Government Land | బంజారాహిల్స్, డిసెంబర్ 22: ‘రాజధాని నడిబొడ్డున బిగ్ స్కెచ్’ పేరుతో ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనం హైదరాబాద్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 ప్రధాన రహదారిపై సుమారు 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు ప్రైవేటు వ్యక్తులు చేస్తున్న ప్రయత్నాలపై నమస్తే తెలంగాణ దినపత్రిక వరుస కథనాలు ప్రచురించడంతో ప్రభుత్వం నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. ఈ సంగతి చూడాలంటూ స్థానిక రెవెన్యూ అధికారులకు బాధ్యత అప్పగించారు. రంగంలోకి దిగిన షేక్‌పేట తహసీల్దార్ అనితారెడ్డి ఆదివారం మరో వివరణ ఇచ్చారు.
షేక్‌పేట మండలం సర్వే నంబర్ 403/పీలో టీఎస్ నంబర్ 1/పార్ట్ బ్లాక్-హెచ్, వార్డు 10లో ఉన్న స్థలం ప్రభుత్వానిదే అని, దీనిలో 2.20 ఎకరాల స్థలాన్ని జలమండలికి కేటాయించామని పేర్కొన్నారు. ఇటీవల శ్రీ రాధికా కో అపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ హైకోర్టులో డబ్ల్యూపీ నంబర్ 26109 ఆఫ్ 2024 పేరుతో, డబ్ల్యూపీ 25951 ఆఫ్ 2024 పేరుతో రిట్ పిటిషన్లు వేశారని, ఈ కేసును విచారించిన హైకోర్టు స్టేటస్ కో మెయింటెన్ చేయాలంటూ ఈ ఏడాది సెప్టెంబర్ 20న తీర్పును ఇచ్చిందని పేర్కొన్నారు. మొత్తం 16 ఎకరాల స్థలం తమ ఆధీనంలో ఉందని, ఈ స్థలం చుట్టూ రేకులు ఉన్నాయని షేక్‌పేట తహసీల్దార్ వివరణ ఇచ్చారు.
నగరం నడిబొడ్డున ఖరీదైన ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైనట్టు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ రెవెన్యూశాఖ ఇస్తున్న వివరణలు మరిన్ని అనుమానాకు తావిస్తున్నాయి. జలమండలి నిర్మించిన ప్రహరీ పక్కనున్న స్థలంలో మూడు నెలల క్రితమే ప్రైవేటు వ్యక్తులు పాగా వేశారని, అంతకు ముందే పార్థసారథి అనే వ్యక్తికి అనుకూలంగా ప్రైవేటు వ్యక్తులు వేసిన కేసులో ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చిన విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ బయటపెట్టినా రెవెన్యూ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని గురించి పట్టించుకోకపోవడం గమనార్హం.
ఈ స్థలం బయటనున్న రేకుల షెడ్లకు 15 రోజుల క్రితం ప్రభుత్వ స్థలమంటూ రెవెన్యూ అధికారులు రాయించడంతోపాటు బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అయితే, వాటిని గంటల వ్యవధిలోనే కబ్జాదారులు తొలగించారు. ఈ విషయం తెలిసినా పాతఫోటోలనే పంపిస్తూ ఇప్పటికీ ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఉన్నాయని నమ్మించే ప్రయత్నాలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిత్యం వేలాదిమంది బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ప్రయాణిస్తుంటారు. వందలాదిమంది బసవతారకం క్యాన్సర్ దవాఖానకు చికిత్స కోసం వస్తుంటారు.
ఈ స్థలం చుట్టూ ప్రైవేటు వ్యక్తులు రేకుల షీట్లు ఏర్పాటు చేసుకున్న విషయాన్ని వారందరూ గమనిస్తున్నారు. ఆ స్థలంలోకి వెళ్లేందుకు రెండు చోట్ల గేట్లను ఏర్పాటు చేసుకుని వాటికి సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేసిన విషయం ఈ రోడ్డు మీద వెళ్లేవారందరూ గమనిస్తునే ఉన్నారు. రాత్రి పగలు అనే తేడాలేకుండా ప్రభుత్వ స్థలంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు తిష్టవేసి కాపలా కాస్తున్నారని, పార్థసారథి అనే వ్యక్తికి చెందిన వాహనాలు, సామగ్రి కూడా లోపలే పెడుతున్నారని స్థానికులు చెబుతున్నా స్థలం తమ ఆధీనంలోనే ఉందంటూ రెవెన్యూ అధికారులు నమ్మించే ప్రయత్నం చేస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
‘నమస్తే తెలంగాణ’ పరిశీలనలో మరిన్ని వాస్తవాలు బయటకు వచ్చాయి. ఈ స్థలంపై సుమారు 10 ఏండ్ల నుంచి కన్నేసిన పార్థసారథి అనే ల్యాండ్ గ్రాబర్‌కు ఓ ప్రజాప్రతినిధి ఇటీవల అండగా నిలబడ్డారని, ఆయన అండతోనే ఉన్నత స్థాయిలో రెవెన్యూ అధికారుల వద్దకు ఈ వ్యవహారాన్ని తీసుకువెళ్లినట్టు తెలిసింది. నాలుగైదు నెలల క్రితమే ఈ స్థలాన్ని ఓ ప్రజాప్రతినిధి తనకు సన్నిహితులైన బిల్డర్లకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయించారని విశ్వసనీయంగా తెలిసింది.
డెవలప్మెంట్ అగ్రిమెంట్ పొందిన సంస్థ పేరుతో ఇప్పటికే భవన నిర్మాణాలకు సంబంధించిన అనుమతుల కోసం జీహెచ్ఎంసీకి సైతం దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. ఇటీవల వ్యవహారం మొత్తం బయటకు రావడంతో రెవెన్యూ అధికారులు ప్లేట్ ఫిరాయించారని, తమ పేర్లు బయటకు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్టు సమాచారం. దాంతో జీహెచ్ఎంసీ అనుమతుల కోసం ఇవ్వాల్సిన ఎన్వోసీ జారీ చేయలేదని తెలిసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ముందుండి నడిపించిన పార్థసారథి మీద గతంలో పలు ప్రాంతాల్లో భూకబ్జా, ఫోర్జరీ కేసులున్నాయనే విషయం తెలియక ఓ ప్రజాప్రతినిధి కూడా ఈ వ్యవహారంలో అడ్డంగా ఇరుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
సుమారు 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఫోర్జరీ పత్రాలతో కాజేసేందుకు ఎన్నో ఏండ్లుగా ప్రయత్నిస్తున్న పార్థసారథి వ్యవహారంలో రెవెన్యూ అధికారులు అత్యంత చాకచక్యంగా వ్యవహరి స్తూ అండగా నిలుస్తున్నారని తెలిసింది. పార్థసారథి అనే వ్యక్తి తనకు 403/52 సర్వే నంబర్లో 5 ఎకరాల స్థలం ఉందని వాదిస్తున్నాడు. 1930 నుంచి ఉన్న లింక్ డాక్యుమెంట్లతో పాటు కొన్ని పత్రాలను ఫోర్జరీ చేయడంతో 2023 లోనే పార్థసారథిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫోర్జరీ కేసు నమోదు కావడంతో అరెస్టయ్యాడు. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ఈ సర్వే నంబర్లో ఉన్న వ్యక్తుల గురించి ఎక్కడా లేదు.
రెవెన్యూ అధికారుల వద్దకు ఎవరైనా వచ్చి 403/52 సర్వే నంబర్ గురించి వాకబు చేస్తే అది ప్రభుత్వ భూమి కాదని చెప్తున్నారు. దీంతో ఇదే విషయాన్ని ఇటీవల రెవె న్యూ అధికారుల వద్ద నుంచి నివేదిక రూపంలో తీసుకున్న పార్థసారథి అండ్ గ్యాంగ్ తనకు రెవెన్యూ క్లియరెన్స్ కూడా వచ్చిందని, తన సర్వే నంబర్లో ఉన్న 5 ఎకరాలు ప్రభుత్వానిది కాదని నమ్మిస్తూ పలువురి నుంచి కోట్ల రూపాయల అడ్వాన్స్‌లు తీసుకున్నట్టు ‘నమస్తే తెలంగాణ’ పరిశీలనలో తేలింది. ఈ మెలికను ఉపయోగించుకుని జీహెచ్ఎంసీలో అనుమతులు తెప్పించేందుకు బిల్డర్‌ను రంగంలోకి దింపినట్టు తెలిసింది. ఈ వ్యవహారాన్ని మరింత లోతుగా విచారించడంతో పాటు స్థలాన్ని స్వాధీనం చేసుకుని పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.