హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులకు ప్రభుత్వం గాలం వేసింది. వారి ఓట్లను రాబట్టుకునేందుకు యూసఫ్‌గూడ మొదటి బెటాలియన్ సిబ్బందికి శనివారం రాత్రికి రాత్రే రూ.23.5 కోట్ల టీఏ, డీఏ బకాయిలు విడుదల చేసింది. ఈ విషయం ఆదివారం రాత్రి వరకూ రహస్యంగానే ఉన్నప్పటికీ టీఏలు, డీఏలు, కొన్ని సరెండర్స్ జమ అయినట్లు మిగిలిన బెటాలియన్స్కు తెలియడంతో మండిపడుతున్నారు. ఎన్నికలు ఉన్నచోటే బకాయిలు విడుదల చేస్తే మిగిలిన పోలీసుల బతుకులు ఏం కావాలి? ఎలా బతకాలి?’ అని నిలదీస్తున్నారు. వెంటనే తమ బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
యూసఫ్‌గూడ బెటాలియన్‌కు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో మొత్తం బకాయిల లెక్కలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలోని అన్ని బెటాలియన్ల సిబ్బందికి కలిపి మొత్తం రూ.1,000 కోట్లకుపైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది. ఒక్క యూసఫ్‌గూడ బెటాలియన్ సిబ్బందికే సుమారు రూ.100 కోట్ల వరకూ డీఏ, టీఏ, సరెండర్స్ పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం అందులో రూ.23.5 కోట్లు మాత్రమే విడుదల చేయడం, అది కూడా జూబ్లీహిల్స్‌లో ఓటర్లుగా పోలీసులకే విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. యూసఫ్‌గూడ బెటాలియన్‌లో డ్యూటీ చేస్తూ జూబ్లీహిల్స్‌లో ఓటర్లుగా లేనివారికి పెండింగ్ బకాయిలు జమ కాకపోవడంతో ఆ బెటాలియన్‌లోనే విభేదాలు తలెత్తాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ టీఏలు, డీఏలు ఆగిపోయాయని పోలీసులు వాపోతున్నారు. ఇప్పటివరకు 25 టీఏలు, 5 సరెండర్లతోపాటు ప్రతినెలా చెల్లించాల్సిన రూ.1,000 డీఏ బకాయిలు రెండున్నరేండ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని వాపోతున్నారు. కానిస్టేబుల్ స్థాయి సిబ్బందికే ప్రభుత్వం కనీసంగా రూ.3 లక్షల చొప్పున బాకీ పడిందని, ఎస్ఐ, సీఐ, డీఎస్పీ ఇతర ఉన్నతాధికారులకు రావల్సిన బకాయిలు కూడా కలిపితే మొత్తం రూ.1,000 కోట్లకుపైగానే ఉంటాయని చెప్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రూమ్‌లు అద్దెకు తీసుకుని విధులు నిర్వర్తిస్తున్న తమకు ప్రభుత్వం ఇస్తున్న వేతనం సరిపోవడం లేదని, వచ్చే రూ.50 వేల వేతనంలో రూ.14 వేలు రూము రెంట్‌కే చెల్లించాల్సి వస్తుండటంతో పిల్లల చదువులు, కుటుంబ ఖర్చుల కోసం క్రెడిట్‌కార్డులు వాడాల్సి వస్తున్నదని వాపోతున్నారు.