PRLIS | హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న వట్టెం రిజర్వాయర్ పంప్‌హౌస్ ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నీట మునిగిపోయింది. ప్రస్తుతం ఆ నీటిని తోడివేసే పనులు చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నప్పటికీ నిధుల లేమి ఆటంకంగా మారింది. విద్యుత్తు కనెక్షన్ సంబంధించిన నిధులను ప్ర భుత్వం విడుదల చేయకపోవడంతో డీవాటరింగ్ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల కురిసిన భారీగా వర్షాలతో నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీపురం శివారులోని నాగనూలు చెరువు ఉప్పొంగడంతోపాటు ఆ చెరువు బ్యాక్‌వాటర్ ఒక్కసారిగా పెరగడంతో సమీపంలోని వట్టెం రిజర్వాయర్‌కు నీటిని తరలించే కట్టకు గండిపడి టన్నెల్లోకి భారీగా నీరు చేరింది.
అదేవిధంగా కుమ్మెర గ్రామ సమీపంలోని చెరువు వరద కూడా టన్నెల్లోకి చేరడంతో చూస్తుండగానే పంప్‌హౌస్ నీట మునిగిపోయింది. దానితోపాటు 16 కి.మీ. పొడవు, 9 మీటర్ల చుట్టుకొలతో ఉన్న 2 సొరంగాలు కూడా పూర్తిగా నీటితో నిండిపోయాయి. ఈ రెండింటిలో కలిపి మొత్తం 34 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రస్తుతం మరింత నీరు చేరకుండా రక్షణ చర్యలు చేపట్టడంతోపాటు పంప్‌హౌస్, సొరంగాల్లో చేరిన నీటిని తోడివేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కానీ, ఆ పంప్‌హౌస్‌కు విద్యుత్తు కనెక్షన్ ఇచ్చేందుకు నిధులను విడుదల చేయడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్నది.
డీవాటరింగ్‌కు నెలన్నర రోజులు
పంప్‌హౌస్, సొరంగాల్లోని వరద నీటిని తొలగించేందుకు మొత్తం 16 పంపులను ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. డీవాటరింగ్‌కు దాదాపు నెలన్నర రోజులు పడుతుందని, ఆ పనుల నిర్వహణకు రూ.2 కోట్లకుపైగా ఖర్చవుతుందని అం చనా వేశారు. కానీ, ఇప్పుడు అలా కాకుండా తొలుత పంప్‌హౌస్, డ్రాఫ్ట్ ట్యూబుల్లో చేరిన దాదాపు 5-6 లక్షల క్యూబిక్ మీటర్ల వరద నీటి అదనపు మోటర్ల ద్వారా తొలగించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఆ తర్వాత ప్రాజెక్టులోని పంపులను సిద్ధం చేసి వాటి ద్వారానే టన్నెల్‌లోని దాదాపు 26 లక్షల క్యూబిక్ మీటర్ల వరద నీటిని తొలగించవచ్చని అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. కానీ, అసలు సమస్య ఇక్కడే మొదలైంది. పంప్‌హౌస్‌కు విద్యుత్తు కనెక్షన్ లేకపోవడంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వాస్తవానికి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్‌లోని మొత్తం 4 పంపింగ్ స్టేషన్లలో ఉద్ధండాపూర్ మినహా మిగిలిన 3 ఇప్పటికే సిద్ధమయ్యాయి.
నార్లాపూర్ పంపింగ్ స్టేషన్లో 145 మెగావాట్ల సామర్థ్యంతో 8, ఏదుల పంపింగ్ స్టేషన్లో 9, వట్టెం పంపింగ్ స్టేషన్లో 9 పంపులను ఏర్పాటు చేశారు. నార్లాపూర్ పంపింగ్ స్టేషన్లో ఇప్పటికే 2 పంపులకు విజయవంతంగా డ్రైరన్, వెట్న్ నిర్వహించిన అధికారులు.. మిగిలిన ఏదుల, వట్టెం పంప్‌హౌస్‌లలోని పంపులను డ్రైరన్, వెట్న్‌క్రు సిద్ధం చేశారు. కానీ, ఆయా పంపింగ్ స్టేషన్లకు విద్యుత్తు సరఫరా లేకపోవడంతో ఆ ప్రక్రియను గత కొన్నినెలలుగా వాయిదా పడుతూ వస్తున్నది. వాటికి సర్వీస్ కనెక్షన్లు ఇవ్వాలంటే ఒకో పంపింగ్ స్టేషన్‌కు దాదాపు రూ.62 కోట్ల చొప్పున మొత్తంగా రూ.124 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు.
ఆ నిధుల కోసం ప్రతిపాదనలు పంపి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదని, విద్యుత్తు కనెక్షన్లు లేకపోవడమే డీవాటరింగ్‌కు ఆటంకంగా మారిందని వివరించారు. ప్రభుత్వం నిధులను విడుదల చేస్తే వెంటనే విద్యుత్తు కనెక్షన్‌ను తీసుకుని డీవాటరింగ్ చేస్తామని, తద్వారా సాధ్యమైనంత త్వరగా పంప్‌హౌస్‌ను పునరుద్ధరించేందుకు అవకాశముంటుందని తెలిపారు. డీవాటరింగ్ తర్వాత మోటర్లను పరీక్షించాలన్నా తప్పకుండా విద్యుత్తు కనెక్షన్ తీసుకోవాల్సిందేనని, నీటమునిగిన పంపులను మళ్లీ సిద్ధం చేసేందుకు 10 నుంచి 20 రోజుల సమయం పడుతుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభు త్వం వెంటనే ట్రాన్స్‌కోకు నిధులు చెల్లించి పంపింగ్ స్టేషన్లకు సర్వీస్ కనెక్షన్ ఇప్పించాలని కోరుతున్నారు.