హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అందాల్సిన ఐదు పెండింగ్ డీఏ (కరువు భత్యం)ల్లో ఒక డీఏను ప్రభుత్వం విడుదలచేసింది. ఈ మేర కు ఉద్యోగులు, పెన్షనర్లకు ఒక డీఏ 3.64% మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. బేసిక్ పేపై ప్రస్తుతం ఉన్న డీఏను 26.39% నుంచి 30.03 శాతానికి పెంచుతూ ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీ ప్‌కుమార్ సుల్తానియా శుక్రవారం జీవో-78, జీవో-79 జారీచేశారు. పెరిగిన డీఏ 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నూతన డీఏతో కూడిన వేతనాన్ని ఉద్యోగులు 2025 జూలై 1న అందుకుంటారు. అంటే జూన్ వేతనంలో నూతన డీఏ కలుస్తుంది. ఇక 1 జనవరి 2023 నుంచి మే 2025 వరకు గల డీఏ ఎరియర్స్‌ను మొత్తం 28 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని సర్కారు స్పష్టంచేసింది. 2023 జూలై 1కి సంబంధించిన డీఏ ఉత్తర్వులను ఆరు నెలల తర్వాత ప్రత్యేకంగా విడుదల చేస్తామని పేర్కొన్నది. ఇటీవల క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాల మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
రెండ్రోజుల్లో 153 స్కూల్ బస్సుల సీజ్
హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు 198 కేసులు బుక్ చేసి, 153 బస్సులను సీజ్ చేసినట్టు రవాణాశాఖ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్(జేటీసీ) ఎం చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్‌లో అత్యధికంగా 42 కేసులు నమోదు చేసి 33 బస్సులు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో 42 కేసులు నమోదు చేసి 43 బస్సులను సీజ్ చేశామని తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 21 కేసులు నమోదు చేసి 18 బస్సులను సీజ్ చేసినట్టు వెల్లడించారు. బస్సుల ఫిట్‌నెట్ విషయంలో స్కూళ్ల యాజమాన్యాలు నిర్లక్ష్యం చేయొద్దని, తక్షణం ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించారు. లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.