హైదరాబాద్, జనవరి 1(నమస్తే తెలంగాణ) : వానకాలంలో రైతులు పండించిన ధాన్యంలో సగం కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. కనీసం ప్రభుత్వం నిర్దేశించుకున్న కొనుగోళ్ల లక్ష్యాన్ని కూడా చేరుకోలేదు. ఈ వానకాలంలో 148.01 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే, ప్రభుత్వం ఇప్పటివరకు 67 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. మొత్తం ఉత్పత్తిలో 45.27% పంటను కొనుగోలు చేసిన సర్కార్.. మిగిలిన 54.72% పంటను రైతుల కర్మానికి వదిలేసింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అయిందని, ధాన్యం కొనుగోళ్లలోనూ రికార్డు సాధిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్తూ వచ్చారు. వానకాలంలో రూ.22-23 వేల కోట్లు వెచ్చించి 80 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, అవసరమైతే దీన్ని 90 లక్షల టన్నులకు కూడా పెంచుతామని ప్రకటించారు. కానీ, ప్రభుత్వం రూ.16 వేల కోట్లు వెచ్చించి, 67 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది.
ప్రస్తుతం కొనుగోలు చేసిన 67 లక్షల టన్నులే రికార్డు కొనుగోళ్లు అని ప్రభుత్వం చెప్తున్నది. కానీ, బీఆర్ఎస్ హయాంలో ఇంతకుమించి కొనుగోళ్లు జరిగాయి. 2021-22లో అప్పటి ప్రభుత్వం 70.26 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2022-23 వానకాలంలోనూ 65.01 లక్షల టన్నులు కొనుగోలు చేసింది. ఇదిలాఉంటే ఈ ఏడాది వానకాలంలో 148.03 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి, రికార్డు సృష్టించినట్టు ప్రభుత్వం ప్రకటించుకున్నది. కానీ, 2023-24లో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు 145.43 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. అంటే ఈ సీజన్లో అధికంగా ఉత్పత్తి అయింది 2.6 లక్షల టన్నులే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది 2015-16లో రాష్ట్రంలో రెండు సీజన్లలో కలిపి ధాన్యం ఉత్పత్తి 45.71 లక్షల టన్నులు మాత్రమే ఉండగా, ఎనిమిదేండ్లలో ఒక్క సీజన్లోనే ధాన్యం ఉత్పత్తి 145.43 లక్షలకు పెరిగింది. దాదాపు కోటి టన్నుల ధాన్యం ఉత్పత్తి పెరగడం గమనార్హం.
ఎన్నికల సమయంలో క్వింటాల్ ధాన్యానికి రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. తీరా అధికారంలోకి వచ్చాక సన్న ధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుతం వానకాలంలో 35 లక్షల టన్నుల సన్న ధాన్యం కొనుగోలు చేసింది. రైతులకు టన్నుకు రూ.5వేల చొప్పున రూ.1,750 కోట్లు బోనస్ చెల్లించాలి. ఇప్పటివరకు రూ.950 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇంకా రూ.800 కోట్లు బకాయి పెట్టింది. ధాన్యం కొనుగోలు చేసి నెల, 2 నెలలు గడుస్తున్నా రైతులకు బోనస్ బకాయి లు అందడంలేదు. గత యాసంగి బోనస్ బ కాయిలను కూడా చెల్లించలేదు. గత యాసంగికి సంబంధించిన బోనస్ బకాయిలు రూ.1,159 కోట్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో యాసంగి బకాయిలు చెల్లిస్తుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
