హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : టీ హబ్.. ఈ పేరు ప్రపంచం మొత్తం తెలుసు. హైదరాబాద్‌లోని అంకుర కేంద్రంగా అంతర్జాతీయంగా పేరుగాంచింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఆలోచనల నుంచి ఆవిర్భవించిన అద్భుత కేంద్రం. దివంగత రతన్ టాటా చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది. ఎన్నో స్టార్టప్‌లు ఇక్కడ పురుడుపోసుకున్నాయి. ఔత్సాహిక వ్యాపారవేత్తలు తమ కలలను సాకారం చేసుకున్నారు. వందల మంది సాకారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ఫండింగ్ ఏజెన్సీలు టీహబ్‌లో జరిగే పరిణామాలను ఆసక్తిగా గమనిస్తుంటాయి. వినూత్న ఆలోచనలతో వచ్చినవారికి అండగా నిలుస్తుంటాయి. అలాంటి గ్లోబల్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టింది. టీ హబ్ లక్ష్యాన్నీ నీరుగార్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. దేశంలోనే ఆధునాతన ఇంక్యుబేటర్‌గా, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్‌గా నిలిచిన కేంద్రాన్ని కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వ ఆఫీస్‌గా వినియోగించనున్నది. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేసే ఆలోచనలతో అంతర్జాతీయంగా పరువును మంటగలిపేందుకు సిద్ధమైంది.
అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, విభాగాలను, ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బేగంపేటలో ఉండే కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయాన్ని, శేరిలింగంపల్లి, గండిపేట్, రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాలను టీ హబ్‌లోకి తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది. టీ హబ్‌లో ఎంతో విలువైన 60వేల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను ఈ ప్రభుత్వ కార్యాకలాపాలకు వినియోగించనున్నారు. అంటే ఆవిష్కరణలు పురుడుపోసుకోవాల్సిన చోట ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. స్టార్టప్‌లకు కేటాయించాల్సిన ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసి ఐటీ హబ్‌ను కాస్తా పబ్లిక్ ప్లేస్‌గా మార్చనుంది. ఇది అనాలోచిత నిర్ణయమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తే టీ హబ్ వాతావరణమే మారిపోతుందని, సాధారణ ప్రజలు వచ్చి వెళ్లిపోయే పబ్లిక్ ప్లేస్‌గా మారుతుందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐటీ కేంద్రంగా, స్టార్టప్ ఇంక్యుబేటర్‌గా కొనసాగడం కష్టమని చెప్తున్నారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే అంతర్జాతీయంగా పరువు పోవడమేకాకుండా చేజేతులా ఎకోసిస్టమ్‌ను చెడగొట్టినట్టు అవుతుందని హెచ్చరిస్తున్నారు.