్దెను పెండింగ్లో పెట్టడంతో వాటిని ఖాళీ చేయాలని విద్యాశాఖ అధికారులపై యజమానులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆయా పాఠశాలలను సమీపంలోని ఇతర భవనాల్లోకి తరలించి, ఉపాధ్యాయులు తమ సొంత సొమ్ముతో అద్దె చెల్లించాల్సి వస్తున్నది. వరంగల్ ఎల్బీనగర్ లోతుకుంటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతున్నది. అది కూడా ఒకే ఒక ఇరుకు గదిలో. ఆ గదిని ఉపాధ్యాయులు ఉపయోగించుకుంటూ విద్యార్థులకు వరండాలో పాఠాలు బోధిస్తున్నారు.
అదే గదిపైన కార్మికులు మధ్యాహ్న భోజనం వండి విద్యార్థులకు పెడుతున్నారు. ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు ప్రతి నెలా రూ.1,000 చొప్పున తమ సొంత సొమ్మును అద్దెగా చెల్లిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆ గది అద్దెను రూ.2 వేలకు పెంచాలని యజమాని డిమాండ్ చేస్తుండడంతో ఉపాధ్యాయులకు ఏమీ పాలుపోవడం లేదు. నిరుడు ఈ పాఠశాలలో 17 విద్యార్థులుండగా.. ఈ ఏడాది వారి సంఖ్య 12కు పడిపోయింది. ప్రస్తుతం వారు కూడా స్కూలుకు రావడం లేదు. వరంగల్ ఎల్బీనగర్ ఎంజే రోడ్డులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితి మరీ దయనీయంగా ఉన్నది.
1952లో ఏర్పాటైన ఈ స్కూలుకు ఇప్పటికీ సొంత భవనం లేదు. ఆరంభంలో కొన్నేండ్లపాటు మండీబజార్లోని ఓ అద్దె భవనంలో కొనసాగిన ఈ పాఠశాల.. ఆ తర్వాత దేశాయిపేటలోని మరో అద్దె భవనంలోకి మారింది. యజమాని ఒత్తిడి మేరకు ఉపాధ్యాయులు ఇటీవల ఆ భవనాన్ని కూడా ఖాళీ చేసి సమీపంలోని ఇంటిలో రెండు చిన్న గదులను అద్దెకు తీసుకున్నారు. వాటిలో పాఠశాలను నడిపేందుకు ఆ ఉపాధ్యాయులే ప్రతి నెలా రూ.5 వేల వరకు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అక్కడ నిరుపయోగంగా ఉన్న అంబేద్కర్ కమ్యూనిటీ హాలును పాఠశాల నిర్వహణకు కేటాయించాలని ఉపాధ్యాయులు, స్థానికుల నుంచి వస్తున్న వినతులను అధికారులు పట్టించుకోవడం లేదు.