బాన్సువాడ, జూలై 13: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టి మరల్చడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల పేరిట ఆర్డినెన్స్ తెచ్చి, సరికొత్త డ్రామాకు తెరతీసిందని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. ఆదివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.2 లక్షల రుణమాఫీ, వడ్లకు బోనస్ ఏమైందని నిలదీశారు. ఒకసారి ఇచ్చి చేతులు దులుపుకొన్నారని మండిపడ్డారు. రైతులకు బీమా సౌకర్యం కూడా కల్పించడం లేదని విమర్శించారు.
పింఛన్ రూ. 4వేలకు పెంపు, ఆడబిడ్డలకు స్కూటీలు, మహిళలకు రూ.2,500 హామీలు ఎటుపోయాయని ప్రశ్నించారు. వీటన్నింటినీ ప్రజలు మర్చిపోవాలనే.. బీసీ రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ బిల్లు విషయంలో కేంద్రం వద్దకు అఖిలపక్ష కమిటీని తీసుకువెళ్తానని, ప్రధానమంత్రిని కలుద్దామని చెప్పిన రేవంత్‌రెడ్డి.. ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. నిజంగా బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రఘునందన్‌రావుతో కలిసి ప్రధాని వద్దకు వెళ్లి పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదం పొందేలా ప్రయత్నించాలని చెప్పారు.