Telangana | హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం గాడితప్పింది. నిరుడు 2024-25 వార్షిక సంవత్సరంలో రూ.90 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 29,434 చెరువుల్లో సుమారు 90 కోట్ల చేపపిల్లలను వదలాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ, సర్కారు 30 కోట్ల పిల్లలను మాత్రమే పంపిణీ చేసింది. 2025-26లో 90 కోట్ల చేపపిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేయాలని నిర్ణయించిన మత్స్య శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి పంపేందుకు సమాయత్తమయ్యారు.
సాధారణంగా జూన్ మొదటి వారం నాటికి చేప పిల్లల పంపిణీకి సంబంధించి టెండర్ల ప్రక్రియను పూర్తిచేయాలి. కానీ, నిరుడు చేపపిల్లల సరఫరాకు సంబంధించి బిల్లులను సకాలంలో చెల్లించకపోవడంతో మూడు సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకురాలేదు. ఆలస్యంగా మేల్కొన్న మత్స్యశాఖ అధికారులు పుణ్యకాలం గడిచాక కాంట్రాక్టర్లను ఒప్పించారు. దీంతో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు నిండినా.. చేప పిల్లల పంపిణీ సకాలంలో జరగలేదు. దీంతో డిసెంబర్ చివరి వరకు చేప పిల్లల సరఫరా ప్రక్రియ కొనసాగింది.
దానికితోడు చాలాచోట్ల చేప పిల్లలు నాణ్యత బాగాలేదని తిరస్కరించారు. ఫలితంగా పూర్తిస్థాయిలో పంపిణీ జరగలేదు. దీంతో 90 కోట్ల చేపపిల్లలకు గాను 29.26 కోట్ల పిల్లలను మాత్రమే పంపిణీ చేశారు. గతానుభవాల నుంచి పాఠాలు నేర్చుకోని మత్స్య శాఖ మళ్లీ పాత పద్ధతిలోనే ఈ ఏడాది 90 కోట్ల చేపపిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేయాలని ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే పాత బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో మళ్లీ ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
Table