Congress Govt | హైదరాబాద్, జనవరి27 (నమస్తే తెలంగాణ): ఎక్సైజ్ శాఖ ద్వారా వేలాది కోట్ల ఆదాయం పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అదే శాఖకు వనరుల కల్పనను మాత్రం అటకెక్కించింది. ఎక్సైజ్ శాఖ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుతూ, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కొత్త ఎక్సైజ్ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేయాలన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం13 నెలులుగా పట్టించుకోవడమే లేదు. గ్రూప్-4 ద్వారాఎక్సైజ్ శాఖను కేటాయించి 72 మంది అభ్యర్థులకు ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది. ఏడాదికి రూ.200 కోట్లకు పైగా ఆదాయం తెచ్చి పెడుతున్న ఎక్సైజ్ స్టేషన్లలో నిర్వహణ ఇబ్బందిగా ఉన్నట్టు క్షేత్రస్థాయి ఫిర్యాదుల నేపథ్యంలో ఒక్కొక్క స్టేషన్‌ను రెండుగా విభజించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 13 ఎక్సైజ్ పోలీస్స్టేషన్లు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక స్టేషన్ చొప్పున కొత్తగా ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం ఆనాడే నివేదికలు రూపొందించింది. ఆ మేరకు 2022 ఆగస్టులోనే అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది. దీంతో 13 కొత్త ఎక్సైజ్ స్టేషన్ల ఏర్పాటు కోసం ఎక్సైజ్ కమిషనర్ నివేదికలు పంపగా, ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతులు వచ్చాయి. ఈ లోపు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అనంతర ప్రక్రియ నిలిచింది. ఈ లోగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక అప్పటి నుంచి ఆ ఫైల్ అటకెక్కింది. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నగర పరిధిలోని శేరిలింగంపల్లి, బాలానగర్, మల్కాజిగిరి, ఘ ట్కేసర్, హయత్‌నగర్, సరూర్‌నగర్, శంషాబాద్, పటాన్చెరు, సికింద్రాబాద్, అమీర్పే ట, జూబ్లీహిల్స్, నాంపల్లి, హనుమకొండ ఎ క్సైజ్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఒక్కో స్టేషన్‌ను అ దనంగా ఏర్పాటుకు అనుమతులు వచ్చాయి.
క్రెడిట్ కేసీఆర్‌కు దక్కుతుందని..
కొత్త ఎక్సైజ్ స్టేషన్లకు అనుమతించి ఉంటే ప్రతి స్టేషన్‌ను ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, 12 మంది కానిస్టేబుళ్లు, ఒక జూనియర్ అసిస్టెంట్, ఇద్దరు అటెండర్లు, ఒక డ్రైవర్ చొప్పున మొత్తం 21 కొత్త ఉద్యోగాల సృష్టి జరిగేది. మొత్తం 14 స్టేషన్లలో కలిపి కనీసం 294 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. సర్వీస్‌లో ఉన్న వారికి పదోన్నతులు లభిస్తాయి. మూడేండ్లపాటు ఒకే చోట పనిచేస్తున్న అధికారులకు బదిలీలు జరుగుతాయి. ఒక్క సంతకంతో పూర్తయ్యే పనిని కాంగ్రెస్ ప్రభుత్వం 13 నెలులుగా తొక్కి పెడుతున్నది. కొత్త ఎక్సైజ్ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేస్తే.. ఆ క్రెడిట్ కేసీఆర్‌కు దక్కుతుందనే ఏకైక కారణంతోనే ఆ ఫైల్‌ను పక్కన పెట్టారని ఎక్సైజ్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా కొత్త పోలీస్స్టేషన్లను ఏర్పాటుచేసి పనిభారాన్ని తగ్గించడంతోపాటు, పదోన్నతులు, బదిలీలకు మార్గం సుగమం చేయాలని వారంతా కోరుతున్నారు.
గ్రూప్-4 అభ్యర్థుల ఎదురుచూపులు
గ్రూప్-4 ద్వారా ఎంపికైన 72 మంది అభ్యర్థులను ఎక్సైజ్ శాఖకు కేటాయించారు. ఈ మేరకు వారికి నియామకపత్రాలను కూడా ఇచ్చారు. ఇది జరిగి రెండు నెలలవుతున్నా పోస్టింగులు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అభ్యర్థులంతా బుధవారం ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు వెంటను పోసింగులు ఇవ్వాలని అభ్యర్ధించారు. ఖాళీల సర్దుబాటు కోసం ప్రభుత్వానికి నివేదిక పంపామని, ప్రభుత్వ అనుమతి రాగానే అందరికీ పోసింగులు ఇస్తామని కమిషనర్ వారికి హామీ ఇచ్చారు.