MPDO | మునిపల్లి, అక్టోబర్ 14: సాధారణంగా ప్ర భుత్వ పథకాలు ఎవరికి దక్కాలి? ఆయా వర్గా ల్లో అర్హులకు అందాలి!. కానీ, ఈ ప్రభుత్వం లో అందంతా తూచ్..! మీరు కాంగ్రెస్ నాయకులో, కార్యకర్తనో అయ్యుంటేనే వర్తిస్తాయ్! ఇందుకు సంగారెడ్డి జిల్లా మునిపల్లి ఎంపీడీవో నే సాక్ష్యం మరి! ఎందుకంటే ఇది స్వయంగా చెప్పింది సాక్షాత్తూ ఆయనే కాబట్టి! ఓ సాధారణ వ్యక్తి తనకు ఎస్సీ కార్పొరేషన్ లోన్ కోసం సంతకం కావాలని ఎంపీడీవోను ఫోన్ చేసి కో రితే ఆయన ససేమిరా అన్నాడు. పైగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అయ్యుంటేనే.. లేదా కాంగ్రెస్ నాయకులు వచ్చి చెప్తేనే సంతకం చేస్తానని కుండబద్దలు కొట్టాడు. ఇక్కడ విస్తుపోవడం ఆ సామాన్యుడి వంతయింది.
సంతకం పెట్టి నేను ఇబ్బంది పడ..
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో ఓ సామన్య వ్యక్తి మునిపల్లి ఎంపీడీవోకు ఫోన్‌చేసి ‘సార్ నమస్కారం.. నాకు ఎస్సీ కార్పొరేషన్ లోన్ కోసం సంతకం కావాలి సార్’ అని ఎంపీడీవో హరినందన్రావుకు కాల్ చేశాడు. దీనికి ఎంపీడీవో బదులిస్తూ ‘నేను సంతకం పెట్టను.. సంతకం పెట్టి ఇబ్బందులు పడను.. కాంగ్రెస్సోళ్లు చెప్తే సంతకం పెడుతా లేదంటే పెట్ట’ అని కరాఖండిగా చెప్పేశాడు.
కాంగ్రెస్సోళ్లకే ఇవ్వాలన్నారట!
‘మునిపల్లి మండలానికి వచ్చిన ఎస్సీ కార్పొరేషన్ యూనిట్లను కేవలం మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇవ్వాలని మాకు ఆదేశాలున్నయ్. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేం కాంగ్రెస్ నాయకులకే దరఖాస్తు ఫారాలు ఇస్తున్నం. మండలంలో ఎలాంటి నోటిఫికేషన్లు వేయకుండా సీక్రెట్‌గా దరఖాస్తులు తీసుకోమన్నారు. మండలంలో ఎలాంటి నోటిఫికేషన్లు వేయలేదు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు కాకుండా ఇతరులకు లోన్లు ఇవ్వాలంటే మునిపల్లి ఎంపీడీవో కార్యాలయానికి కాంగ్రెస్ నాయకులు వచ్చి వీళ్లు మా వాళ్లే వీళ్లకు లోన్ ఇవ్వండి అంటే అప్పుడు సంతకం పెడ్తా’ అని ఎంపీడీవో హరినందన్‌రావు ఫోన్లో మాట్లాడిన ఆడియో క్లిప్పులు మునిపల్లి మండలంలో వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
గుట్టుచప్పుడు కాకుండా 23మందికి దరఖాస్తులు
మునిపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎలాంటి పేపర్ స్టేట్మెంట్లు లేకుండా 15 రోజులుగా ఎస్సీ కార్పొరేషన్ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారుల నిర్లక్ష్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తు ఫారాలు సైతం కేవలం కాంగ్రెస్ నాయకులకే అందిస్తున్నారు. ఇతరులెవరు వెళ్లినా దరఖాస్తులు లేవని తిప్పి పంపిస్తున్నారు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఎస్సీ కార్పొరేషన్ దరఖాస్తులు స్వీకరిస్తున్న మునిపల్లి ఎంపీడీవో హరినందన్రావుపై చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు. ఇప్పటికే గుట్టుచప్పుడు కాకుండా 23 దరఖాస్తులను స్వీకరించినట్టు తెలిసింది.