Food Poison | హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వం బాధ్యత మరచి అసత్య ప్రచారానికి తెరలేపింది. విద్యార్థులపైనే విషప్రచారానికి దిగింది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాల్సిన ప్రభుత్వం ఇటీవలి పరిణామాలకు విద్యార్థులే కారణం అని నింద వేసేందుకు వెనుకాడలేదు. గురుకుల అస్వస్థతకు విద్యార్థులే కారణమని తేల్చేసింది. మహబూబ్నగర్ జిల్లా మాగనూరు హాస్టల్లో అస్వస్థత ఘటనకు విద్యార్థులు బయట చిరుతిళ్లు తినటమే కారణమని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తేల్చేశారు. మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చి అస్వస్థతకు విద్యార్థులు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే ‘కుర్కురేలు తినటం వల్లే ఇదంతా జరుగుతున్నది’ అని న్యాయస్థానంలో ప్రభుత్వం వాదన వినిపించింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై విపక్షాలు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ప్రభుత్వంపై ప్రశ్నలు ఎక్కుపెడుతున్నాయి. విద్యార్థులు చిరుతిళ్లు, కుర్కురేలు తింటుంటే వార్డెన్లు, ప్రిన్సిపాళ్లు ఏం చేస్తున్నారు? పదేండ్లలో ఎప్పుడూలేంది చిరుతిళ్లు ఇప్పుడే తింటున్నారా? హాస్టళ్లల్లో ఉండే పిల్లలే తింటున్నరా? ఇతర పిల్లలు తినడం లేదా? హాస్టళ్లలో లేని విద్యార్థులు చిరుతిళ్లు తింటే ఏమీ కాకుండా హాస్టల్ విద్యార్థులే ఎందుకు అస్వస్థతకు గురవుతున్నారు? రోజుకో చోట పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు ఎందుకు గురవుతున్నారు? అని విపక్ష, విద్యార్థి, ఉపాధ్యాయ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఏది జరిగినా బీఆర్ఎస్ కారణమని, బాధ్యత బీఆర్ఎస్దే అంటూ తప్పును కప్పిపుచ్చుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న సర్కార్ ఉన్నఫలంగా విద్యార్థులపై ఇప్పుడు విషప్రచారానికి తెరతీయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి చిరుతిళ్ల దారుణాలా?
రాష్ట్రవ్యాప్తంగా ఏడాదిగా హాస్టళ్లల్లో జరిగిన 38 సార్లు ఫుడ్ పాయిజన్ ఘటనల్లో 886 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంకిడిలో విషాహారం తిని శైలజ అనే విద్యార్థిని చనిపోయింది. ఈ ఘటన మరవకముందే మహబూబ్నగర్ జిల్లాలో ఫుడ్ పాయిజన్ జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హాస్టళ్లలో వివిధ కారణాలతో 48 మంది విద్యార్థులు మరణించారు. దుర్భరమైన ఒత్తిడి పరిస్థితులను తట్టుకోలేక 23 మంది విద్యార్థులు బలవన్మరాలకు పాల్పడ్డారు. 8 మంది అనుమానాస్పదంగా మృతి చెందారు. కలుషితాహారం తిని నలుగురు చనిపోయారు. మరో 13 మంది ఆనారోగ్యంతో మృత్యువాతపడ్డారు. ఇవన్నీ జరగటానికి విద్యార్థుల చిరుతిళ్లు, కురుకురేలే కారణమా? అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నది.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి నింద విద్యార్థులపైనా?
విద్యాలయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలకు విద్యార్థులే కారణమనే రీతిలో సర్కార్ వ్యవహరించటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం తన నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఏం చేయాలో తోచక విద్యార్థులపై నెపం నెడుతున్నది. హాస్టళ్లలో విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వం పర్యవేక్షణ మరచి వారిపై విషప్రచారానికి వెనుకాడని తీరుపై సమాజం భగ్గుమంటున్నది. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ఎప్పటికప్పుడు హాస్టల్ స్థితిగతులను పర్యవేక్షించి బాధ్యతను ప్రభుత్వం గాలికి వదిలేయటం వల్లే పరిస్థితులు ఇలా మారాయనే ఆరోపణలకు బలం చేకూరుతున్నది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యాసంవత్సరం ప్రారంభంనుంచి మంత్రులు సమీక్షలు జరిపేవారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు జిల్లాల వారీగా పర్యటనలు చేసినప్పుడు హాస్టళ్లను తనిఖీ చేసేవారు. తక్షణ చర్యలపై అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చేవారు. ఫలితంగా అందరూ అప్రమత్తంగా ఉండేవారు. పదేండ్లపాటు విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకోవటం వల్ల మంచి ఫలితాలు వచ్చి గురుకులాలపై క్రేజ్ పెరిగింది. కానీ ఏడాది కాలంలోనే పరిస్థితులు తలకిందులయ్యాయి.