నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్ వర్క్, మే 15 : ‘కొండనాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిపోయినట్టు’గా తయారైంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పరిస్థితి! ‘మీకు ఇల్లు మంజూరైంది. వీలైనంత తొందరగా పాత ఇంటిని కూల్చండి. మేము వచ్చి ముగ్గు పోస్తాం’ అంటూ అధికారులు హడావుడి చేశారు. గత జనవరి 26న రిపబ్లిక్ డే సాక్షిగా పైలట్ గ్రామాల్లో గ్రామసభలు పెట్టి మరీ, లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైందన్న సంతోషంతో అధికారులు చెప్పినట్టుగానే ఆయా లబ్ధిదారులు ప్రస్తుతం తాము ఉంటున్న చిన్నపాటి గుడిసెలను, పాత రేకుల ఇండ్లను కూల్చేసుకున్నారు. తట్టాబుట్టా సర్దుకొని అద్దె ఇండ్లలోకి, బంధువుల ఇండ్లలోకి, కొన్నిచోట్ల పశువుల పాకల్లోకి మారారు. మరికొందరు కొత్త ఇంటి నిర్మాణం కోసం అవసరమైన సామగ్రిని కొనుగోలు చేశారు. కానీ, రోజులు గడిచినా అధికారులు రాలేదు. ముగ్గులు పోయలేదు. చివరకు ‘మీ పేరు జాబితాలో లేదు’ అని ఒకరికి, ‘తాజా జాబితాలో మీ పేరు రాలేదు. మొదటి జాబితా ఇండ్ల నిర్మాణం పూర్తయ్యాక మీ ఇంటికి ముగ్గు పోస్తాం’ అంటూ మరొకరికి, ‘మీ పేరు మూడో జాబితాలో ఉన్నది. దాని నిర్మాణం ఇప్పట్లో కాదు’ అంటూ ఇంకొకరికి సమాధానాలు చెప్పారు అధికారులు. దీంతో తమకంటూ ఒక సొంత గూడు కట్టుకోవచ్చునని ఆశ పడ్డ లబ్ధిదారులకు ఆవేదనే మిగిలింది. ‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఉన్న ఇల్లు కూల్చుకుంటే.. చివరికి నట్టేట ముంచింది..’ అని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇక అనేక వడపోతల అనంతరం అధికారులు వచ్చి ముగ్గు పోసిన తరువాత ఇంటి నిర్మాణం ప్రారంభించిన వారిది మరో వ్యధ.
బేస్మెంట్ లెవల్ పూర్తి చేస్తే రూ.లక్ష, ప్లిల్లర్లు దశ పూర్తయితే మరో రూ.లక్ష& ఇలా దశలవారీగా నిధులు విడుదల చేస్తామని చెప్పిన సర్కారు.. ఇప్పటికీ నయా పైసా ఇవ్వలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వడ్డీలకు అప్పులు తెచ్చి ఇంటి నిర్మాణం మొదలు పెట్టామని, కానీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో వడ్డీల భారం పెరుగుతున్నదని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. సొంతింటి కల నెరవేరడం సంగతేమోకానీ, ప్రభుత్వ నిర్లక్ష్యంతో అప్పులపాలు కావాల్సి వస్తున్నదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా బిల్లులు సకాలంలో మంజూరు చేసి, తమను అప్పులపాలు కాకుండా కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రతి గ్రామంలోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. చివరకు ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనూ ఇలాంటి దృశ్యాలే సాక్షాత్కరిస్తున్నాయి. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గొల్లపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద అధికారులు ఎంపిక చేశారు. ఈ చిన్న గ్రామంలో నిరుపేదలను గుర్తించి 11 ఇండ్లను మంజూరు చేశారు. ఈ ఇండ్లకు మార్కింగ్ కూడా ఇచ్చారు. ప్రభుత్వం ఇల్లు ఇస్తుందన్న ఆశతో లబ్ధిదారులు తాము నివాసం ఉంటున్న చిన్నచిన్న గుడిసెలు, మట్టి మిద్దెలను కూల్చేసుకున్నారు. దాదాపు మూన్నెళ్లు అవుతున్నా ఇంతవరకు అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో వారంతా పరేషాన్లో పడ్డారు.
ఈమె పేరు కావాలి అనూష. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గొల్లపల్లిలో ఉంటున్నది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో ఈమె పేరు వచ్చింది. దీంతో ఆమె తమ కుటుంబం తలదాచుకుంటున్న మట్టి ఇంటిని కూల్చింది. ఇక సొంత ఇల్లు కట్టుకోవచ్చన్న సంతోషంతో సమీపంలోని బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నది. కూలి పనులు చేసుకుంటూ ఆ ఇంటికి అద్దె కడుతున్నది. అయితే, నాలుగు నెలలైనా గ్రామం వైపు అధికారులు రాకపోవడంతో ఆ కుటుంబానికి నిల్వ నీడ లేకుండాపోయింది. చేతిలో ఉన్న పైసలన్నీ ఇంటిని కూల్చడానికే ఖర్చు అయ్యాయని, బేస్మెంట్ కడితేనే బిల్లు ఇస్తామని అధికారులు చెప్తుండటంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబం బాధపడుతున్నది.
మాకు ఇల్ల్లు లేదు. నా భర్త, పిల్లలతో కలిసి చిన్న గుడిసెలో బతుకుతున్నాం. మాకు ఎలాంటి భూమి లేదు. ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా, అధికారులు మంజూరుపత్రం ఇచ్చారు. బేస్మెంట్ వరకు పనులు చేయించాం. ఇప్పుడేమో లిస్టులో మీ పేరు లేదు, మీకు ఇందిరమ్మ ఇంటి పైసలు రావు, గతంలో మీ పేరు మీద ప్రభుత్వం నుంచి ఇల్లుకు పైసలు పొందినారు అని అధికారులు చెప్తున్నారు. కానీ, మేము ప్రభుత్వం నుంచి ఇంటి కోసం ఇప్పటివరకు పైసా బిల్లు పొందలేదు. ఇల్ల్లు, భూమి లేని మాకు ప్రభుత్వం ఇండ్లు ఇచ్చి ఆదుకోవాలి.
ఇందిరమ్మ ఇల్లు మంజూరైందంటూ తొలుత మంజూరుపత్రం ఇచ్చారు. దీంతో ఇల్లు కట్టుకుంటున్నామని అందరికీ చెప్పుకున్నాం. తీరా ఇప్పుడేమో ఆ పత్రాన్ని వెనక్కి తీసుకొని మీకు ఇంకా ఇల్లు మంజూరు కాలేదని చెప్తున్నారు. ఇప్పుడు మేము ఏంచేయాలి? పేదోళ్లకు ఇల్లు ఎందుకు మంజూరు చెయ్యరు? కంచంలో అన్నం పెట్టి గుంజుకున్నరు.
ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని అధికారులు మంజూరుపత్రం ఇచ్చారు. దీంతో పాత ఇంటిని తీసేసి అక్కడే కొత్త ఇల్లు కట్టుకుందామనుకున్నాం. పాత ఇంటి పెంకులు తొలగించాం. ఇంతలో ఇల్లు మంజూరు కాలేదని అధికారులు చెప్పడంతో సగం తీసి ఆపేశాం. ప్రస్తుతం అత్తింట్లో ఉంటున్నాం. ఇల్లు వచ్చిందని ఎంతో సంతోష పడ్డాం. తీరా, రాలేదని చెప్పడంతో నిరాశ చెందాం. మంజూరుపత్రం ఇచ్చి ప్రభుత్వం మోసం చేసింది.
కమలాపూర్, మే15: ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించడంతో లబ్ధిదారుల ఎంపికలో అధికారులు వడపోత మొదలెట్టారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం 24 దేశరాజ్‌పల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. గ్రామంలో మొదట 383 ఇండ్లు మంజూరైనట్టు గ్రామసభలో అధికారులు ప్రకటించారు. ఆ తరువాత 208 మంది లబ్ధిదారులను మాత్రమే అర్హులుగా ప్రకటించారు. అందులోనూ యాప్‌లో 150 ఇండ్లు మాత్రమే కనబడుతున్నాయి. ఇందులో 41 ఇండ్లకు గ్రౌండింగ్ కావడంతో లబ్ధిదారులు సొంత డబ్బులతో పనులు ప్రారంభించారు. లబ్ధిదారుల ఎంపిక జాబితాను కుదించడంతో ఎంపికైన లబ్ధిదారులు సైతం తమకు బిల్లులు వస్తాయో లేదో అనే సందేహంలో కొట్టుమిట్టాడుతున్నారు. 400 చదరపు అడుగుల భూమి ఉండి, రేషన్‌కార్డు, గూనపెంకుటిల్లు, రేకులషెడ్డు, గుడిసెలో నివాసం ఉండేవారిని మాత్రమే అర్హులుగా ఎంపిక చేశారు. నాలుగు చక్రాల వాహనం, ఐదు ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న వ్యక్తులను అనర్హులుగా ప్రకటించాలనే ఆదేశాలున్నాయని అధికారులు చెప్తున్నారు.