Paddy Procurement | హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): 47 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే రికార్డా? లేక 92 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే రికార్డా? అయితే, పౌరసరఫరాల సంస్థ, ప్రభుత్వ లెక్కలు చూస్తే పై డౌట్ అందరికీ వస్తుంది. ఈ యాసంగిలో 47.07 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన పౌరసరఫరాల సంస్థ.. ‘ధాన్యం కొనుగోళ్లలో రికార్డు’ అంటూ లీకులిచ్చి తమ అనుకూల మీడియాలో ఆదివారం వార్తలు రాయించుకున్నది. ఈ లీకులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గత కేసీఆర్ ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ఏడాదికేడాది సరికొత్త రికార్డులను సృష్టించింది. 2018-19లో 37 లక్షల టన్నులు, 2019-20లో 64.16 లక్షల టన్నులు, 2020-21లో అయితే ఆల్‌టైం రికార్డు నెలకొల్పింది. ఉమ్మడి రాష్ట్రంలోనూ సాధ్యంకాని విధంగా 92.28 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. అది కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనే. ఆ తర్వాత 2021-22లో 50.39 లక్షల టన్నులు, నిరుడు యాసంగిలో 65.82 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది.
ఈ యాసంగిలో ఇప్పటి వరకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 47.07 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఈ సీజన్లో ధాన్యం కొనుగోళ్లు దాదాపుగా పూర్తయ్యాయని కూడా లీకుల్లో ప్రకటించింది. అయితే, ధాన్యం కొనుగోళ్లు ఐదేండ్ల కనిష్ఠానికి పడిపోవడం గమనార్హం. ప్రస్తుతం ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల కోసం రూ.10,355 కోట్లు రైతులకు చెల్లించి.. ఏదో గొప్ప పని చేసినట్టు ప్రకటించుకొన్నది. 2020-21లో కేసీఆర్ ప్రభు త్వం రైతులకు రూ.17,404 కోట్లు, నిరుడు యాసంగిలో రూ.13,531 కోట్లు చెల్లించింది. గత రికార్డులు ఇలా ఉంటే.. వాటన్నింటిని పక్కన పెట్టి 47.07 లక్షల టన్నులు కొనుగోలు చేసి రైతులకు రూ.10,355 కోట్లు చెల్లించి రికార్డులంటూ గొప్ప లు చెప్పుకోవడంపై జోకులు పేలుతున్నాయి.