హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : పెట్టుబడుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అంకెల గారడీకి తెరలేపింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో (Global Summit) రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువెత్తినట్టు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. అవి ఎంతవరకు వాస్తవరూపం దాల్చుతాయోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. గత రెండేండ్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘పెట్టుబడుల’ పాట పాడుతూనే ఉన్నారు. రూ.లక్షల కోట్లు అంటూ అంకెలు వల్లెవేస్తున్నారు. అధికారంలోకి వచ్చీరావడంతోనే ఎడాపెడా విదేశీ పర్యటనలు చేశారు. వరుసగా దావోస్ సదస్సులకు హాజరయ్యారు. కనీవినీ ఎరుగని స్థాయిలో పెట్టుబడులు సాధించామని ఊదరగొట్టారు. ఇందులో కనీసం పదిశాతం పెట్టుబడులు కూడా కార్యరూపం దాల్చడంలేదని గణాంకాలు చెప్తున్నాయి. తాజా గ్లోబల్ సమ్మిట్ సహా రెండేండ్లలో రూ.8 లక్షల కోట్లకుపైగా పెట్టుబడి ఒప్పందాలు జరిగినట్టు ప్రభుత్వం చెప్తున్నది. కానీ టీజీఐఐసీ ద్వారా అనుమతులు పొందిన కంపెనీల పెట్టుబడి విలువ రూ.18,600 కోట్లు మాత్రమే ఉన్నది. అంతేకాదు, రెండేండ్లలో 2,965 కంపెనీలకు అనుమతులు జారీచేయగా వాటిలో 90శాతం మైక్రో లెవల్ పరిశ్రమలే కావడం గమనార్హం.
ఒప్పందాలు కాగితాలకే పరిమితం
యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం, పన్నుల రూపంలో ఆదాయాన్ని పెంచుకునే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడుల కోసం కృషి చేస్తుంటాయి. ఈ క్రమంలో అనేక రకాల ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు కల్పించి పరిశ్రమలను ఆకర్షిస్తుంటాయి. ఆసక్తి ఉన్న కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుగా అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) చేసుకుంటాయి. ఈ ఒప్పందాలు కాగితాలు దాటి కార్యరూపం దాల్చినప్పుడే ప్రభుత్వ కృషి సార్థకమైనట్టు భావించాల్సి ఉంటుంది. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రచార ఆర్భాటమే తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని పరిశ్రమ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం చెప్తున్న పెట్టుబడి లెక్కలను, ఏర్పాటవుతున్న పరిశ్రమలను పరిశీలిస్తే ఇది వందశాతం నిజమని చెప్పక తప్పదు.
ఎందుకంటే.. గత రెండు దఫాలుగా దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుల్లో జరిగిన ఒప్పందాల్లో ఇంతవరకు ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. దీన్ని బట్టే కంపెనీల గ్రౌండింగ్ ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. రెండుసార్లు దావోస్ పర్యటనలు, సింగపూర్, అమెరికా, జపాన్ పర్యటనలతోపాటు తాజాగా గ్లోబల్ సమ్మిట్ పేరుతో నిర్వహించిన సదస్సు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ కంపెనీలతో రూ.8.10 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ప్రకటించింది. గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా మొత్తం రూ. 5.75 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగినట్టు ప్రభుత్వం చెప్తున్నది. వీటిని మినహాయించినా రెండేండ్లలో రూ.2,35,194 కోట్ల ఒప్పందాలు జరిగాయి. ఇందులో ఇప్పటివరకు వాస్తవరూపం దాల్చిన ఒప్పందాలు రూ.18,600 కోట్లు మాత్రమే. అంటే కనీసం పది శాతం కూడా ఒప్పందాలు గ్రౌండింగ్ కాలేదు. పాత పెట్టుబడుల పరిస్థితే ఇలా ఉంటే గ్లోబల్ సమ్మిట్ ఒప్పందాల భవిష్యత్తు ఏమిటోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖం చాటేస్తున్న పెట్టుబడిదారులు
ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలకు సంబంధించి.. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం టీజీఐఐసీ అధికారులు సదరు కంపెనీని సంప్రదించి వారినుంచి పరిశ్రమకు సంబంధించిన ప్రతిపాదనలు తీసుకుంటారు. కొన్ని స్థలాలను చూపిస్తారు. పెట్టుబడిదారులు ముందుగా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి స్థలాలు ఎంపికచేసుకుంటారు. ఆ తర్వాత పరిశ్రమ ఏర్పాటుకు అనుమతులు, రాయితీల కోసం దరఖాస్తు చేసుకుంటారు. అన్నీ సవ్యంగా ఉంటే అనుమతుల మంజూరుతోపాటు భూ కేటాయింపులుంటాయి. రెండేండ్లుగా ఒప్పందాల తర్వాత ఈ ప్రక్రియేదీ జరగడంలేదు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల వివరాలు తమకు రావడంలేదని టీజీఐఐసీ అధికారులు చెప్తున్నారు. ‘ఒప్పందాలు చేసుకున్న కంపెనీలను మేము ఫాలోఅప్ చేస్తున్నాం. వారు వస్తాం.. డీపీఆర్లు ఇస్తాం అని చెప్తున్నారు కానీ రావడంలేదు. మేము వారిని బలవంతం చేయలేం కాదా?’ అని ఓ అధికారి తెలిపారు. దీన్నిబట్టి పెట్టుబడిదారులు ముఖం చాటేస్తున్నారని అర్థమవుతున్నది. గతంలో ఒప్పందం కుదుర్చుకున్న ఉర్సా క్లస్టర్స్ కంపెనీకి కనీసం చిరునామా కూడా లేదనే ఆరోపణలు వెల్లువెత్తగా, మారుబేనీ ఇండియా కంపెనీపై పలు దేశాల్లో కేసులు నమోదైనట్లు తేలింది.
బీఆర్ఎస్ హయాంలో గ్రౌండింగ్
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాల్లో అత్యధిక శాతం పేపర్లను దాటి గ్రౌండింగ్ వరకు వెళ్లాయి. పరిశ్రమలకు సింగిల్ విండో విధానంలో అనుమతులు జారీ చేసే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీజీ ఐపాస్) పేరుతో సరికొత్త చట్టాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆన్లైన్ ద్వారా ఒకే దరఖాస్తుతో నిర్ణీత గడువులోగా అన్ని రకాల అనుమతులు మంజూరవడమే దీని ప్రత్యేకత. 2014-15 నుంచి ఇప్పటివరకు 28,078 పరిశ్రమలకు అనుమతులు మంజూరు కాగా, వాటిలో 25,361 తయారీ, 2,717 పరిశ్రమలు సేవారంగానికి చెందినవి ఉన్నాయి. రూ.3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు రాగా, 19 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. రెండేండ్లలో వచ్చిన 18,600 కోట్ల పెట్టుబడులు మినహాయిస్తే, మిగిలినవన్నీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చినవే కావడం విశేషం.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల విలువ (రూ. కోట్లలో)