Warm Water | నీరు మన శరీరానికి ఎంతో అవసరమన్న సంగతి మనందరికీ తెలిసిందే. శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియకు, రక్తప్రసరణకు, జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేయడానికి, శరీర జీవక్రియలకు నీరు ఎంతో అవసరం. రోజూ 8 నుండి 9 గ్లాసుల నీటిని తప్పకుండా మనం తాగాల్సిందే. అలాగే రోజూ మనం నీటిని తాగుతున్నప్పటికీ ఉదయం పూట ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటిని తీసుకోవడం వల్ల మనకు మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ఇలా గోరు వెచ్చని నీటిని ఉదయం పూట తాగడం అందరికీ అలవాటుగా మారుతుందని కూడా చెప్పవచ్చు. ఉదయం పూట నీటిని తాగడం వల్ల అజీర్తి సమస్య తగ్గుతుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఉదయం పూట ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల నిజంగానే అజీర్ణ సమస్య తగ్గుతుందా.. ఇలా నీటిని తీసుకోవడం వల్ల శరీరానికి మేలు కలుగుతుందా.. ఇది అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందా.. దీని గురించి వైద్యులు ఏమంటున్నారో.. తెలుసుకుందాం.
ఉదయం పూట ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణక్రియకు సహజ ఉద్దీపనగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఉదయం పూట గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల ఆహారం సమర్థవంతంగా విచ్చినం అవుతుంది. గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల పేగులకు రక్తప్రవాహం పెరుగుతుంది. జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. కనుక ఉదయం పూట గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థకు ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు తెలియజేస్తున్నారు. అయితే మనం నీటిని తీసుకునే ఉష్ణోగ్రత, సమయం కూడా వీటిపై ఆధారపడి ఉంటాయని వారు చెబుతున్నారు. 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగిన నీటిని పొట్ట చలనశీలత కోసం తీసుకోవడం మంచిది. 50 నుండి 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగిన నీటిని గ్యాస్, ఉబ్బరం, అజీర్తి వంటి లక్షణాలను తగ్గించడానికి తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. కనుక ఉదయం తాగే నీరు 50 డిగ్రీల నుండి 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మధ్య ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇక ఉదయం పూట గోరు వెచ్చని నీటిని తీసుకోవడం వల్ల మనం తీసుకునే అల్పాహారం మరింత సమర్థవంతంగా విచ్చినం అవుతుంది. ఆమ్లత్వం తగ్గుతుంది. ఖాళీ కడుపుతో నీటిని తాగడం వల్ల ప్రేగు కదలికలు ఎక్కువగా ఉంటాయి. దీంతో మలబద్దకం సమస్య తగ్గుతుంది. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మూత్రపిండాలు వ్యర్థాలను సమర్థవంతంగా బయటకు పంపిస్తాయి. శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. అంతేకాకుండా వేడి నీటిని తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అవయవాలకు ఆక్సిజన్ మరింత సమర్థవంతంగా అందుతుంది. వేడి నీటిని తాగడం వల్ల మనం సులభంగా బరువు కూడా తగ్గవచ్చు. ఉదయం పూట గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలో జీవక్రియల వేగం పెరుగుతుంది. నిల్వ ఉన్న కొవ్వు వేగంగా కరుగుతుంది. క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. తద్వారా మనం వేగంగా బరువు తగ్గవచ్చు.
ఉదయం పూట వేడి నీటిని తాగడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. మనం తాగే నీరు 60 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి లేకుండా చూసుకోవాలి. ఎక్కువ వేడి ఉన్న నీటిని తాగడం వల్ల నాలుక సున్నితమైన పొర దెబ్బతింటుంది. దంతాలపైఉండే ఎనామిల్ కాలక్రమేణా బలహీనపడుతుంది. వేడి నీరు కొందరిలో యాసిడ్ రిఫ్లెక్స్ ను పెంచుతుంది. అంతేకాకుండా వేడి నీటిని తాగడం వల్ల గొంతు చికాకు, బొంగురు గొంతు, గొంతు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఖాళీ కడుపుతో తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తాగడం వల్ల రక్తంలో సోడియం స్థాయిలు పలుచగా అవుతాయి. దీంతో వికారం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఉదయం పూట గోరు వెచ్చని నీరు తాగడం వల్ల శరీరానికి, జీర్ణ వ్యవస్థకు మంచిదే అయినప్పటికీ నీటిని తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలను కూడా దృష్టిలో ఉంచుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.