న్యూఢిల్లీ, మార్చి 27 : పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 చొప్పున కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ప్రపంచ చమురు ధరలు పెరిగిన కారణంగా రిటైల్ ధరల పెంపును నివారించడానికి ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. పెట్రోల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.13 నుంచి రూ. 10కి, డీజిల్‌పై రూ.10 నుంచి సున్నాకు తగ్గించడం వల్ల రిటైల్ పంపు ధరల్లో ఎటువంటి మార్పులు ఉండవు. ఇంధన నష్టాలతో ఈ తగ్గింపు సర్దుబాటు కానున్నది. దీంతోపాటు డీజిల్‌పై లీటరుకు రూ. 21.50 చొప్పున, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్‌పై లీటరుకు రూ.29.50 చొప్పున ఎగుమతి సుంకాన్ని ప్రభుత్వం విధించింది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత రిఫైనర్లకు కలిగే అనూహ్య లాభాలను అరికట్టేందుకు 2022 జూలైలో తొలిసారిగా ప్రవేశపెట్టి ఆ తర్వాత 2024 డిసెంబర్లో ఉపసంహరించుకున్న సుంకాన్ని ప్రభుత్వం పునరుద్ధరించింది. అయితే ఓఎన్జీసీ వంటి సంస్థలు దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై ప్రభుత్వం భారీ పన్నులేవీ విధించలేదు. అయితే ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో సామాన్య ప్రజలకు ప్రత్యక్షంగా ఒరిగేదేమీ ఉండదు. రిటైల్ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. అయితే ఇంధన ధరల భారాన్ని చమురు కంపెనీలు ప్రజలపైకి బదిలీ చేయకుండా ఈ నిర్ణయం కొంత ఉపశమనం కల్పిస్తుందని పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను 15 రోజులకొకసారి సమీక్షించనున్నట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ చైర్మన్ వివేక్ చతుర్వేది వెల్లడించారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇంధన సరఫరాలో అంతరాయం, ముడి చమురు ధరలు పెరుగడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. వీటిని పూడ్చడానికే ఎక్సైజ్ సుంకం తగ్గించినట్టు తెలిపారు. దీని వల్ల వినియోగదారులకు నేరుగా ప్రయోజనం దక్కకపోయినప్పటికీ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఊరట లభిస్తుందని పేర్కొన్నారు.