హైదరాబాద్, మార్చి 21(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో యాసంగి రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేయనున్నది. విడతల వారీగా పంపిణీలో భాగంగా తొలి విడతలో ఒక్క ఎకరా ఉన్న రైతులకే రూ.6వేల చొప్పున పెట్టుబడి సాయం అందించనున్నది. మిగతా విడత రైతుల్లో కొంత మందికి మరో 20 రోజుల తర్వాత రైతుభరోసా పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. రెండో విడతలో ఎంత మందికి, ఎన్ని ఎకరాలకు పంపిణీ చేస్తారనే విషయంపై ప్రభుత్వంలో స్పష్టతలేదు. మరో విడత చివరగా పంపిణీకి నెల రోజుల గడువు విధించింది. అంటే ఏప్రిల్ నెలాఖరు వరకు మిగిలిన రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో తొలి విడతలో ఎకరం రైతులకు మినహా మిగిలిన విడతల్లో ఎప్పుడు, ఎంత మంది రైతులకు, ఎన్ని ఎకరాలకు రైతుభరోసా పంపిణీ చేస్తారనే అంశంపై ఎలాంటి స్పష్టతలేదు.
ఆ మిగతా రైతులకు అసలు రైతుభరోసా పంపిణీ ఉంటుందా? లేక ఎకరం వరకే పంపిణీ చేసి మమ అనిపించేస్తారా? అన్న సందేహాలూ రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వానికి రైతులందరికీ రైతుభరోసా ఇచ్చే ఉద్దేశం ఉంటే గతంలో మాదిరిగా తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు పంపిణీ చేయొచ్చు కదా? అలా కాకుండా విడతల వారీగా పంపిణీ చేయడం, అది కూడా నెలరోజుల గడువు పెట్టడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రైతులందరికీ రైతుభరోసా పంపిణీ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతుల దృష్టి మరల్చేందుకు రైతుభరోసా ఇవ్వడం లేదనే అపవాదును తప్పించేందుకే ఈ డ్రామాకు తెరలేపిందనే విమర్శలొస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులకు 1.5 కోట్ల ఎకరాలకు రూ.9 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ, ఇందులో సగం మందికి పంపిణీ చేస్తే అదే గొప్ప అన్న చర్చలు జరుగుతున్నాయి.
అప్పుతెచ్చిన 9వేల కోట్లు ఏమయ్యాయి?
రైతుభరోసా నిధులను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం రైతుభరోసా కోసమని ఫిబ్రవరి 10న ఆర్బీఐ నుంచి ఏకంగా రూ.9వేల కోట్ల రుణం తీసుకున్నది. రుణం తీసుకొని ఇప్పటికే 40 రోజులు పూర్తవుతుంది. అయినా రైతులకు రైతుభరోసా పంపిణీ చేయలేదు. ఇప్పుడు పంపిణీ చేస్తున్న సర్కార్.. ఒకేసారి ఎందుకు పంపిణీ చేయడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ నిధుల కొరత నిజమే అయితే.. మరి రైతుభరోసా కోసమే అని అప్పుతెచ్చిన ఆ రూ.9వేల కోట్లు ఏమయ్యాయనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ నుంచి తెచ్చిన ఆ అప్పును ప్రభుత్వ పెద్దలు తమకు ఉపయోగపడే పనులకు వినియోగించి రైతులకు కోత పెట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.